మలయాళీ స్టార్లు.. అందరివాళ్లూ!

మలయాళీ చిత్రపరిశ్ర స్థాయి చాలా చిన్నది. ఇప్పటికీ అక్కడ స్టార్‌ హీరో నాలుగైదు కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే పరిస్థితి లేదు! ఒక్కో సినిమాకు సౌత్‌లోని ఇతర భాషల్లోని సూపర్‌స్టార్లు పదికోట్లు, ఇరవై కోట్ల…

మలయాళీ చిత్రపరిశ్ర స్థాయి చాలా చిన్నది. ఇప్పటికీ అక్కడ స్టార్‌ హీరో నాలుగైదు కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే పరిస్థితి లేదు! ఒక్కో సినిమాకు సౌత్‌లోని ఇతర భాషల్లోని సూపర్‌స్టార్లు పదికోట్లు, ఇరవై కోట్ల రూపాయల పొందుతున్న వారూ కూడా ఉన్నారని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. లాభాల్లో వాటాలు, ఒక్కో ప్రాంతం థియేటరికల్‌ రైట్స్‌తో పాటు, శాటిలైట్‌, ఫారెన్‌ థియేటరికల్‌ రైట్స్‌ను పారితోషకంగా తీసుకునే హీరోలు దక్షిణాదిన మస్తుగా ఉన్నారు. తెలుగు, తమిళాల్లో స్టార్‌ హీరోల పారితోషకాలు భారీగా ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ఒకటీ రెండు హిట్లు కొట్టిన యంగ్‌ హీరోల కన్నా మలయాళీ సీనియర్‌, సూపర్‌ హీరోల పారితోషకం చాలా తక్కువని ట్రేడ్‌వర్గాలు చెబుతూ ఉంటాయి.

ఇప్పుడు మనదగ్గర విజయ్‌ దేవరకొండ వంటి హీరో తీసుకునే పారితోషకంతో మలయాళం సూపర్‌ స్టార్‌తో సినిమాకు సైన్‌ పెట్టించవచ్చు అనే అభిప్రాయాలూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం.. మలయాళీ చిత్ర పరిశ్రమ మార్కెట్‌ చిన్నది కావడం. కేవలం హీరోల పారితోషకమే కాదు, అక్కడ హీరోయిన్లకు ఇచ్చేది ఇంకా తక్కువ. నయనతార వంటి మలయాళీ.. తెలుగులోనో, తమిళంలోనో ఒక సినిమా చేస్తే తీసుకునే పారితోషకం కన్నా చాలా చాలా తక్కువ మొత్తానికి మలయాళంలో సినిమాలకు సైన్‌ చేయాల్సి ఉంటుంది. తక్కువ పారితోషకమే అయినప్పటికీ మాతభాషపై ఏదో మమకారంలో స్టార్‌ హీరోయిన్లు అక్కడ సినిమాలను చేస్తూ ఉన్నారు.

పారితోషకాల సంగతలా ఉంటే.. మలయాళీలు ఇప్పుడు అందరి వాళ్లుగా చలామణి అవుతున్నారు. ఇతర భాషల్లో తమ మార్కెట్‌ను బ్రహ్మాండంగా విస్తరించుకుంటూ ఉన్నారు. వివిధ భాషల్లో డైరెక్టు సినిమాలు చేయగల సమర్థులుగా ఇప్పుడు మలయాళీలే గుర్తింపుపొందుతూ ఉండటం గమనార్హం. ఇతర భాషల్లోని స్టార్లకూ పక్కభాషల్లో గుర్తింపుఉంది. దాన్నేం కాదనడం లేదు. అయితే వీళ్లు డబ్బింగ్‌ సినిమాలతో మాత్రమే.. ఇతర భాషల వాళ్లను పలకరిస్తూ ఉంటారు. అది కూడా తెలుగు వాళ్లు ఇటీవలే మొదలుపెట్టారు.

తెలుగు హీరోల సినిమాల డబ్బింగ్‌లు గత ఏడెనిమిదేళ్లలోనే పెరిగాయి. తమిళులు మాత్రం చాలాకాలం నుంచి డబ్బింగులతో ఇతర భాషల్లో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. మలయాళీలు మాత్రం వీరిద్దరికీ భిన్నం. మలయాళీ స్టార్‌ హీరోలు వివిధ భాషల్లో డైరెక్టు సినిమాలు చేస్తూ ఉన్నారు. తద్వారా అన్నిచోట్లా తమకు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ సాగుతూ ఉన్నారు. ముందు నుంచి వీళ్లు అడపాదపా పక్కభాషల సినిమాల్లో, హిందీ సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆ ధోరణి మరింత పెరిగింది.

తెలుగు, తమిళ సినిమాలతో పాటు కన్నడ సినిమాలకు కూడా మలయాళీ స్టార్‌ హీరోలు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ ఉన్నారు. వాళ్లేదో అవకాశాలు తక్కువై ఇతర భాషల్లోకి రావడంలేదు. ఒక్కో మలయాళీ స్టార్‌ హీరో సంవత్సరానికి కనీసం నాలుగైదు సినిమాలు చేస్తూనే ఉంటాడు. వాటితోపాటు అదనంగా ఇతర భాషల్లో నటించడాన్ని కూడా కొనసాగిస్తున్నారు. విశేషం ఏమిటంటే.. సదరు హీరోలు ఓకే అంటే చాలన్నట్టుగా ఇతర భాషల పరిశ్రమల వాళ్లు కూడా వారిచేత సినిమాలు చేయించుకుంటూ ఉన్నారు.

మోహన్‌లాల్‌ తెలుగులో వరసగా 'మనమంతా', 'జనతాగ్యారేజ్‌' సినిమాలు చేశారు. వాటి తర్వాత మోహన్‌లాల్‌ మలయాళీ సినిమాలు తెలుగులోకి డబ్‌ కావడం పెరిగింది. వాటిల్లో 'మన్యంపులి', 'కనుపాప' వంటిసినిమాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. ఇక తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదల కానున్న 'బందోబస్త్‌'తో మోహన్‌లాల్‌ మరోసారి ఇప్పుడు తెలుగు వారిని పలకరించనున్నాడు. ఇక మమ్ముట్టీ గతంలోనే డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో నటించాడు. 'స్వాతికిరణం' వాటిల్లో ప్రముఖమైనది. మరో రెండు మూడు సినిమాలు చేసినా.. వాటి విడుదలలు కూడా సరిగాలేవు. అయితే 'యాత్ర'తో మమ్ముట్టీ మరోసారి తెలుగు వాళ్లను పలకరించారు.

మరోవైపు అడపాదడపా తమిళ సినిమాలూ చేస్తూ వస్తున్నాడు ఈ హీరో. కానీ మమ్ముట్టీ స్టైల్‌ ప్రత్యేకం. సాదాసీదా మాస్‌ మసాలా సినిమాల్లో చేయడానికి ఈ హీరో ముందుకురాడు. మోహన్‌ లాల్‌ను అలాంటి సినిమాలతో తమిళులు, తెలుగువాళ్లు ఒప్పిస్తున్నారు. అయితే  మమ్ముట్టీ మాత్రం పక్కభాషల్లో తను చేసే పాత్రల వెయిట్‌ను గమనిస్తాడు. ప్రత్యేకం అనిపిస్తేనే వాటిని చేయడానికి ముందుకు వస్తారాయన. తెలుగులో చేసిన 'యాత్ర'ను గమనించినా, తమిళంలో ఆయన చేసిన 'పేరన్బు' సినిమాను గమనించిన ఈ విషయం అర్థం అవుతుంది.

హిందీలోనూ ఈ హీరోలు ఒకచూపు చూస్తున్నారు. చాలాకాలం కిందటే మోహన్‌ లాల్‌ను హిందీలో నటింజేశాడు రామ్‌గోపాల్‌ వర్మ. ముంబైలోని ఒక తమిళ పోలీసాఫీసర్‌ పాత్రలో మోహన్‌లాల్‌ను నటింజేశాడు ఈ తెలుగు దర్శకుడు. ఇక మలయాళీ హీరోల్లో పృథ్విరాజ్‌ కూడా హిందీలోనూ ఇతర భాషల్లోనూ తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ.. అతడికి సక్సెస్‌లు లభించడంలేదు!

యువహీరోలూ అదేతీరున!
మలయాళం యంగ్‌ జనరేషన్‌ హీరోలు కూడా మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లో తమ మార్కెట్‌ను సంపాదించుకుంటున్నారు. ఏదో డబ్బింగులతో కాకుండా.. ఆయా భాషల్లో విభిన్నమైన సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి వాళ్లు ముందుకు వస్తున్నారు. ఆ జాబితాలో ముందున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. తండ్రి మమ్ముట్టీ వలె ఇతరభాషల్లో ఆసక్తిదాయకమైన పాత్రలకు ఇతడు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నాడు. తెలుగులో 'మహానటి'లో జెమిని గణేషన్‌ పాత్రను పండించిన ఘనత దుల్కర్‌ సల్మాన్‌దే. నిజంగా జెమిని గణేషన్‌ ఇలానే ఉండేవాడేమో, ఇలానే మాట్లాడేవాడేమో అని తెలుగువాళ్లను నమ్మించాడు దుల్కర్‌. ఇక హిందీలోనే 'కార్వాన్‌' వంటి విభిన్నమైన సినిమాతో ఈ హీరో ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలోనూ మంచి సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నాడు. ఇలా దుల్కర్‌ సల్మాన్‌ పక్కభాషల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నాడు.

అలాగే 'ప్రేమమ్‌' హీరో నివిన్‌ పౌలీ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ హీరో తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. సొంతభాషతో పాటు.. పక్కభాషలోనూ ఒక అడుగుపెడుతూ ఉన్నాడు. తెలుగు, తమిళ హీరోలు కూడా ఇతర భాషల్లో మంచి గుర్తింపునే కలిగి ఉన్నారు. తెలుగు హీరోల్లో కొందరికి మలయాళంలో మంచి గుర్తింపూ ఉంది. అయితే అదంతా డబ్బింగుల చలువ. మలయాళీలు మాత్రం అలాకాకుండా.. అన్నిచోట్లకూ వెళ్లి తమ ఉనికిని చాటుతున్నారు. ఎక్కడికక్కడ అక్కడ వాళ్లమని అనిపిస్తున్నారు!

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!