కోడిపోయినోడు వీధిలో, కోడి తిన్నోడు ఇంట్లో అనేసామెత అచ్చుగుద్దినట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కన్పిస్తోంది. పార్టీ దుంపధూళి అయిపోయి ఘోరఓటమితో బాబు కరకట్టల్లో అక్రమకట్టడమైన వరదముంపు ఇంటికే పరిమితం కాలేదు. కాలుకాలిన పిల్లిలా అమెరికా, హైద్రాబాద్, గుంటూరు, కుప్పం పరుగులు తీస్తున్నారు. అనుక్షణం సీఎం జగన్ మాయ మాటలతో జనాలను నమ్మించి అధికారం చేపట్టాడని గగ్గోలు పెడుతున్నారు. ఏపీ సీఎం పదవిపై సర్వహక్కులు తనవే అన్నట్లు, దాన్ని జగన్ తన్నుకుపోయారన్నట్లు తట్టుకోలేకుండా బాబున్నారు. ఇక్కడ బాబుది కోడిపోయినోడి గగ్గోలు రోడ్లుపై చేస్తున్నారు. కాగా, జగన్ పదేళ్లపాటు ఏపార్టీతో పొత్తులు పెట్టుకోకుండా జనాలనే నమ్ముకుని అనేక రకాల జనయాత్రలు జరిపి జనాల్లో కలిసిపోయారు. పైగా, చంద్రబాబు ప్రజావ్యతిరేకతను టన్నులకొద్దీ మూటకట్టుకునే పాలనతో జగన్‌కు జనాల్లో జననేతను చేసారు. వైకాపానేత జగన్ జన బలంతో బాబును, టీడీపీని మట్టికరిపించి భారీ సంఖ్యాబలంతో కొలువు తీరారు. ఏ నదికి వరదలు వచ్చినా, జగన్ వెళ్లకుండా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ తరహాలో రిమోట్ ఆదేశాలతో సరిపెట్టారు.
మంత్రులను ఎమ్‌ఎల్‌ఏలను, అధికార్లును పంపించేసి వరద పరిస్థితిని చక్కదిద్దుకునే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. వరదబాధితులతో మాటపడకుండా వరదగండం గట్టెక్కించారు. అలా 100రోజుల పాలకుడుగా సీఎం జగన్ జనాలనుంచి అత్తెసరు మార్కులతో చతికిలపడలేదు. మంచి మార్కులే తెచ్చుకున్నారు. జగన్ నోరువిప్పితే, ఏదో ఒక సంక్షేమపథకం జనాలపై రువ్వడం జరుగుతోంది. ఆ కొత్తపథకం ఎప్పుడు ఏనెల ఇచ్చేది నిర్ణయం అప్పుడే ప్రకిటించేస్తున్నారు. ఇవన్నీ బిక్కుబిక్కుమనే చంద్రన్నకు అసలు మింగుడు పడడంలేదు. రాష్ట్ర ఖజానాలో ఏముంది అని చూడకుండా ఇలా పథకాల పరంపరతో పెట్రేగిపోతున్న జగన్ తీరుతో జనాలు ఎట్టి పరిస్థితిల్లో యూటర్న్ తీసుకుని 'జై టీడీపీ'అనలేరే అని దిగాలెత్తి పోతున్నారు. అందుకే జగన్ ఏపథకం అమలు చేస్తున్నా దానికి పెట్టాల్సిన వంకలు బాబు అండ్‌కో పెడుతునే ఉన్నారు. టీడీపీ జగన్ సర్కారుపై చేస్తున్న కూతలు-వాతలు, తట్టలకొద్దీ అరోపణలు, అభియోగాలు జనాలకు ఎక్కడంలేదు. ఉత్త అరణ్యరోదనే అవుతోంది.
చంద్రబాబు 58నెలలు తనస్వంతానికి, తనపార్టీవాళ్లకు ఆర్థిక ప్రయోజనాలతో కూడిన తన ఏలుబాటు పుష్కళంగా చేసారు. 2నెలలు జనాలకు చేతికి ఎముకలేకుండా దానకర్ణుడు అనిపించుకునే యావలో ఎన్నికల్లో గెలుపు గుర్రంనాదే అని పావులు కదిపారు. ప్రజలకు అదిచేస్తాను, ఇది చేస్తానని 600 హామీల దంపుడులో పదేళ్ల ఓటమి తర్వాత గెలిచిన చంద్రన్న ఐదేళ్లుచూపాల్సిన నరకం ప్రజలకు ప్రత్యక్షంగా చూపించేసారు. దాంతో ప్రజాగ్రహం అంటే ఏమిటో ప్రజలు కసిదీరా చూపించి, తేరుకోకుండా కృష్ణా కరకట్టల్లో అక్రమకట్టడంలో బాబు చెవులుమూసి కుదగొట్టేసారు. అధికారం ఉన్నప్పుడు నేత అనేవాడు ఎలాఉంటాడు అనేది బాబు ప్రజలకు పదేళ్లపాటు చూపినంతగా ఏఒక్క సీఎం చూపలేదు. ఆతర్వాత పదేళ్లపాటు జనాగ్రహానికి గురయి ప్రతిపక్షంలో దర్జాలు, దర్పాలు కోల్పోయి ఆల్‌ఫ్రీ హామీల దంపుడు ప్రజల్లో ఆరంభించారు. జాలిగొట్టు జనాలు 'మారాడు మా చంద్రబాబు' అని గెలిపిస్తే ప్రజలపై విశ్వాసం లేశమైన చూపలేదు.
పదేళ్లపాటు ఓడించిన ప్రజలపై ఐదేళ్లు సీఎంగా ప్రతీకారంగానే పాలనలో జనాలకు చుక్కలుచూపారు. ఆపైన సీఎంగా ప్రధానిని మించిన హోదాను వెలగబెట్టి ఘనచరిత్రను లిఖించేలా చేసుకున్నారు. మళ్లీ మాకొద్దీ మారని బాబు అని ఘోరఓటమి పాల్జేసిన జనాలపై చంద్రబాబు అధికారం లేనందున చిరుబుర్రులకే నేడుపరిమితం అయ్యారు. ఏదో ఒకరోజు జనాలు మళ్లీ గెలిపించి దొరక్కపోరు. అప్పుడు చూపుతాను నాతడాఖా! మజాఖా!! అన్నట్లుగా కసి, కార్పణ్యం మనస్సులో నిక్షిప్తం చేసుకుని లేనినవ్వు ముఖంలో రుద్దుతున్నారు. ఎంతో అభివృద్ధి చేస్తే ఎందుకు ఓడించారో తెలియడంలేదనే ఒకబూటకపు భేతాళ ప్రశ్నను మీడియాలో పెదాల్లోంచి రాగాలను పలికిస్తున్నారు. ఎందుకు ఓడించామో? జనాలకు, ఎందుకు ఓడామో బాబు అండ్‌కోకి తెలిసి నంతగా వైసీపికి కూడా తెలియదు. రాష్ట్రవ్యాపితంగా జనమంతా కూడబలుక్కుని మరీ బాబు అండ్‌కో తోకలు మొయ్య కత్తిరించేసారు.
కొత్తసర్కారు జగన్ సారధ్యంలో ఏర్పాటు అయిన నాటి నుంచి బాబు అండ్ బేటా కొత్తసర్కారుపై చేయని ఆరోపణ లేదు. వేయని నిందలేదన్నట్లుగా అదేపనిగా ఆరోపణలతో మళ్లీ జనాలను నమ్మించేయత్నంలో తలమునకలై ఉన్నారు. ఈసారి ఒక్క జగన్‌నే టార్గెట్ చేసుకున్నారు. మోదీ ఊసేత్తకుండా కనీసం నిద్రలో కలవరించకుండా అమరావతిలోనే వేయాల్సిన చిందులు జగన్‌పైనే వేస్తున్నారు. నిన్నటివరకు కొత్త సర్కారుపై చేసిన తీవ్రారోపణలు జనాలు పట్టించుకోక పోవడంతో ఇప్పుడు పల్నాడులో వైసీపీ దాడుల్లో బలవుతున్న టీడీపీ వారికి రక్షణ కవచం తానయినట్లు పెయిడ్ ఆర్టిస్టులతో బాబు శ్రీకారం చుట్టారు. అక్కడ జనాలు మీడియాల్లో ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం లేనిపోని ఆజ్యం పోయకండి అని తిప్పి కొట్టినట్లు చెప్పారు. మాగ్రామాల్లో ఏ పిల్లగాడిని అడిగినా, మూలపడ్డ ముసలమ్మను అడిగినా చెబుతారు. బాబు వస్తే స్వాగతించి చెబుతాం అని బాబు ఏర్పాటు చేసిన ఆజ్యం కుండను బద్దలుకొట్టారు.
మరోవైపు మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయి. అప్పుడు మనమే ఏలుబడిలోకి వస్తాం అని పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా బాబు జమిలిఎన్నికలకు తేనే పూతలుపూసి ఆశలు నింపేయత్నం ఆరంభించారు. అధికారం కోల్పోయి అన్నివైపులా దారులు బంద్‌కావడంతో చేష్టలుడిగిన బాబు కాలేపెనంమీద పడ్డట్టుగా అయిపోయారు. బాబుతో బాటు తినమరిగిన పార్టీనేతలు కూడా అదే పెనంపై విలవిలమంటున్నారు. ఏదో ఒక చూరు పట్టుకుని వేలాడుదాం అని బాబు రెడీ అయితే, బాబు వేలాడే చూరుకు మనం వేలాడడం బాబు తోకపట్టుకుని గోదారి ఈదినట్టే ఉంటుందని క్యాడర్ చాలావరకు ముఖం చాటేస్తోంది. ఇక రాష్ట్రంలో పవన్‌పార్టీ సిన్మాల్లో గెష్టు ఆర్టిస్టులాంటిదని ప్రజలు ఏనాడో గుర్తించేసారు. ఆ గుర్తింపులోనే పవన్ కూడా అప్పుడప్పుడు రాష్ట్రంలో అడుగెట్టి మీడియాలో వచ్చే పొలిటికల్ అప్‌డేట్సు ఏకరవుపెట్టి పోవడమే. పవన్ 2014లో తనకు తానే ఎదురొచ్చి పొత్తు పెట్టుకున్న తీరు బాబు గుర్తు చేసుకున్నారు.
బాబు పవన్‌ను తనమాటలను వల్లించేలా ఏర్పాటు చేసుకున్నారు. బాబు స్క్రిప్టును వల్లింపులో పవన్ తు.చ. తప్పడంలేదు. జనాలను సర్వసామాన్యులుగా వారికి మనమేమి చెబితే అదే రాజకీయం అనేట్లుగా బాబు, పవన్‌లు జనాల్లో రెచ్చుతున్నారు. సోషల్‌మీడియా, టచ్‌సెల్ పుణ్యమా అని సర్వ జనులు రాజకీయ పండితులయ్యారు. వారిముందు ఎలాంటి బాబు, పవన్‌ల కంయ్‌కుంయ్‌లు పనిచేయవు. జనాలను హింసించే పాలకుడు బాబుకు చెవులు మూసేసారు. ఏమాట మీద నిలబడని సిన్మానటులకు జనాలు ఓటేసి, గెలిపించి అధికారపీఠమెక్కించే అమాయకత్వం ఎన్‌టీఆర్‌తోనే ముగింపు పలికేసారు. పీఆర్‌పీ ఓటమితో జననాడి పట్టేసిన చిరు తనపార్టీని జనాల్లో నిలపలేమని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసి, చేతులు దులిపేసుకున్నారు. కాంగ్రెస్‌ను రాష్ట్రంలో నడిపేనేతగా చిరును కాంగ్రెస్ అధిష్టానం ఓట్ల రాజకీయాలు చేయచూస్తే కాదని తన సినీమాదారిలో సాగిపోయారు. పవన్ అటు సిన్మా, ఇటు రాజకీయాలు ఒకేసారి చేయాలనుకుంటే ఫలితం రెంటికి చెడ్డరేవడే.
ప్రజల్లో పవన్‌పై బాబు పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒకరయ్యారని టాక్ రాజుకుంటోంది. పవన్ తీరు మార్చుకుంటే జనాల్లో రాజకీయరాణింపు దశలవారిగా రావచ్చు. ఇదే ధోరణి కనబరిస్తే జోకర్ రాజకీయాలుగా జనగుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర బీజేపీ నేతలు అన్నిస్థానాల్లో పోటీబరిలో ఉన్నా ఒక్కస్థానాన్ని కైవసం చేసుకోలేక చతికిలపడ్డారు. దీనికి ప్రభలకారణం కేంద్రంలో మోదీ ఈసారి గెలవరు అని అప్పటి సీఎం చంద్రబాబు దేశవ్యాప్తంగా ఊదరగొట్టుడే కారణమయ్యింది. దాంతో ఎన్నికల్లో ఖర్చులు నిమిత్తం పార్టీ ఇచ్చింది కూడా జేబుల్లోంచి తీయనేలేదు. కొన్నిచోట్ల గెలుపు గ్యారెంటీ అనుకున్న స్థానాల్లో వైకాపా కొల్లకొట్టుకుంది. కేంద్రంలో మోదీ సర్కారు మరింత తేజరిల్లడంతో రాష్ట్రంలో బీజేపీ అయ్యో తాచెడ్డకోతి వనమెల్లా చెరిచిందే అని బాబుపై గుంయ్‌మన్నారు. బాబు ఘోర ఓటమిలోంచి 72గంటల్లో తేరుకుని రాజకీయ కల్లోలానికి ఉవ్వెత్తున తెరలులేపారు.
బాబు కొరివితో తలగోకినట్లు మోదీతో చెలగాటమాడినందున కేసుల్లో ఇరికించి జైలుపాలు చేస్తారనే భయంతో నిలువెల్లా కంపరమెత్తిపోయారు. కోవర్టులుగా ఉంటామని తన రాజ్యసభ ఎంపీలతో మాటతీసుకుని బీజేపీ తీర్ధం ఆబగా తాగేలా చేసేసారని టీడీపీలోనే చెవులు కొరుక్కున్నారు. బాబు ఎత్తుగడతో రాష్ట్ర బీజేపీకి ఉన్ననట్టులు, బోల్టులు ఊడిపోయాయి. ఇప్పుడు సుజనా చౌదరి బీజేపీలో ఏపీకి సంబందించిన చక్రం గిర్రునతిప్పేలా కేంద్రమంత్రుల పక్కన కూర్చుని మీడియా మెరుపులు మెరిపించడంతో రాష్ట్ర బీజేపీకి నిస్సత్తువ నిలువెత్తున ఆవహించింది. ఇదేదో ఈనగాచి నక్కల పాలయ్యిందన్నట్లు బీజేపీ జండాలు మోయడానికేనా అని రాష్ట్ర బీజేపీ నేతలు నొసలు నొక్కుకోసాగారు. సుజనాతో వెళ్లిన ఎంపీల్లో టిజి.వెంకటేష్ మాత్రం తనదైన శైలిని ప్రదర్శనలో ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఘోర ఓటమికి కారణం పక్కాగా బాబూ, లోకేషే అని చెప్పడంలో వెనుకాడలేదు. కోవర్టుకూతల్లా లేవని సుజనా చౌదరి అడిగినా అందుకు వెంటేష్ నిజాలే మాట్లాడాలి.
రాజకీయాల్లో కోవర్టు పాత్ర క్షణికమే. మనకెందుకు కంచిగరుడ సేవ. బాబు ఇప్పుడేకాదు ఎప్పుడూ తేరుకోలేడు. బాబు మాటవల్లింపు వృధా ఆయాసమే అన్నట్లు మరిన్ని విమర్శలు బాబుపై గుప్పించారు అమరావతి ఇప్పుడు ఉన్నచోట నిర్మాణం వేష్టు అని కూడా చెప్పి కోవర్టును కాను. బీజేపీ ఎంపీని అన్నట్లుగా చాటుకున్నారు. టిజి. వెంటేష్ ప్రవర్తనకు షాక్ కావడం టీడీపీ వంతయ్యింది. రాష్ట్ర బీజేపీ కూడా కోవర్టు ఎంపీిలను చూసి పట్టు వదిలేయరాదని జగన్‌సర్కారుపై విమర్శలు గుప్పింపులో నాలుకలు పదును పెట్టేసారు. అయితే, బాబుతో బాటే రాష్ట్ర బీజేపీ అడుగులు వేస్తోందని, పెయిడ్ మాఫియా ఎఫెక్టు అనే టాక్ జనాల్లో ఆరంభం అయ్యింది. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ దయనీయమైన స్థితిలో నేడు ఏపీలో ఉన్నారా అంటే ఉన్నాం అని అవసాన మూలుగులు మూలుగుతోంది.
2014 నాటికి కాంగ్రెస్‌ను పాడెమీదకు చేర్చారు ఏపీ ప్రజలు. అలా ఎందుకు చేసారంటే ఏపీని విభజించారని అందుకే ఏపీ ప్రజలు కినుక వహించారనే కథనాన్ని విన్పించే కాంగ్రెస్ నేతలున్నారు. వాస్తవానికి విభజన కానేకాదు. అసలు కారణం ఏమిటో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు, క్యాడర్‌కు తెలుసు. వైయస్ మృతి, ఆతర్వాత జగన్‌ను సీబీఐ కేసుల్లో ఇరికించడం. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబును శిఖండినిచేసి ఆమాటున 11కేసులు వేయడం. 16నెలలు జగన్‌ను జైలు పాలు చేయడం వంటివి సోనియా చేసినందునే ఏపీ జనాలు కాంగ్రెస్‌కు పాడిఎక్కించి 2014లో తలకడిగేసుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఏపీ జనాలు కాంగ్రెస్‌పై వీసమెత్తు జాలి చూపలేదు. కాంగ్రెస్‌కు కాయకల్పచికిత్సలు చేసినా మరి కోలుకోదు ప్రేతకళలతో పార్టీ పాడి దిగనంటోంది. ఏపీలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోయినట్లే. మరో పార్టీలోకి పోలేక కాంగ్రెస్‌లో ఉంటూ అప్పుడప్పుడు జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నామన్నట్లు మీడియా కూతలు కూస్తున్నారు.
-యర్నాగుల సుధాకరరావు