బాబు ముందు పెద్ద పజిల్‌..!

పజిల్స్‌ గురించి అందరికీ తెలుసు. వాటిని సాల్వ్‌ చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. కొన్ని పజిల్స్‌ ఎంత ప్రయత్నించినా సాల్వ్‌ కావు. చికాకు పుడుతుంది. చివరకు వదిలేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందు…

పజిల్స్‌ గురించి అందరికీ తెలుసు. వాటిని సాల్వ్‌ చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. కొన్ని పజిల్స్‌ ఎంత ప్రయత్నించినా సాల్వ్‌ కావు. చికాకు పుడుతుంది. చివరకు వదిలేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందు ఓ పెద్ద పొలిటికల్‌ పజిల్‌ ఉంది. దాన్ని పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తానని చెబుతున్నారు. అది ఎంతవరకు పూర్తి చేస్తారనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. నలభై ఏళ్ల ఆయన రాజకీయ అనుభవానికి ఇది పెద్ద సవాలుగా నిలిచింది. ఇంతకూ ఆయన ముందున్న పెద్ద పజిల్‌ ఏమిటి? అదే…తెలంగాణలో టీడీపీని బతికించుకోవడం. అది బతకాలంటే మామూలు విషయం కాదు. దానికి కొత్త రక్తం ఎక్కించడం మాటలు కాదు. కాని చంద్రబాబు ఎంతో ఆశావహ దృక్పథంతో ఉన్నారు.

పార్టీలో మిగిలివున్న కొద్దిమంది నాయకులకు, కేడర్‌కు ధైర్యం నూరిపోస్తున్నారు. శ్రీశ్రీ అన్నట్లుగా 'వస్తున్నాయ్‌…వస్తున్నాయ్‌…జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్‌' అనే భావన కల్పిస్తున్నారు. దాదాపు పది నెలల తరువాత హైదరాబాదులోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన బాబు నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎప్పటిమాదిరిగానే ధైర్యం చెప్పారు. ఓదార్చారు. తెలంగాణలో టీడీపీ ఉండటం చారిత్రక అవసరమన్నారు. ఏనాటికైనా ఈ రాష్ట్రంలో టీడీపీ జెండా మళ్లీ ఎగురుతుందని చెప్పారు. ఇకనుంచి ప్రతి శనివారం కార్యాలయానికి వచ్చి సమావేశం పెడతానన్నారు. తెలంగాణ టీడీపీ గురించి తాను చాలా సీరియస్‌గా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. బాబు వైఖరి చూస్తుంటే ఆయనలో చాలా మార్పు వచ్చినట్లు కనబడుతోంది.

ఏపీలో ఓటమి బాధ నుంచి బయటపడినట్లుగా కనిపిస్తున్నారు. గతంలో మాదిరిగా ఆవేదనా గీతం పాడలేదు. ఏపీలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. పార్టీని బతికించుకోవడానికి రెండు రాష్ట్రాల్లోనూ ఒంటరి పోరాటమే చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బాబు పరిపాలన సాగించినప్పుడు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఓ వెలుగు వెలిగిన తెలంగాణ నాయకులంతా గూటిని వదిలిన పక్షుల్లా వెళ్లిపోయారు. ఈమధ్య కూడా కొందరు బీజేపీలో చేరారు. ప్రస్తుతం పార్టీ నామమాత్రంగా మిగిలింది. లీడర్లు పోయినా కేడర్‌ ఎక్కడికీ పోలేదనే రొటీన్‌ డైలాగునే బాబు చెబుతున్నారు. కేడర్‌ పార్టీ వెంట ఉందో లేదో ఎవరు చెప్పగలరు? పార్టీ బతికి ఉందని చెప్పడానికి పైకి కనబడని కేడర్‌ కొలబద్ద కాదు.

ఎన్నికల (పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు) ఫలితాలే కొలబద్దగా తీసుకోవాలి. వివిధ చట్టసభల్లో, పాలన సంస్థల్లో ఉన్న ప్రతినిధులే ప్రామాణికంగా పరిగణించాలి. ఆ లెక్కన చూస్తే తెలంగాణలో టీడీపీలో ప్రజాప్రతినిధులు ఏరీ? అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు (అదీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి) గెలిస్తే ఒకాయన టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయాడు. ఇంక మిగిలిన ఒకాయనను కూడా గులాబీ పార్టీ లాగేసుకుందామంటే ఆయన 'చల్‌ పోండి' అంటూ పసుపు పార్టీలోనే ఉండిపోయాడు. ఆ ఒక్క ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును చంద్రబాబు ఆకాశానికి ఎత్తేశారు. ఇంకో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే. 'నేను టీఆర్‌ఎస్‌లో లేను, టీడీపీలో లేను. గాల్లో ఉన్నా' అని ఆయన ఆవేదన పడుతున్నాడు.

తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తానని చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. కాని ఇప్పటివరకు అందుకు అవసరమైన ప్రణాళిక తయారుచేసినట్లు కనబడటంలేదు. టీడీపీ అనుకూల మీడియాలోనూ ఇందుకు సంబంధించిన సమాచారం రావడంలేదు. బాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ టీడీపీకి శనివారం కేటాయించారు. ఆయన కార్యాచరణ ఏమిటో తెలిస్తేగాని పార్టీని ఎలా బతికించాలనుకుంటున్నారో అర్థమవుతుంది. తెలంగాణలో వైఎస్‌ జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీలను వదిలేశారు. సీఎం కేసీఆర్‌కు జగన్‌ జిగ్రీ దోస్తు కాబట్టి ఆయన తెలంగాణలో అడుగు పెట్టడు.

పవన్‌ కళ్యాణ్‌ ఏపీలోనే తిప్పలు పడుతున్నాడు కాబట్టి తెలంగాణ వైపు చూడకపోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఈదులాడే నాయకుడు చంద్రబాబు మాత్రమే. రాజకీయంగా, పరిపాలనాపరంగా జగన్‌కు, పవన్‌కు లేని అనుబంధం తెలంగాణతో బాబుకు ఉంది. బాబు రాజకీయ జీవితం సింహభాగం తెలంగాణ కేంద్రంగా అంటే హైదరాబాదు కేంద్రంగా గడిచింది. అందుకే తెలంగాణలో పార్టీ బతకాలని తాపత్రయపడుతున్నారు. పార్టీని పునరుజ్జీవింపచేయాలనే ఆయన పట్టుదల అభినందనీయం. కాని ఈ పజిల్‌ను ఆయన ఎలా సాల్వ్‌ చేస్తారనేదే ఆసక్తికరం. బద్ధ శత్రువు కేసీఆర్‌ రాజ్యంలో ఆయన ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి. 

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!