ప్రముఖ మహిళా కమెడియన్‌పై సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి అసభ్య పదజాలంతో దూషణకు దిగాడు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు సదరు బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
ముంబయ్‌కి చెందిన స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువా హిందీ ప్రేక్షకులకి సుపరిచితురాలు. కమెడియన్ అయిన మహిళా నటికి చేదు అనుభవం ఎదురైంది. 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్న చత్రపతి శివాజీ విగ్రహం గురించి ఆమె సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఈ వీడియోలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఏడాది క్రితం జరిగిన తంతు.
అయితే అకస్మాత్తుగా ఇప్పుడు ఆ వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమెపై నెటిజన్లు విమర్శల దాడికి దిగారు. మరాఠా పాలకుడు చత్రపతి శివాజీని అగ్రిమా జాషువా కించపరిచారని పలువురు విమర్శల బాణాలు సంధించారు. అయితే విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వడోదరకు చెందిన శుభం మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాపై అసభ్య పదజాలంతో దూషణకు దిగాడు. లైంగిక వేధింపులతో బెదిరింపులకు దిగుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ వీడియో షేర్ చేశాడు.
సదరు బెదిరింపు వీడియోపై బాధితురాలు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ వెంటనే స్పందించి నిందితుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మా గుజరాత్ డీజీపీకి లేఖ రాశారు.
వడోదర పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుజరాత్ డీజీపీ శివానందర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా చత్రపతి శివాజీ అనుచరుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె క్షమపణలు కోరారు. ఏడాది క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను ఆమె తొలగించడం గమనార్హం.