యాక్సిడెంట్ కు గురై ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు సాయిధరమ్ తేజ్. దీంతో అతడు నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంతకుముందు చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమైంది. ఈ మేరకు సాయితేజ్ కోసం మెగాబ్రదర్స్ రంగంలోకి దిగారు.
రిపబ్లిక్ ట్రయిలర్ రేపు రిలీజ్ అవ్వబోతోంది. రేపు ఉదయం 10 గంటలకు చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రయిలర్ లాంచ్ కాబోతోంది. అలా సాయితేజ్ కోసం చిరంజీవి రంగంలోకి దిగారు. సినిమాకు తన వంతుగా ప్రచారం కల్పించబోతున్నారు.
ఇక రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు. మరో 4 రోజుల్లో (25వ తేదీన) జరగనున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరై సినిమాకు ప్రచారం కల్పించబోతున్నారు. ఆ తర్వాత దర్శకుడు, హీరోయిన్, నిర్మాతలు ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి.. అక్టోబర్ 1న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.
పవన్, చిరంజీవితో పాటు మెగాహీరోలంతా విడుదల రోజు ట్వీట్స్ పెట్టబోతున్నారు. ఇక విడుదలకు సరిగ్గా కొన్ని గంటల ముందు చిరంజీవితో ఓ వీడియో బైట్ విడుదల చేసే ప్లాన్ కూడా ఉన్నప్పటికీ అదింకా ఫైనలైజ్ అవ్వలేదు.
ఇక సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి చూస్తే.. ఆయనకు మరో సర్జరీ చేశారు వైద్యులు. ఇప్పటికే కాలర్ బోన్ సర్జరీని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన డాక్టర్లు.. తాజాగా వోకల్ కార్డ్ కు కూడా ఆపరేషన్ చేసినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ కు షిఫ్ట్ చేశారు.
ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్యం మరింత మెరుగైందని ప్రకటించిన వైద్యులు.. మరో 3 రోజుల్లో తుది పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందంటున్నారు.