ఏపీ బీజేపీకి సినీ గ్లామర్ జతచేరింది. కొన్నాళ్లుగా బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉన్న ఆ పార్టీ నేత జయప్రద, రాజమండ్రి సభలో తళుక్కున మెరిశారు. ఆయ్.. నాది కూడా రాజమండ్రేనండి.. అనేశారు. ఉన్నట్టుండి ఆమెకు రాజమండ్రిపై ప్రేమెందుకు పుట్టుకొచ్చిందో తేలాల్సి ఉంది. ఏపీ రాజకీయాల్లో ఆమె బిజీ అయ్యే అవకాశాలున్నాయి.
ఆమధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బిజీ కాబోతున్నానంటూ సన్నిహితుల వద్ద మనసులో మాట బయటపెట్టారు జయప్రద. అయితే ఆమె తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెడతారని, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె ఉన్నట్టుండి ఏపీ బీజేపీ సభలో ప్రత్యక్షమయ్యారు.
తన జన్మభూమి రాజమండ్రి అని, కర్మభూమి ఉత్తర ప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా తాను ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చారు. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు, రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయని, రైతులు కష్టపడుతున్నారని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ విమర్శించారు.
సినీ నటులకు, అందులోనూ నటీమణులకు బీజేపీ ప్రముఖ స్థానం కల్పిస్తోంది. క్రికెటర్లు, ఇతర రంగాల ప్రముఖులను కూడా ఆ పార్టీ తమ వైపు తిప్పుకుంటోంది. దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ సినీ నటులు బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకుంటూనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ బీజేపీకి విజయశాంతి సినీ గ్లామర్ తోడుగా ఉండేది. మాధవీలత, రేష్మ వంటి హీరోయిన్లు ఎన్నికల సమయంలో ఇలా వచ్చి అలా వెళ్తుండేవారు.
ఏపీ విషయానికొస్తే మహిళా విభాగంలో పురంధ్రీశ్వరి మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ నాయకులు లేరు. యామినీ శర్మ ఓ దశలో బీజేపీకి కాస్త క్రేజ్ తీసుకొచ్చినా, ఇప్పుడు ఆమె కూడా వెనక్కు తగ్గినట్టు కనిపిస్తున్నారు. తాజాగా జయప్రద తానున్నానంటూ ముందుకొచ్చారు.
జయప్రద ఏపీ రాజకీయాలకు ఫిక్స్ కాబోతున్నారనే విషయం రాజమండ్రి మీటింగ్ తో స్పష్టమైంది. అయితే ఏపీలో ఆమె ఎక్కడ పోటీ చేస్తారనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది. రాజమండ్రికి జయప్రద ఫిక్స్ అవుతారా, లేక ప్రచారానికి పరిమితమై నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.