జ‌గ‌న్‌తో టీడీపీకి గండం!

నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీడీపీ గ‌డ్డు రోజులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వ‌మంత వ‌య‌సు క‌లిగిన వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీడీపీ పాలిట…

నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీడీపీ గ‌డ్డు రోజులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వ‌మంత వ‌య‌సు క‌లిగిన వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీడీపీ పాలిట య‌ముడయ్యారు. జ‌గ‌న్‌తో టీడీపీకి గండం పొంచి వుంద‌ని చంద్ర‌బాబు వెన్నులో వ‌ణుకు పుడుతోంది. టీడీపీకి భ‌విష్య‌త్ లేక‌పోతే, ఆ పార్టీ నాయ‌కుల‌కు కూడా భ‌విష్య‌త్ లేద‌నే భ‌యాందోళ‌న వారిని వెంటాడుతోంది.

క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగం వింటే… జ‌గ‌న్ అంటే ఎంత‌గా భ‌య‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది. “వైఎస్ జ‌గ‌న్‌ను ఇంటికి సాగ‌నంపితే త‌ప్ప ఈ రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు మోక్షం లేదు” అని బాబు స్ప‌ష్టం చేశారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఓడించ‌కపోతే రాష్ట్రానికి, ప్ర‌జ‌లకు మోక్షం సంగ‌తేమో గానీ, టీడీపీకి మాత్రం పుట్ట‌గ‌తులుండ‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ద‌ఫా టీడీపీ అధికారంలోకి రాక‌పోతే ఏం జ‌రుగుతుందో అదే స‌భ‌లో చంద్ర‌బాబు నేరుగానే చెప్ప‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

ఇక రాజ‌కీయంగా శాశ్వ‌తంగా తాను దూర‌మ‌వుతాన‌ని ఉద్వేగంగా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి చేయ‌డానికి ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ఓడించ‌రు. త‌మ బ‌తుకుదెరువుకు ఇబ్బందిక‌రంగా జ‌గ‌న్ పాలిస్తున్నాడ‌ని భావిస్తే మాత్రం వైసీసీని జ‌నం ఇంటికి సాగ‌నంపుతారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు పుణ్య‌మా అని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బ‌లంగా వుంది. టీడీపీ చెబుతున్నంత‌గా జ‌గ‌న్‌ను ఓడించాల‌నే క‌క్ష‌తో జ‌నం లేర‌నే మాట వినిపిస్తోంది.

అయితే చంద్ర‌బాబు వ‌య‌సు పైబ‌డుతుండ‌డం, వార‌సుడైన లోకేశ్ త‌న నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌ను నిరూపించుకోలేక‌పోవ‌డం టీడీపీకి శాపంగా మారాయి. చంద్ర‌బాబు త‌ర్వాత టీడీపీని కాపాడేది ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. దీంతో ఆ పార్టీ నాయ‌కుల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. క‌నీసం అధికారం వుంటే, పార్టీని అంటిపెట్టుకుని వుంటారు. అది లేనప్పుడు టీడీపీలో ఎందుకు కొన‌సాగాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంది.

ఇవన్నీ తెలిసిన నాయ‌కుడిగా చంద్ర‌బాబులో టీడీపీ భ‌విష్య‌త్‌పై ఆందోళ‌న మొద‌లైంది. ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త నింపేందుకు త‌న భ‌విష్య‌త్ రాష్ట్ర భ‌విష్య‌త్‌గా చెప్ప‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌ల‌కు కాలం చెల్లింద‌నే సంగ‌తి తెలియ‌క‌, అతిశ‌యోక్తుల‌కు వెళుతున్నారు.