సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు అనే ఆలోచన ఒకటి కుటుంబ సభ్యుల ప్లానింగ్ లో వున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మారక చిహ్నం అనేది జస్ట్ ఓ విగ్రహం లేదా సమాధి మాదిరిగా కాకుండా, కొంత సేపు జనాలు చూడగలిగేలా వుండాలన్నది మహేష్ బాబు ఇతర కుటుంబ సభ్యుల ఆలోచనగా వుందని తెలుస్తోంది.
కృష్ణ కు సంబంధించిన సినిమా గురుతులు చాలా వున్నాయి. అవార్డులు, షీల్డ్ లు ఇంకా అనేక వస్తువులు అన్నీ ఓ పద్దతిగా ఆ మెమోరియల్ లో వుంచుతారు. అలాగే కృష్ణ నటించిన 350 సినిమాల్లో కీలకమైన పాత్రల లైఫ్ సైజ్ ఫొటోలు అక్కడ ప్రదర్శనకు అనుకూలంగా ఫిక్స్ చేస్తారు.
ఫిలిం నగర్ పద్మాలయా దగ్గర ఈ మెమోరియల్ ను నిర్మిస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన వుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఏ హీరో కి ఇలాంటి మెమోరియల్ అన్నది లేదు. ఎన్టీఆర్ మెమోరియల్ లో సమాధి తప్ప మరేం లేదు. ఎన్టీఆర్ సినిమా సామగ్రి చాలా వుంది. అది లక్ష్మీ పార్వతి దగ్గర వుంటే హరికృష్ణ అండ్ కో స్వాధీనం చేసుకున్నారు. మరి అవి ఇప్పుడు ఎక్కడ వున్నాయో ఎవరికీ తెలియదు.
ఎఎన్నార్ తన అవార్డులు అవీ ఒక్క దగ్గర వుంచి, ఇలాంటిది చేయాలని అనుకున్నారు. కానీ ఆయన మరణించాక అది అలా వుండిపోయింది. అన్నపూర్ణ స్టూడియోలో ఎఎన్నార్ అవార్డులు అవీ వుంచిన గదిలో దొంగతనం ప్రయత్నం కూడా జరిగింది.ఎఎన్నార్ కు అన్నపూర్ణలో ఓ విగ్రహం కూడా లేదు. అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడ ఎఎన్నార్ దహనకార్యక్రమాలు నిర్వహించారో తెలిసేలా ఓ గురుతు కూడా ఏర్పాటు చేయలేదు.
చాలా మంది సినిమా పెద్దల దహన కార్యక్రమాలు అయిన తరువాత, అక్కడ ఓ సమాధి నిర్మాణం తప్ప మరే విధమైన కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. కనీసం కృష్ణ కోసం అయినా కుటుంబ సభ్యులు స్మారక మందిరం జనం, అభిమానులు చూసేలా తయారు చేస్తే మంచి ఆలోచనే అవుతుంది. కృష్ణ కుటుంబ సభ్యుల్లో ప్రస్తుతం ఇంకా అంకుర దశలో వున్న ఈ ఆలోచన వాస్తవ రూపం దాలిస్తే అభిమానులకు ఆనందమే.