మంచు ముంచుతోంది… వణుకుడే వణుకుడు

చలికాలం పవర్ ఏంటో చూడాలీ అంటే విశాఖ ఏజెన్సీ ప్రాంతాలను వెళ్లాల్సిందే. శీతాకాలంలో ఇక్కడ చలి పులి స్వైర విహారం చేస్తుంది. మంచుతో ఊళ్లకు ఊళ్లు కప్పబడిపోతాయి. పరిసరాలు అన్నీ కూడా హిమసీమలను తలపిస్తాయి.…

చలికాలం పవర్ ఏంటో చూడాలీ అంటే విశాఖ ఏజెన్సీ ప్రాంతాలను వెళ్లాల్సిందే. శీతాకాలంలో ఇక్కడ చలి పులి స్వైర విహారం చేస్తుంది. మంచుతో ఊళ్లకు ఊళ్లు కప్పబడిపోతాయి. పరిసరాలు అన్నీ కూడా హిమసీమలను తలపిస్తాయి.

వింటర్ సీజన్ మొదలై ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్న పరిస్థితులలో చింతపల్లిలో ఒక్క రోజు తేడాలో అయిదారు డిగ్రీలు డౌన్ కావడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. 13 డిగ్రీల సెల్సియస్ గా ఉన్న ఉష్ణోగ్రతలు కాస్తా 8కి దిగిపోవడంతో అక్షరాలా చింతపల్లి వణుకుతోంది.

పాడేరులో అదే రకమైన వాతావరణం ఉంది. పాడేరు కాఫీ బోర్డు వద్ద 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూంటే పాడేరులో 12 డిగ్రీలుగా ఉంది. ఏజెన్సీ మొత్తం ఉదయం తొమ్మిది  గంటల వరకూ మంచు దుప్పటి కప్పుకుంటుంది. పరిసరాలు అన్నీ తడిసి ముద్దగా కనిపిస్తున్నాయి.

ప్రకృతి రమణీయతను ఈ సమయంలో చూడాలనుకుని వస్తున్న పర్యాటకులు సైతం ఇంతటి హిమ ఉత్పాతాన్ని సహించలేక భరించలేకపోతునారు. గజగజవణుకుతున్న పరిస్థితి అంతటా కనిపిస్తోంది. డిసెంబర్ జనవరి నెలలలో మొత్తం చూస్తే మన్యసీమ మంచు సీమగా మారుతుందని అని వాతావరణ అధికారులు హెచ్చరికలు ఉన్నాయి. మరీ దారుణంగా రెండు మూడు డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఈ సీజన్ లో కూడా అలాంటి పరిస్థితి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.

మన్యాన్ని మంచులో ముంచేస్తున్న బీభత్సమైన వాతావరణం ఇది. అలవాటు అయిన గిరిజనమే తట్టుకోలేమని వణుకుతున్న హిమ తాపమిది. అందుకే టూరిస్టులు ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలని పర్యాటక శాఖ  అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలకు ఒక్కసారిగా సర్దుబాటు చేసుకోవడం ఇతర ప్రాంతాల వారికి బహు కష్టం. అయినా మంచుతో చెలగాటం భలే  అంటే ఇష్టమని పర్యాటకులు ఏజెన్సీని చుట్టుముడుతూండడం విశేషం.