బాబును చూశాక కూడా జగన్ కు అత్యాశ ఎందుకు?

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల పాటు మనమే (వైసీపీ)  అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని సీఎం జగన్ వ్యక్తం చేశారు. పలు నియోజకవర్గాల నేతలతో వరుసగా సమావేశం అవుతున్న సీఎం జగన్ ఒక…

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల పాటు మనమే (వైసీపీ)  అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని సీఎం జగన్ వ్యక్తం చేశారు. పలు నియోజకవర్గాల నేతలతో వరుసగా సమావేశం అవుతున్న సీఎం జగన్ ఒక సమావేశంలో తన ఆశ బయటపెట్టారు. రెండోసారి అధికారంలోకి రావాలన్నఆశ ఉండొచ్చు. కానీ ముప్పయ్ ఏళ్లపాటు అధికారంలో ఉండాలన్నఆశ అత్యాశే అవుతుంది. అలాగే అసెంబ్లీ సీట్లు వందకు వందశాతం తన పార్టీ గెలుచుకోవాలనే ఆశ కూడా ఉంది. అది ఎందుకు సాధ్యం కాదని ఆయన పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు వయసును దృష్టిలో పెట్టుకొని జగన్ ఈ ఆశలు పెంచుకున్నారేమో.

చంద్రబాబునాయుడు వయసు 70 ఏళ్లు దాటిపోయింది. ఆయన మహా అయితే 2024 ఎన్నికల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటారని..2029 ఎన్నికల నాటికి వయసు కారణంగా చురుగ్గా రాజకీయాలు చేయలేరని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇక రాజకీయ ప్రత్యర్థి ఉండరని జగన్ అనుకుంటున్నారని ఆయన భావిస్తున్నారు. లోకేష్ రాజకీయంగా జగన్‌తో ఢీ కొట్టే రేంజ్‌కు వెళ్లలేదని..అలాగే పవన్ కల్యాణ్‌కు అన్ని వర్గాల్లో ఆమోదం లభించదని.. వారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రమే టాల్ లీడర్‌గా ఉంటారని అందుకే.. ముఫ్పై ఏళ్ల పాటు జనానికి మరో ఆప్షన్ ఉండదని..తననే ఎన్నుకుంటారని జగన్ అంచనా వేస్తున్నారు.  

ఇలా భావించడం ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని మర్చిపోవడమేనని కొందరు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటే ఎవరినైనా లీడర్‌గా ఎన్నుకోవచ్చని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మొదటి రెండు సార్లు సీఎం అయినప్పుడు బెంగాల్‌లో సుదీర్ఘ కాలంగా జ్యోతిబసు సీఎంగా ఉండేవారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని విజన్ ట్వంటీ 20 అనే ప్రణాళికతో చంద్రబాబు తాను కూడా సుదీర్ఘంగా సీఎంగా ఉండాలనుకున్నారు. తాను చేస్తున్న అభివృద్ధితో ప్రజలు తనను ఆదరిస్తారని.. ఇరవై .. పాతికేళ్ల పాటు సీఎంగా ఉంటానని అనుకునేవారు. కానీ అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చంద్రబాబుకు మరో ఎన్నికలోనే తెలిసి వచ్చింది. 

ఇప్పుడు జగన్ కూడా 30 ఏళ్ల పాటు సీఎం ప్రకటనలు చేస్తున్నారు కానీ.. చంద్రబాబుతో పోలిస్తే ఆయన దృక్బథం వేరు. సంక్షేమ పథకాల పేరుతో నగదు బదిలీ చేస్తున్నామని.. తనకు పోటీ వచ్చే నాయకుడు ఉండరన్న కోణంలో ఆయన ధర్టీ ఇయర్స్ సీఎం పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఒక్క చాన్స్ ఇవ్వండి.. జన రంజకమైన పాలన చేసి ప్రతి ఇంట్లోనూ నాన్న గారితో పాటు నా ఫోటో పెట్టుకునేలా పరిపాలన చేస్తానని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పాలన ఎలా ఉందన్న సంగతిని పక్కన పెడితే.. తన పాలనపై మాత్రం సీఎం జగన్‌కు ఎక్కడా లేనంత నమ్మకం ఉంది. అందుకే 175 సీట్లు ఖాయమంటున్నారు. 

పార్టీ నేతలందరితో పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికి ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. ఎంత సాయం చేశారో గుర్తు చేస్తున్నారు. అలా అందరూ ఓట్లేస్తారని.. భావిస్తున్నారు. ఈ సారి గెలిస్తే.. ఇక తిరుగు ఉండదని.. తన పార్ములా వర్కవుట్ అయినట్లేనని… అది మరో 30 ఏళ్లు పని చేస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా ఉందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ ఈ సారి గెలిస్తే ఎలా 30 ఏళ్లు ఉంటారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అసలు జగన్ లాజిక్ ఏమిటో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అర్థం కావడం లేదు.