జగన్ సోదరి చుట్టూ చంద్రబాబు రాజకీయం?

తనకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రావడానికి ప్లస్ సీఎం జగన్ ను ఓడగొట్టడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నారు.  Advertisement కొన్ని…

తనకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రావడానికి ప్లస్ సీఎం జగన్ ను ఓడగొట్టడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నారు. 

కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు కూడా. ఒకపక్క జగన్, మరో పక్క బాబు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడో ప్రచారం జరుగుతోంది. కడప జిల్లా రాజకీయాల్లో బాబు కొత్త రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. 

జగన్ తన సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డినే దారుణంగా హత్య చేయించారని చంద్రబాబు మాత్రమే కాకుండా సమస్త టీడీపీ నాయకులు ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హత్య కేసులో నిందితులకు శిక్ష పడకుండా జగన్ వారి రక్షిస్తున్నాడని అంటున్నారు. ఈ కేసులో న్యాయం కోసం వివేకా కుమార్తె డాక్టర్ సునీత అలుపెరుగకుండా న్యాయపోరాటం చేస్తున్నారు.

జగన్ ను దెబ్బ తీయడానికి బాబు ఈ హత్యను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు దీన్ని రాజకీయ ప్రయోజనాలకు కూడా వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకు మద్దతివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని తాజాగా కర్నూలులో స్వయంగా వెల్లడించారు. 

వైఎస్ వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలుద్దామంటూ చంద్రబాబు పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ వివేకా కుమార్తె సునీతను టీడీపీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అందులో భాగంగా.. ఇప్పటికే హైదరాబాద్ లో కొద్ది రోజుల క్రితం స్వయంగా చంద్రబాబు- సునీతతో భేటీ అయ్యారని తెలుస్తోంది. టీడీపీ నుంచి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఇస్తామని..అంగీకరించాలని సూచించారు. సునీత ఆ సమయంలో ఈ ప్రతిపాదన పైన సుముఖంగా లేకపోయినా..ఆ తరువాత జరిగిన చర్చల్లో భాగంగా ఆలోచనలో కొంత మార్పు వచ్చిందని చెబుతున్నారు. 

పులివెందుల నుంచి సీఎం జగన్ పోటీ చేయటం ఖాయం. దీంతో, సీఎం జగన్ పైన ఆయన సోదరి సునీత పోటీకి దిగుతారా అనేది సందేహమే. కానీ, టీడీపీ నేతలు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

వైఎస్సార్ కు ,  జగన్ కు పులివెందుల లో ఎంత క్రేజ్ ఉందో.. వైఎస్ వివేకా పైనా అంత సానుభూతి ఉందనేది టీడీపీ నేతల విశ్లేషణ. ఒక వేళ అసెంబ్లీకి అంగీకరించకుంటే..కడప ఎంపీగా పోటీ చేసేందుకు సునీత ను ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాశ్ పైన పోటీ చేయాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. సునీతను ఎంపీగా బరిలోకి దించితే పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని.. చివరి నిమిషంలో సునీత అసెంబ్లీకి అంగీకరిస్తే బీటెక్ రవికి ప్రత్యామ్నాయ సీటు వైపు ఆలోచన ఉంటుందని సమాచారం.

గతంలోనే సునీతకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు సైతం చెబుతున్నారు. కానీ, సునీత అటువంటి నిర్ణయం తీసుకుంటారని తాము భావించటం లేదని అంటున్నారు. అయితే, వివేకా హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న సునీతతో.. టీడీపీకి చెందిన ఒక ముఖ్య నేత సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి దీన్ని కొట్టిపారేయలేం.