ప‌వ‌న్‌కు అద్భుత అవ‌కాశం…ఏం చేస్తారో!

రాజ‌కీయాల్లో, జీవితంలో…ఏ రంగంలో అయినా అవ‌కాశాలను అందిపుచ్చుకున్న వాళ్లే రాణిస్తారు. విజేత‌లుగా నిలుస్తారు. అవ‌కాశాల‌ను జార‌విడుచుకున్న వాళ్లు త‌మ ఓట‌మికి ఎవ‌రినో నిందించాల్సిన ప‌నిలేదు. గెలుపోట‌ముల‌కు తామే బాధ్యుల‌మ‌ని గుర్తించిన వాళ్లే… ఎప్పుడైనా తిరిగి…

రాజ‌కీయాల్లో, జీవితంలో…ఏ రంగంలో అయినా అవ‌కాశాలను అందిపుచ్చుకున్న వాళ్లే రాణిస్తారు. విజేత‌లుగా నిలుస్తారు. అవ‌కాశాల‌ను జార‌విడుచుకున్న వాళ్లు త‌మ ఓట‌మికి ఎవ‌రినో నిందించాల్సిన ప‌నిలేదు. గెలుపోట‌ముల‌కు తామే బాధ్యుల‌మ‌ని గుర్తించిన వాళ్లే… ఎప్పుడైనా తిరిగి బ‌రిలో వుంటారు. ముఖ్యంగా ఈ విష‌యాలు ల‌క్ష‌లాది పుస్త‌కాలు చ‌దివిన జ్ఞాని, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలియ‌వ‌ని అనుకోలేం.

తాజాగా చంద్ర‌బాబు అన్న మాట‌లను తీసుకునైనా త‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ప‌వ‌న్ నిర్మించుకోవ‌చ్చు. రాజ‌కీయాల్లో కొత్త పార్టీ అవ‌త‌రించాలంటే, ఆల్రెడీ మ‌నుగ‌డ‌లో ఉన్న పార్టీ ప‌త‌నం కావాలి. ఇదే ప్ర‌కృతి సిద్ధాంతం. జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి లేదా త‌న‌కు తానుగా ఏపీలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాలంటే టీడీపీ ప‌త‌నం ఒక్క‌టే మార్గ‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గుర్తించాలి. ఆ అవ‌కాశం, అదృష్టం ప‌వ‌న్‌కు క‌నుచూపు మేర‌ల్లో క‌నిపిస్తున్నాయి.

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా పర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే… “నేను అసెంబ్లీకి వెళ్లాలంటే, రాజ‌కీయాల్లో వుండాలంటే, రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గాలంటే రేపు జ‌రిగే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించ‌క త‌ప్ప‌దు. లేనిప‌క్షంలో నేను అసెంబ్లీకి వెళ్ల‌ను” అని ఉద్వేగంగా చంద్ర‌బాబు చెప్పారు.

2024లో టీడీపీ అధికారంలోకి రాక‌పోతే ఇక రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించక త‌ప్ప‌ద‌ని స్వ‌యంగా చంద్ర‌బాబే చెప్పారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష టీడీపీ నాయ‌కుడైన చంద్ర‌బాబు రాజ‌కీయంగా అడ్డు తొల‌గితే, ఇక ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేసే అవ‌కాశం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కే ద‌క్కుతుంది. ఎందుకంటే టీడీపీని బాబు వార‌సుడైన లోకేశ్ న‌డిపించే శ‌క్తిసామ‌ర్థ్యాలు లేవ‌ని అంద‌రికీ తెలుసు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌ననే పిచ్చి మాట‌ల‌తో చంద్ర‌బాబుకు ఊపిరిపోయాల‌నుకునే ఆలోచ‌న‌ల్ని విడిచి పెట్ట‌డం మంచిది. ఎందుకంటే టీడీపీకి ఊపిరి పోయ‌డం అంటే త‌న‌కు తానుగా జ‌న‌సేన ప్రాణం తీయ‌డ‌మే.

ఈ సూక్ష్మం ప‌వ‌న్‌కు అర్థ‌మైతే చాలు జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేసుకుంటారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌క‌పోతే మాత్రం ఇక త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ఆగిపోతుంద‌ని వేలాది మంది సాక్షిగా బాబు చెబుతున్నా, ఆ మాట‌ల్ని ప‌వ‌న్ త‌నకు అవ‌కాశంగా తీసుకోక‌పోతే మాత్రం జ‌న‌సేనానిని ఎవ‌రూ కాపాడలేరు. జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌రాన్ని…బాబు త‌న మాట‌ల ద్వారా హింట్ ఇచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.