జగన్మోహన్ రెడ్డి ఆలోచనలోంచి పుట్టిన పార్టీ కార్యక్రమం గడపగడపకు.. సక్సెస్ అవుతున్న తీరు.. సాధిస్తున్న ప్రజాస్పందన.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడులో గుబులు పుట్టిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే రీతిగా నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజలతో మమేకం అవుతూ.. వారి కష్టాలు వింటూ పరిష్కరిస్తూ, తాము ప్రజల కోసం చేసిన ప్రతి పనినీ ప్రతి కుటుంబానికీ వివరిస్తూ పోతే.. తమ పార్టీ కొంపమునుగుతుందని చంద్రబాబునాయుడు భయపడుతున్నారు. ఇప్పుడాయన ప్రసంగాల్లో ప్రధానంగా గడపగడపకు కార్యక్రమం ప్రస్తావన కూడా ఉంటోంది.
‘‘గడపగడపకు పేరుతో ఇంటింటికీ దొంగలు వస్తారు తమ్ముళ్లూ.. వారి మాటలు మీరు నమ్మొద్దు. ఒకటికి నాలుగు సార్లు నమ్మొద్దు.. ’’ అంటూ చంద్రబాబునాయుడు గొంతు చించుకుంటున్నారు. ఒకసారి గెలిచిన తర్వాత.. అయిదేళ్ల పాటూ మళ్లీ ప్రజల మొహాలు తిరిగిమళ్లి చూడని ఎమ్మెల్యేలను తయారుచేసిన చరిత్ర చంద్రబాబునాయుడుది. గెలిచిన తర్వాత, ప్రజలు ఎలా చస్తున్నారో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎన్నడూ పట్టించుకున్నది లేదు. కార్యక్రమాలుంటే రావడం, మళ్లీ ఎన్నికలకు ఇల్లిల్లు తిరగడం తప్ప వారికి మరొకటి తెలియదు. అధికారంలో ఉండగా ప్రజల వద్దకు వెళితే.. సమస్యలతో ఊదరగొట్టేస్తారని, తమ వైఫల్యాలను ప్రజలు ఎండగడతారని వారికి భయం. అందుకే వీలైనంత ప్రజలకు దూరంగా మెలగుతుండేవారు.
అలాంటిది.. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు.. మూడేళ్ల పాలన పూర్తయిన తర్వాత.. ఎన్నికల ప్రచారానికి తిరిగినట్టుగా తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఉండడం.. ప్రతి ఇంటికీ తాము చేసిన లబ్ధిని వివరిస్తుండడం.. అలాగే.. వారి సమస్యలు చెబితే విని పరిష్కరిస్తుండడం చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి సానుకూల రాజకీయ వైఖరి అనేది ప్రజల్లో ఆ రాజకీయ పార్టీకి అనల్పమైన కీర్తిప్రతిష్టలను తెచ్చిపెడుతుందని.. తాను తలకిందులుగా తపస్సు చేసినా సరే.. వారిని ఓడించడం అసాధ్యం అవుతుందనేది ఆయన భయం. అందుకే ఆయన గడపగడపకు కార్యక్రమం మీద ఫోకస్ పెట్టి.. ఆ కార్యక్రమాన్ని నమ్మవద్దని, నాయకుల మాటలు వినవద్దని ప్రజల్ని బతిమాలుతున్నారు.
అయినా, గడపగడపకు కార్యక్రమంలో ఏంకొత్త వాగ్దానాలు ఇస్తున్నారు గనుక.. ప్రజలు నమ్మకుండా ఉండాలి. ఇప్పటిదాకా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం సాయం అందించిందో.. ఆన్ పేపర్.. సాధికారంగా ప్రతిమేలును వారికి తెలియజెప్పేలా నాయకులు వారిని కలుస్తున్నారు. తమకు ఇచ్చే కాగితంలో తమకు ప్రభుత్వం చేసిన లబ్ధి కనిపిస్తుంది. అది జరిగిందో లేదో వారికి తెలుసు. మరి నమ్మకుండా ప్రజలు ఎందుకుంటారు? ఇంకా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతను పెంచుకుంటారు గానీ..? అనేది ప్రజల సందేహం.
ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠను పెంచే ఇంత మంచి కార్యక్రమం గనుకనే.. దాన్ని చూసి చంద్రబాబు జడుసుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.