బాబు పెంచిన కాపీయింగ్ సంస్కృతి.. ఫలితమిది!

‘నూటికి నూరుశాతం ఫలితాలు రావాల్సిందే’, ‘నూరుశాతం ఫలితాలు రాకుంటే టీచర్లపై చర్యలు’, ‘నూరు శాతం ఫలితాలకు కలెక్టర్లదే బాధ్యత’.. ఇలాంటి డైలాగులు అన్నీ చూడడానికి తీయగానే ఉంటాయి. కానీ నూరుశాతం ఫలితాలు అనేది.. ఏ…

‘నూటికి నూరుశాతం ఫలితాలు రావాల్సిందే’, ‘నూరుశాతం ఫలితాలు రాకుంటే టీచర్లపై చర్యలు’, ‘నూరు శాతం ఫలితాలకు కలెక్టర్లదే బాధ్యత’.. ఇలాంటి డైలాగులు అన్నీ చూడడానికి తీయగానే ఉంటాయి. కానీ నూరుశాతం ఫలితాలు అనేది.. ఏ పాఠశాలలో అయినా సాధ్యమేనా? చంద్రబాబునాయుడు పరిపాలన కాలంలో.. పదోతరగతి పరీక్షల విషయంలో జరిగే అనేకానేక సమీక్ష సమావేశాల్లో తరచూ వినిపించే ఇలాంటి మాటలు.. టీచర్లు, కలెక్టర్ల మీద ఎంత ఒత్తిడి పెంచుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి అవాంఛనీయమైన ఒత్తిడి పెరుగుతూ పోయిన ఫలితమే.. పదోతరగతి పరీక్షల వ్యవస్థలో మితిమీరిపోయిన కాపీయింగ్ సంస్కృతి.

చంద్రబాబునాయుడు హయాంలో పదో తరగతి పరీక్షలు అంటే ఒక ప్రహసనం ప్రెవేటు స్కూళ్ల వారికి ఎటూ సర్కారు దన్ను ఉండనే ఉంటుంది. ఎక్కడికక్కడ లంచాలు భారీగా ముట్టజెప్పి అధికార్లను, ఇన్విజిలేటర్లను, పరీక్షల వ్యవస్థలోని సమస్త యంత్రాంగాన్ని కూడా వారు లోబరచుకుంటారు. తద్వారా విచ్చలవిడిగా కాపీయింగ్ చేయిస్తారు. తమ స్కూలునుంచి హాజరయ్యే విద్యార్థులు అత్యధిక మార్కులతో పాసయ్యేలా.. ఆ తర్వాత వారి మార్కులను తమ ప్రచారానికి బాకాల్లాగా వాడుకుంటారు. ఇలా జరగడం అనేది మామూలైపోయింది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా తేడా ఏమీ లేదు. ప్రెవేటు స్కూళ్లకు విద్యార్థుల కాపీయింగ్ అనేది వారి మార్కెటింగ్ కోసం, వ్యాపారం కోసం తప్పనిసరి అవసరం కాగా, గవర్నమెంటు స్కూళ్ల వారికి అది మనుగడ కోసం తప్పనిసరి అయిపోయింది. వంద శాతం ఫలితాలు రాకపోతే.. తాట ఒలుస్తాం అన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతుండే సరికి.. ఇన్విజిలేషన్ లో ఉండే ఉపాధ్యాయులు తామే స్వయంగా కాపీలను ప్రోత్సహించసాగారు. 

పరీక్ష మొదలైన గంటలోగా ప్రతి పరీక్ష గదికి ఒక సబ్జెక్టు టీచర్ రావడం.. బిట్ పేపర్ సమాధానాలు మొత్తం చదివి వినిపించేయడం.. విద్యార్థులు అందరూ దానిని పూర్తి చేసిన తర్వాత.. పక్క గదికి వెళ్లడం ఒక సాంప్రదాయం అయిపోయింది. ఆ రకంగా ప్రతి విద్యార్థికి బిట్ పేపర్ లో 30 మార్కులు అనేది గ్యారంటీ. ఇక మెయిన్ ఆన్సర్ షీట్ లో కనీసం 5 మార్కులు తెచ్చుకోగలడా లేదా అతని శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సామర్యాల్లో భాగంగా.. చిట్టాలు తెచ్చుకుని పరీక్ష రాయడం కూడా ఒకటి. అలా రాసినా ఇన్విజిలేటర్లు చూసీ చూడనట్టుగా వదిలేసేవారు. తిమ్మిని బమ్మి చేసి అయినా నూరుశాతం ఫలితాలు రాబట్టడమే వారి లక్ష్యం. 

జగన్ అధికారంలోకి వచ్చాక.. విద్యావ్యవస్థను అనేక రీతులుగా సంస్కరిస్తూ వచ్చారు. నాడు-నేడు రూపేణా సర్కారు బళ్ల రూపురేఖలు మారిపోయాయి. ఇంగ్లిషు మీడియం విద్య ఒక గొప్ప విప్లవానికి నాంది పలకనుంది. అయితే పరీక్షల వ్యవస్థను సంస్కరించడానికి ఇప్పటిదాకా అవకాశం రాలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక 2020, 2021 లలో పరీక్షలే జరగలేదు. దాంతో కాపీయింగ్ విషసంస్కృతిని గమనించే అవకాశమే రాలేదు. 

ఈ దఫా పరీక్షలు మొదలు కాగానే అలవాటుగా సాగిన కాపీయింగ్, పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారాలు గుప్పుమన్నాయి. నారాయణ విద్యాసంస్థలు సూత్రధారులుగా ఎంత లీకేజీ మాఫియాను నడిపిస్తున్నారో బయటకు వచ్చింది. గాడి తప్పిన పరీక్షల అవ్యవస్థను ప్రభుత్వం గమనించేలోగానే.. అప్పటికే మూడు సబ్జెక్టుల పరీక్షలు అయిపోయాయి. 

సర్కారు కాపీయింగ్ ను ప్రోత్సహించకుండా కట్టడి చేసింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఫలితాలు వెల్లడయ్యేసరికి తొలి మూడు పరీక్షల్లో పాసయిన అనేక మంది తర్వాతి సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. 

పాస్ పర్సంటేజీ తగ్గి ఉండొచ్చు గాక.. కానీ.. అంతో ఇంతో చదువుకున్న వారు మాత్రమే పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారు. ఇది మంచి పరిణామమా? చెడు పరిణామమా? దీని గురించి ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి ఎందుకు? ఇది విజ్ఞులందరూ ఆలోచించాల్సిన విషయం. 

పాస్ పర్సంటేజీ అనేది ప్రభుత్వం పనితీరుకు గీటురాయి కాదు.. చదువుకున్న విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలిగారా లేదా? అనేదే గమనించాలి. ఆ మాత్రం తెలివి విమర్శలు చేసేవారికి ఎప్పటికి కలుగుతుందో ఏమో?