తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఒక చిత్రమైన విషయాన్ని బయటపెట్టారు! సాధారణంగా అయితే ఎవరు నమ్మలేని సంగతి అది!!
కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ప్రస్తుత శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితను.. తండ్రి పార్టీని వీడి తమతో చేరవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానించిందిట! అవాక్కయ్యారా? ఎవరైనా అవాక్కయ్యే సంగతే ఇది. ఎప్పుడు ఎలా జరిగిందో వివరించలేదు గానీ.. ఈ మాటను కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. కనుక ఆలోచించాల్సిందే!
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలుపుకొని తద్వారా ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం అనే కుయుక్తి ఇవాళ్టి రాజకీయాల్లో సర్వసాధారణమైనదే. కానీ స్వయంగా కేసీఆర్ కుమార్తె పార్టీలో ప్రభుత్వంలో కూడా తిరుగులేని అధికారాన్ని చెలాయించగలుగుతున్న కవితని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసిందా అంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎమ్మెల్యేలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే హాట్ టాపిక్‌గా ఉంది. నలుగురు తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ముగ్గురు బిజెపి దూతలు హైదరాబాదుకు వచ్చి 200 కోట్లతో బేరం పెట్టిన వ్యవహారం సిట్ విచారణ పరిధిలో ఉంది. దీని ఆధారంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పరువు తీయాలని, వాళ్ళ నైతిక విలువలను నిగ్గదీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి సారధి కేసీఆర్ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.
భారత రాష్ట్ర సమితిగా అవతరించబోతున్న తమ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో పోరాటం సాగించేటప్పుడు బిజెపి నైతిక విలువలు దుర్మార్గాల గురించి ఎండగట్టడానికి ఆయన ఈ అంశాన్ని కీలకంగా వాడుకోవాలనుకుంటున్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది కూడా కేసీఆర్ ఆరోపిస్తున్నంత పచ్చిగా జరిగిందా? లేదా, బిజెపి మీద బురద చల్లడానికి ఇందులో ఏదైనా మాయ ఉందా? అనే అనుమానాలు కూడా కొందరికి ఉన్నాయి!
అలాంటి నేపథ్యంలో ఏకంగా కెసిఆర్ కూతురు కవితనే టార్గెట్ చేసి ఆమెను బిజెపిలోకి ఆహ్వానించారా అనేది విస్తుగొలిపే అంశం. టిఆర్ఎస్లో ఆధిపత్య పోరాటంలో తలపడుతున్న కీలక వ్యక్తుల్లో అసంతృప్తి ఉంటేగనుక, వారిని మచ్చిక చేసుకుని బిజెపిలోకి తెచ్చుకోవాలనే కోరిక సహజంగా ఆ పార్టీకి ఉంటుంది. కానీ బిజెపి భవిష్యత్తు తక్షణం ఎలా ఉండబోతున్నదో తెలియకుండా ఆధిపత్యం దక్కలేదని అసంతృప్తి ఉన్నవారు కూడా ఆ పంచన చేరరు. బిజెపి గొడుగు కిందకి వెళితే కచ్చితంగా అధికార బదలాయింపు జరిగి తమ చేతికి పగ్గాలు వస్తాయి అనేంతటి సానుకూల వాతావరణం స్పష్టంగా కనిపించిన తర్వాత మాత్రమే కీలక వ్యక్తులు పార్టీలు మారుతారు. అలాంటిది ఎమ్మెల్సీ కవితకు ఇప్పటినుంచి బిజెపి ఎందుకు ఆఫర్ పెడుతుంది అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం!
కెసిఆర్ తన ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బిజెపి వద్ద రెండు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయనే సంగతిని కూడా వెల్లడించారు. సింహయాజీ మాటల్లో ఈ సంగతి బయటకు వచ్చిందని అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడంలో కేసీఆర్ దిట్ట! అవి ఎప్పటికి నిరూపణ అవుతాయో ఎవరికీ తెలియదు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ఒక విషయంలో మాత్రం కెసిఆర్ అభిమానులను కార్యకర్తలను శ్రేణులను నిరాశపరిచారు. తన వారసుడు ఎవరినేది ఈ విస్తృత సమావేశంలో ఆయన తేల్చి చెబుతారని కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు సాగాయి. పాపం వారందరికీ నిరాశ తప్పలేదు.