ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుదీర్ఘకాలం పాటు రాష్ట్రానికి సేవ చేయాలనే సంకల్పం తొలినుంచి ఉంది. ముప్పయ్యేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలనే ఆకాంక్షను ఆయన గతంలో కూడా వ్యక్తీకరించారు. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లపాటు మనమే అధికారంలో ఉంటాం అని అంటున్నారు.
అయితే ఇందుకు చాలా కీలకంగా ఆయన నిర్దేశించిన మార్గం ఒక్కటే. ‘‘పార్టీలో విభేదాలు పనికి రావు.గ్రూపులు ఏమున్నా అన్నీ పక్కన పెట్టి పనిచేయాలి’’ అని చెప్పారు. మంగళవారం నాడు తన క్యాంపుకార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ మాటలు చెప్పినప్పటికీ.. నిజానికి, ఈ మాటలు యావత్ రాష్ట్రంలోని పార్టీ శ్రేణులను ఉద్దేశించినవి. యావత్ పార్టీకి హెచ్చరిక వంటివి. మార్గదర్శనం వంటివి.
అధికారంలో ఉన్నప్పుడు.. క్షేత్రస్థాయిలో నాయకులకు, కార్యకర్తలకు చాలా చాలా అసంతృప్తులు ఉంటాయి. వాటన్నింటినీ చక్కదిద్దడం నాయకుడి తొలిబాధ్యత అనిపించుకుంటుంది. అసంతృప్తులు ఎప్పుడూ కూడా.. తమకు ఏమీ ప్రయోజనం కలగలేదు అనేంత వరకు పరిమితం అయితే ఒక రకంగా ఉంటుంది. శృతిమించి అక్కడి నాయకుల్ని ఎన్నికల్లో ఓడించాలనుకునే వరకు గ్రూపులు ముదిరితే అది మొత్తంగా పార్టీకి చేటు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన సార్వజనీనమైన సిద్ధాంతం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టలో చాలా నియోజకవర్గాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి!
‘‘మేనిఫెస్టోలో 96 శాతం అమలు చేశాంగనుక, పారదర్శకంగా అన్నీ అమలు చేస్తున్నాం గనుక.. 175 స్థానాలు ఎందుకు గెలవం’’ అనేది జగన్ మాట. ఇదంతా నిజమే. కానీ.. ఆయనే చెబుతున్నట్టుగా గ్రూపు తగాదాలు, క్షేత్రస్థాయి పార్టీ అంతర్గత ముఠా కక్షలు పూర్తిగా సమసిపోతే తప్ప ఇది సాధ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికి కూడా.. ‘విభేదాలు పక్కన పెట్టాలి’ అంటున్నారే తప్ప.. అవి పూర్తిగా సమసిపోవాలి అని పిలుపు ఇవ్వడం లేదు. అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. కావలిస్తే, ఆ విభేదాలను మళ్లీ కంటిన్యూ చేసుకోవాలా? నాయకుడు చేయవలసిన దిశానిర్దేశం ఇది కాదు. కేవలం విభేదాలు మర్చిపోవాలి అనే మాటలు చెబితే సరిపోదు. పర్సనల్ టచ్ అనేది అవసరం.
విభేదాలు పడుతున్న వారిని స్వయంగా పిలిపించాలి. స్వయంగా తాను మాట్లాడాలి. జెండా మోసే కార్యకర్తలు, విభేదిస్తున్న నాయకులకు తనకు మధ్య మరొకరికి అవకాశం ఇవ్వకూడదు. తాను సర్దిచెప్పి విభేదాలను దూరం చేయాలి. మాట వినని వారిని తక్షణం పార్టీనుంచి బయటకు పంపాలి. సామ దాన భేద దండోపాయాలు ఏవైనా సరే.. తాను పర్సనల్ గా డీల్ చేసి విభేదాలు లేకుండా చేయాలి. సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నారంటేనే.. సమస్య సాల్వ్ అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది. 175 ఎందుకు గెలవం అని ప్రశ్నించే నగరిలో రోజా గానీ మళ్లీ పోటీచేస్తే ఖచ్చితంగా నెగ్గుతారని చెప్పగలరా? విభేదాలు, ముఠాతగాదాలను ఉపేక్షభావంతూ చూస్తూ, వదిలేస్తూ.. ఎన్నికల్లో అన్నీ గెలుద్దాం.. మరో 30 ఏళ్లు అధికారంలో ఉందాం.. అని సందేశాలు మాత్రం ఇస్తే ఎలా.. జగన్ ఆలోచించాలి!!