ఎమ్బీయస్‍: హొరైజన్‌ లోకి హీరో

సినిమా చివర్లో కథానాయకుడు దిగంతాలకు నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు, అక్షరాలా హీరో ఐన కృష్ణ పరిపూర్ణ జీవితం గడిపి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మనిషిగా మంచివాడు, నిర్మాతలకు ఆప్తుడు, సాహసానికి మరో పేరు, ఉపకారానికి చిరునామా,…

సినిమా చివర్లో కథానాయకుడు దిగంతాలకు నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు, అక్షరాలా హీరో ఐన కృష్ణ పరిపూర్ణ జీవితం గడిపి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మనిషిగా మంచివాడు, నిర్మాతలకు ఆప్తుడు, సాహసానికి మరో పేరు, ఉపకారానికి చిరునామా, తను నటించిన, తీసిన సినిమాల ద్వారా ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన నటనిర్మాత అయిన కృష్ణకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడగా నేను వినలేదు, చదవలేదు. బయట అభిమానులు, సినీప్రేక్షకులు, సినిమా పత్రికల పాఠకులు మెచ్చుకోవడం సరే, సినిమారంగంలో నాకు తెలిసున్నవారు కూడా ఎవరూ కృష్ణను ఏ విషయంలోనూ తప్పుపట్టక పోవడం నాకు విశేషంగా తోస్తుంది. 50 ఏళ్ల పాటు వృత్తిలో, అదీ అన్నిరకాల వివాదాలకు ఆటపట్టయిన సినీరంగంలో ఉండి కూడా వేలెత్తి చూపించుకోకుండా ఉండగలగడం అనితరసాధ్యం.

ఆయనను యాక్టర్ అనడం కంటె సూపర్ స్టార్ అనడమే కరక్టని నేననుకుంటాను. ఆయన 365 సినిమాల్లో నటిస్తే వాటిల్లో పది శాతం సినిమాల్లో మాత్రమే పర్‌ఫెక్ట్‌గా నటించి ఉంటాడని నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా వాటిల్లో పైపైన లాగించేశాడు. ఆ సినిమాలకు అంత యాక్షన్ చాల్లే అని ఆయన అభిప్రాయం. కృష్ణ నటన బాగా లేకపోవడం చేత సినిమా ఆడలేదు అనే మాట మాత్రం ఎప్పుడూ రాలేదు. కొన్ని చోట్ల ఆయన హావభావాలు కృత్రిమంగా ఉండి నవ్వు తెప్పించేవి తప్ప, చికాకు పుట్టించేవి కావు. మిమిక్రీ కళాకారులకు ఆయనో బంగారు ఖని. తనను వెక్కిరించినా ఆయన ఏమీ అనుకునేవాడు కాదట. తన నటనకున్న పరిమితులు ఆయనకు తెలుసు. ‘‘కృష్ణావతారం’’ (1982) సినిమా షూటింగులో దర్శకుడు బాపు ఓ సీనును రీషూట్ చేద్దామని అసిస్టెంటు డైరక్టరు ద్వారా పిలిపించారట. కొత్త సీనేమో అని కుర్చీలోంచి లేవబోయిన కృష్ణ రీషూట్ అనగానే మళ్లీ కుర్చీలో కూలబడుతూ ‘‘మళ్లీ షూట్ చేసినా అలాగే చేయగలుగుతాను. గతంలో మేమిద్దరం కలిసి సాక్షి చేశాం కదా, యీ పదిహేనేళ్లలో కృష్ణ యాక్టింగ్‌లో బాగా ఎదిగేసి ఉంటాడను కుంటున్నారేమో. అదేం లేదని చెప్పండి.’’ అని తన మీద తనే జోక్ చేసుకున్నారట.

నిజానికి ‘‘సాక్షి’’ (1967)లో అమాయకుడైన బల్లకట్టు మనిషిగా కృష్ణ అద్భుతంగా నటించారు. అప్పటికి సినీరంగానికి వచ్చి రెండేళ్లే అయిన కృష్ణ యీ పాత్ర ఎలా వేయాలని బాపుని అడిగితే ‘మీరు నటించవద్దు, సహజంగా ఉండండి, చాలు’ అన్నారట. కృష్ణకు ఆ పాత్ర టైలర్‌మేడ్ అనవచ్చు. తన మొదటి సినిమా ‘‘తేనెమనసులు’’ (1965)లో కూడా కృష్ణ నటన చాలా చలాకీగా బాగుంది. తర్వాతి సినిమాల్లో కనబడిన ఎబ్బెట్టుతనం (ఆక్వర్డ్‌నెస్) ఏమీ లేకుండా సహజంగా నటించినట్లు ఉంటుంది. ఆదుర్తి సుబ్బారావు గారు డైరక్టరు అయినా కోచింగు యిచ్చినదంతా ఆయనకు అసిస్టెంటుగా ఉన్న విశ్వనాథ్ గారట. తర్వాత ఆదుర్తి దర్శకత్వంలోనే వచ్చిన ‘‘మాయదారి మల్లిగాడు’’ (1973) సినిమా ఒకటి కృష్ణ కెరియర్ బూస్టర్ అయింది. ఇలా మంచి దర్శకులు పట్టుబట్టి చేయించినప్పుడు ఆయన దగ్గర్నుంచి బాగానే రాబట్టుకున్నారు. ‘‘అల్లూరి సీతారామరాజు’’ (1974)లో ఆయన నటన పరాకాష్టకు చేరుకుంది. సినిమాలో కొంత సినిమాను ఆయనే డైరక్టు చేశాడు కాబట్టి తనను తనే నూరుకున్నాడని అనుకోవాలి.

కృష్ణ కున్న స్పెషాలిటీ ఏమిటంటే ఎంత పెద్ద డైలాగు చెప్పమన్నా చెప్పేయడం. అందుకే టేకులు ఎక్కువ వ్యర్థమయ్యేవి కావు. ఎక్కువ సినిమాల్లో వేయగలిగారు. 1990 దశకం వచ్చేసరికి డైలాగులు అరిచి చెప్పసాగారు. క్రమేపీ ఆయన పాత్రలకు యింపార్టెన్స్ తగ్గింది. కొత్తరకం ఫైట్స్‌తో, డాన్సులతో చిరంజీవి దూసుకువచ్చారు. మెగా స్టార్ శకం ప్రారంభం కావడంతో సూపర్ స్టార్ శకం వెనకబడింది. అసలు కృష్ణ కూడా యువతను ఆకట్టుకోవడంతోనే తన శకం ప్రారంభించారు. ఫైట్ చేసి దుష్టులను దునుమాడేవాళ్లంటే పిల్లలకు, గ్రామీణులకు అభిమానం ఉంటుంది. మా చిన్నపుడు ఎన్టీయార్ జానపద సినిమాల్లో కత్తి దూసి మా మనసులను దోచాడు. విఫల ప్రేమికుడిగా నాగేశ్వరరావు మహిళలకు నచ్చేవాడు కానీ మా కంటికి అసమర్థుడిగా అనిపించేవాడు. ఏడుస్తూ కూర్చునేవాడు ఏం హీరో? అనిపించేది మాకు.

హైస్కూలు రోజుల్లో ఉండగా జేమ్స్ బాండ్ సినిమాలంటే విపరీతమైన ఆకర్షణ. అలాటిది 1966లో ‘‘గూఢచారి 116’’లో తెలుగు జేమ్స్ ‌బాండ్‌లా కృష్ణ అవతరించడంతో యువతతో పాటు పిల్లలూ ఆరాధించారు. ‘‘పానిక్ ఇన్ బ్యాంగ్‌కాక్’’ (జేమ్స్ బాండ్ సినిమా కాదు) అనే సినిమా ఆధారంగా తీసిన ఆ సినిమాలో ఆ పాత్ర శోభన్‌బాబు వేయవలసినది. ఈ ఫైటింగ్స్ అవీ నేను వేయలేననడంతో కృష్ణ ముందుకు వచ్చారు. అడ్వాన్సు యిచ్చాం కదాని శోభన్‌బాబు చేత గెస్ట్ పాత్ర వేయించి, కృష్ణకు ప్రధాన పాత్ర యిచ్చారు. అప్పటిదాకా అలాటి తరహా సినిమాలు చూడని ప్రేక్షకులు థ్రిల్లయిపోయారు. ఆ పాత్రలకు కృష్ణ ఫిక్సయిపోయి ఎన్నో గూఢచారి పాత్రలు వేశారు. శోభన్‌బాబు నాగేశ్వరరావు తరహా పాత్రలు వేసి మహిళా ప్రేక్షకులకు చేరువై పోయారు.

కృష్ణను జేమ్స్‌బాండ్ చేసింది డూండీ గారైతే కౌబాయ్ చేసుకున్నది కృష్ణ గారే. పెద్ద హీరోల సినిమాల్లో తమ్ముడి పాత్రలు యిస్తున్నారు కానీ తనను హీరోగా పెట్టి తీయడానికి లోబజెట్ సినిమాల నిర్మాతలు వస్తున్నారు తప్ప పెద్ద ప్రొడ్యూసర్లు ఎయన్నార్, ఎన్టీయార్‌ల దగ్గరకే వెళుతున్నారని గ్రహించి పెద్ద బజెట్‌లో సినిమాలు తనే తీయాలని నిశ్చయించుకుని ‘‘అగ్నిపరీక్ష’’ (1970) అనే మలయాళ రీమేక్ సాంఘిక సినిమా తీశారు. దానిలో కొన్ని సీనులు కలర్‌లో పెట్టారు. అది పెద్దగా ఆడలేదు. అయినా నిరుత్సాహ పడకుండా తెలుగు తెరకు కొత్తదైన కౌబాయ్ సినిమా ‘‘మోసగాళ్లకు మోసగాడు’’ (1971) చాలా భారీగా తీశారు. ఆ పాంట్లూ, ఆ హేట్లూ, ఆ తుపాకీలు ఏమిటంటూ చక్రపాణి వంటి వెటరన్స్ వెక్కిరించినా జడవలేదు. సినిమా సూపర్‌హిట్ కావడంతో తెలుగులో కౌబాయ్ శకం ప్రారంభమైంది.

సినిమా రంగానికి వచ్చిన ఐదేళ్లకే యిలాటి సాహసానికి పూనుకోవడం అద్భుతం కదా! ఇక అప్పణ్నుంచి సాహసాలు చేయడం ఆయనకు వ్యసనంగా మారింది. ఎన్నో, ఎన్నెన్నో చేశారు. ఆయన కెరియర్‌లో ఎన్నో బ్యాడ్ ప్యాచ్‌లు వచ్చాయి. వరుస అపజయాలు సంభవించాయి. అయినా చెదరలేదు. అదీ గొప్ప. హేమాహేమీలతో పోట్లాటలు వచ్చాయి. తట్టుకున్నాడు. మళ్లీ వాళ్లతో కలవడానికి వెనకాడలేదు. అవతలివాళ్లూ అంగీకరించారంటే, దానికి కారణం కృష్ణ వ్యక్తిత్వం వాళ్లకు నచ్చడమే. ఎన్టీయార్‌ను ఎదిరించి ‘‘అల్లూరి సీతారామరాజు’’ హిట్ చేసిన కృష్ణ, నాగేశ్వరరావుకు కోపం తెప్పించి తీసిన ‘‘దేవదాసు’’ విషయంలో ఫెయిలయ్యారు. పాత దేవదాసును చక్కగా ట్రిమ్ చేసి కొత్త దేవదాసు తీశారన్నారు. అయితే నా ఉద్దేశంలో కృష్ణది మిస్‌కాస్ట్. డేషింగ్ హీరోను భగ్నప్రేమికుడిగా, చేతకానివాడిగా చూపిస్తే ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది? ఆ పాత్రను శోభన్‌బాబుకి యిచ్చి ఉంటే సరిపోయేది. నా ఉద్దేశంలో విజయనిర్మల నటిగా కంటె దర్శకురాలిగా ఘటికురాలు. చక్కటి స్క్రీన్‌ప్లేతో సినిమాలు తీశారు. ఆవిడ అండ పద్మాలయా సినిమాలకు ఎంతో ఉపకరించింది. ‘‘కురుక్షేత్రం’’ సినిమా తెలుగులో ‘‘కర్ణ’’ ధాటికి ఆగలేక పోయింది కానీ హిందీ డబ్బింగ్ చాలా బాగా ఆడింది.

కృష్ణ లాంగ్ యిన్నింగ్స్‌కు కారణం నిర్మాతల పట్ల ఆయన చూపిన గౌరవం. తక్కువ పారితోషికం తీసుకుంటూ, వాళ్లు యిచ్చినప్పుడే పుచ్చుకుంటూ, సినిమా ఫెయిలయితే ఆ నిర్మాతకు యింకో అవకాశం యిస్తూ యిలా అందరికీ తలలో నాలుకగా ఉండేవాడు. ఆయన కారణంగా ఎన్నో చిన్న సినిమాలు నిర్మించబడేవి. ఏడాది పొడుగునా థియేటర్లు కళకళ లాడేవి. సినీపరిశ్రమపై ఆధార పడిన ఎందరో జీవితాలు బాగుపడేవి. సినిమాలో తన పాత్ర నిడివి ఎంత అనే బాధ ఆయనకు ఎప్పుడూ లేదు. తక్కినవాళ్లందరికీ ప్రధాన పాత్రలిచ్చేసి కృష్ణకు రెండు, మూడు పాటలు పెట్టేసి, హీరోగా ఆయన పేరు వేస్తే చాలు, ఆయన ఒప్పేసుకునేవారు. కృష్ణలో ఉన్న గొప్ప సుగుణం, తన సినిమాలో యితర నటీనటులకు పెద్ద పాత్రలు యివ్వడం. అసూయ పడే లక్షణం లేదాయనకు. కృష్ణ నటన మాట ఎలా ఉన్నా, తక్కినవారి కోసం సినిమా చూడవచ్చు అనిపించేది.

‘‘అల్లూరి సీతారామరాజు’’ సినిమా చూడండి, తెర మీద ఎందరు కళకళలాడిపోతారో! కృష్ణ కాబట్టి రూథర్‌ఫర్డ్ పాత్రను జగ్గయ్యకు యిచ్చారు. అదే ఎన్టీయార్ తీసి ఉంటే ఏ జగ్గారావుకో యిచ్చేవారు. కృష్ణ అనేకమంది కళాకారులకు, టెక్నీషియన్లకు అవకాశాలు యిచ్చారు. కొత్తవాళ్లతో చేయడానికి జంకలేదు. తను స్వయంగా మంచి డైరక్టరు, ఎడిటరు కూడా. ఏది చేసినా స్పీడుగా చేసేవారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, నిర్మాత అయినా అహంభావం మాత్రం ఎన్నడూ ప్రదర్శించలేదు. నటనంటే నాదే అని లెక్చర్లు దంచలేదు. అందుకే అందరికీ ఆత్మీయుడిగా మసిలారు. ప్రశాంతంగా వెళ్లిపోయారు. ఆయనకు అంజలి ఘటిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)