ఎన్టీఆర్‌కు ఎదురునిల్చిన ఏకైక ధీరోదాత్తుడు!

తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల అపారమైన విశ్వాసం ఉన్నవారు.. ఒక పట్టాన రాజీ పడారు. మొండితలతో కొండనైనా ఢీకొనడానికి అవసరమైన మొండిధైర్యం కూడా అలాంటి వారికి వస్తుంది. ఆ తర్వాత వారు ధైర్యానికి, సాహసానికి,…

తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల అపారమైన విశ్వాసం ఉన్నవారు.. ఒక పట్టాన రాజీ పడారు. మొండితలతో కొండనైనా ఢీకొనడానికి అవసరమైన మొండిధైర్యం కూడా అలాంటి వారికి వస్తుంది. ఆ తర్వాత వారు ధైర్యానికి, సాహసానికి, హీరోయిజానికి చిరునామా కూడా అవుతారు. 

నటశేఖర కృష్ణ అలాంటి సాహసి. మరో రకంగా చెప్పాలంటే..  ఎదురుదెబ్బలను ముందుగా ఊహించినా సరే ఖాతరు చేయకుండా.. నమ్మిన విలువల కోసం సిద్ధాంతాలకోసం నిలబడడం అనేది ఈ తరంలో అయితే అసలు ఎవ్వరిలోనూ ఊహించలేం. సూపర్ స్టార్ కృష్ణ అలాంటి ధీరోదాత్తుడు.

ఎన్టీఆర్ తో సినీ రంగం నుంచే..

తానొక్కడే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ.. నందమూరి తారక రామారావు సినిమా ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులవి. ఎన్టీఆర్ ఏకధ్రువ ప్రపంచంగా సినిమా పరిశ్రమను శాసిస్తున్నారు. ఎన్టీఆర్ తలపడే స్థాయిలో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు గానీ.. ఆయన మెతక. పోటీపడే రకం కాదు. కానీ కృష్ణ అలా కాదు. ఎన్టీఆర్ తో ఢీకొన్నారు. 

ఆయన అల్లూరి సీతారామరాజు చేయాలని అనుకున్నప్పుడు.. కృష్ణ ఏకంగా స్క్రిప్టు కొనేసి ముందుగానే పని ప్రారంభించారు. సినిమా పూర్తి చేసేశారు. సూపర్ హిట్ కొట్టారు. అదే కీర్తితో తెలుగుతెరపై చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ పెద్ద హీరో కదా.. ఆయనతో మనం పెట్టుకోవడం ఎందుకు అని కృష్ణ ఏనాడూ వెనుకంజ వేయలేదు. 

ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ తో కృష్ణ తీవ్రంగా విభేదించారు. ఎన్టీఆర్ సీఎం అయ్యేసరికి, ఆయన వ్యతిరేకులంతా సైలెంట్ అయ్యారు. కానీ కృష్ణ నమ్మిన సిద్ధాంతాలువేరు. ఆయన కాంగ్రెసు అనుకూలుడు. అందుకోసం ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో అనేది పట్టించుకోకుండా ఆయన విధానాల్ని వ్యతిరేకించారు. వాటిమీద సెటైరికల్ గా మండలాధీశుడు వంటి చిత్రాలు తీశారు. 

తన సినిమాల ద్వారా ఎన్టీఆర్ నిజస్వరూపాన్ని నిర్మొగమాటంగా, నిర్భయంగా ప్రపంచానికి చాటిచెప్పింది కృష్ణ మాత్రమే అని కీర్తిని మూటగట్టుకున్నారు. ఎన్టీఆర్ అంటే గుడ్డి అభిమానం ఉండే వాళ్లు కూడా తన సినిమాలు చూసిన తర్వాత. ఎన్టీఆర్ అసలు రంగు తెలుసుకుని పునరాలోచనలో తప్పకుండా పడతారు. అలాంటి ఆలోచనాత్మక సినిమాలు తీసిన ఘనత కృష్ణకు దక్కుతుంది. 

గాన గంధర్వుడితోనూ..

కృష్ణ తానే హీరోగా రూపొందించిన ‘సింహాసనం’ చిత్రం సూపర్ హిట్. పాటలు కూడా హిట్. కానీ ఆ సినిమాలో కృష్ణకు స్వరం అందించినది రాజ్ సీతారాం. బాలూ కాదు. ఆ సమయానికి ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కృష్ణకు విబేదాలు వచ్చాయి. అప్పటికి బాలూ మోర్ దేన్ లైఫ్ సైజ్ ఇమేజ్ తో ఉన్నారు. అయినా సరే.. కృష్ణ పట్టించుకోలేదు. అంతపెద్ద సింహాసనం వంటి సినిమా తీసి.. కనీసం బాలూను సంప్రదించలేదు. రాజ్ సీతారాం ను కొత్త గాయకుడిగా పరిచయం చేశారు. ఆయన వైవిధ్యమైన స్వరం కూడా సినిమాకు కలిసొచ్చింది.

తర్వాత అందరితోనూ సంబంధాల పునరుద్ధరణ జరిగినా.. అసలు ఎలాంటి వారికీ భయపడే అలవాటే లేని.. ధీరోదాత్త వ్యక్తిత్వం నాది అని చెప్పుకోగలిగిన ఏకైక హీరో కృష్ణ.