విశాఖ జిల్లాలోని ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో నెగ్గారు. ఆ సీటుని ఇపుడు వైసీపీ టార్గెట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు అంటూ నినదిస్తున్న వైసీపీ ప్రత్యర్ధి పార్టీ గెలిచిన సీట్ల విషయంలోనే ఫోకస్ పెట్టి పనిచేస్తోంది.
ఆయా టీడీపీ సీట్ల నుంచే వైసీపీ నాయకులను ఇంచార్జిలను పిలిపించుకుని మరీ రివ్యూస్ చేస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం గత రెండు ఎన్నికల నుంచి వైసీపీకి కాకుండా పోతోంది. ఈసారి అలా జరగకూడదు అని గట్టి పట్టుదలతో ఉంది. అక్కడ కేకే రాజు వైసీపీ తరఫున పార్టీ ఇంచార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడారు. మళ్లీ సీటు ఆయనకే అని చెబుతున్నారు.
ఉత్తర నియోజకవర్గం పూర్తిగా సిటీ పరిధిలో ఉంది. ఇక్కడ లక్షా అయిదు వేల ఇళ్ళు ఉన్నాయి. వీటిలో దాదాపుగా ఎనభై శాతం ఇళ్ళకు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు అందుతున్నాయని అందువల్ల ఈసారి ఎన్నికల్లో విజయఢంకా మోగాల్సిందే అని తాజా సమీక్షలో జగన్ నేతలకు గట్టిగా చెప్పారు.
ఇప్పటికి చూస్తే ఎమ్మెల్యేగా గంటా ఉన్నా ఆయన నియోజకవర్గం వైపు పెద్దగా చూడడంలేదు, దాంతో నెడ్ క్యాప్ ఏపీ చైర్మన్ గా నామినెటెడ్ పదవితో ఉన్న కే కే రాజు అసలైన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరోసారి టీడీపీని ఢీ కొట్టి కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు అని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమం అందరికీ అందుతోంది అన్న లాజిక్ పాయింట్ తోనే వైసీపీ ఈ సీటుని గెలుచుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.
ఉత్తరాన తెలుగుదేశం పార్టీని ఓడించాలని జగన్ పిలుపు ఇచ్చారు. దానికి ధీటుగా పార్టీ అంతా ఒక్కటిగా ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సీటు నుంచి మరోసారి గంటా పోటీ చేస్తారా లేదా అన్నది ఇప్పటికైతే టీడీపీలో చర్చగానే ఉంది. ఎవరు పోటీ చేసినా ఈ సీటు నుంచి వైసీపీ గెలిచి ఫ్యాన్ గిర్రున తిరగాల్సిందే అని వైసీపీ పంతం పడుతోంది. ఒకవేళ గంటా మళ్ళీ పోటీ చేసినా ఈసారి వైసీపీ జేగంట మోగించాల్సిందే అన్నది సంకల్పంగా ఉంది.