''గత ఏడాది తన 'వాళ్లపై' ఐటి, ఇడిలు కేసులు పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోదీని గద్దెదింపుతానని వార్నింగులిచ్చేవాడు. ఇప్పడు యరపతినేని కేసు సిబిఐకి వెళ్తోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలుపెట్టాడు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఎదురుదాడి చేస్తున్నాడు…'' అంటూ విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. పల్నాడు రాజకీయంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న తీరుపై విమర్శించారు.
'పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసిల్దార్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి చంద్రబాబు గారు చేపట్టిన డ్రామా వికటించినా, నిదురపోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పింది. ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా, బహుదూరాల నుంచి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారు.
చీకటిరోజుల గురించి చంద్రబాబు గారు చెబ్తుంటే వినాలి. ప్రత్యేకహోదా ఉద్యమ సమయంలో ప్రతిపక్ష నేతను విశాఖ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా అరెస్టు చేస్తే అయన దృష్టిలో వెలుతురు రోజు? ముద్రగడ గారిని హౌజ్ అరెస్ట్ చేసి మహిళలను పోలీసులతో బూతులు తిట్టించినపుడు వాళ్ల హక్కులు గుర్తురాలేదు.
దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నోడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూర్ అంటే నమ్మే అమాయకులుంటారా?'' అంటూ ఆయన ప్రశ్నించారు.