ప్రధాని మోదీని జనసేనాని కలవడం టీడీపీ దృష్టిలో తీవ్ర నేరమైంది. ఇదే చంద్రబాబు కలిస్తే మాత్రం గొప్ప. ఇదెక్కడి విడ్డూరమని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఆగస్టులో ఢిల్లీలో ఓ కార్యక్రమంలో భాగంగా మోదీని చంద్రబాబు కలిశారు. “మీతో చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ సారి ఢిల్లీకి వచ్చే ముందే సమాచారం ఇవ్వండి. పనులన్నీ పక్కన పెట్టి మీ కోసం ఎదురు చూస్తా” అని బాబుతో మోదీ అన్నట్టు ఓ వర్గం మీడియా తన పైత్యాన్ని ప్రదర్శించింది.
ఈ నేపథ్యంలో ఇటీవల పవన్‌ను పిలిపించుకుని ప్రధాని చర్చించారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మిత్రపక్ష పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో బీజేపీ అగ్రనేతలు చర్చించాల్సిన అవసరం ఉంది. బీజేపీ అధిష్టానం అదే పని చేసింది. పవన్‌కల్యాణ్ అడిగినట్టుగా గుజరాత్ ఎన్నికల తర్వాత రోడ్ మ్యాప్ కూడా ఇవ్వనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
కానీ బీజేపీ, టీడీపీ పరస్పరం ప్రత్యర్థి రాజకీయ పార్టీలు. బీజేపీకి దగ్గర కావాలని టీడీపీ తహతహలాడుతోంది. అయితే బీజేపీ పదేపదే మోసపోలేమనే ఉద్దేశంతో టీడీపీని దగ్గరికి రానివ్వడం లేదు. ఇదే జనసేనపై టీడీపీ అక్కసుకు కారణమైందని చెప్పొచ్చు.
ప్రధానితో భేటీ తర్వాత పవన్ విజయనగరం పర్యటనలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరడం టీడీపీకి ఏ మాత్రం రుచించడం లేదు. అసలు మోదీతో పవన్ భేటీ కావడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పల్లకీ మోస్తాడని అనుకుంటే మళ్లీ బీజేపీ వెంట వెళ్లడం ఏంటని టీడీపీ నేతల ప్రశ్న. టీడీపీ అనుకూల చానళ్లలో అప్పుడే పవన్‌ను టార్గెట్ చేయడాన్ని గమనించొచ్చు.
టీడీపీతో కదా పవన్ ఉండాల్సిందని ఆ పార్టీ అనుకూల విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీని కాదని బీజేపీతో పవన్ వెళితే… మూడు చోట్ల నిలిచినా గెలవలేరని ఘాటు విమర్శ చేస్తున్నారంటే… భవిష్యత్‌లో మరెంతగా విరుచుకుపడతారో అర్థం చేసుకోవచ్చు. ప్రధానితో కలవడంపై టీడీపీ అసంతృప్తిగా ఉందనేందుకు ఇలాంటివి చిన్నచిన్న ఉదాహరణలు మాత్రమే. సినీ భాషలో చెప్పాలంటే…ఇది ట్రైలర్ మాత్రమే. మున్ముందు సినిమా వేరే వుంటుంది.
ముఖ్యంగా ఆశలు రేకెత్తించిన పవన్, తాజాగా ప్రధానితో భేటీ తర్వాత యూటర్న్ తీసుకున్నారని టీడీపీ ఆరోపణ. అయితే బీజేపీతోనే పవన్ కొనసాగుతారని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ ఎప్పుడెలా వ్యవహరిస్తారో ఆయనకే క్లారిటీ వుండదని అంటున్నారు. టీడీపీతో సంబంధాలు తెంచుకుంటారని చెప్పలేమనే వాళ్ల సంఖ్య తక్కువేం లేదు. కానీ తమను కాదని వెళితే మాత్రం… నీ అంతు తేలుస్తాం అని తన మీడియా ద్వారా పవన్‌కు టీడీపీ హెచ్చరికలు పంపుతున్న మాట వాస్తవం.