తీవ్ర ఒత్తిడిలో బాబు!

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు స‌మాచారం. ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌న్ను కుంగ‌దీస్తున్నాయ‌ని తెలిసింది. ముఖ్యంగా త‌న‌ను ప్ర‌ధాని మోదీ టార్గెట్ చేశార‌ని, టీడీపీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ…

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు స‌మాచారం. ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌న్ను కుంగ‌దీస్తున్నాయ‌ని తెలిసింది. ముఖ్యంగా త‌న‌ను ప్ర‌ధాని మోదీ టార్గెట్ చేశార‌ని, టీడీపీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వ‌ర‌ని స‌న్నిహితుల వ‌ద్ద బాబు వాపోతున్నార‌ని స‌మాచారం. మోదీ క‌క్ష క‌డితే వ‌దిలి పెట్ట‌రంటూ, త‌నను శ‌త్రువుగా చూస్తున్నార‌ని వాపోతున్న‌ట్టు తెలిసింది.

త‌మకు చేరువ‌వుతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను దూరం చేసేందుకు మోదీ హిత‌బోధ చేశార‌నేది బాబు అనుమానం. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న మొద‌లుకుని ఇప్ప‌టి వ‌ర‌కూ బాబు నుంచి చెప్పుకోద‌గ్గ ప్ర‌క‌ట‌న‌లేవీ రాక‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. భ‌విష్య‌త్‌పై బెంగ‌తో, ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో బాబు ఉన్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రోవైపు స‌న్నిహిత పార్టీల నేత‌లు మీడియాతో మాట్లాడుతూ… తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ జ‌గ‌నే అధికారంలోకి వ‌స్తార‌ని చెబుతుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

టీడీపీ ఒంట‌రిగా పోటీ చేస్తే మాత్రం పుట్ట‌గ‌తులుండ‌వ‌నే వాద‌న బ‌లంగా తెర‌పైకి వ‌స్తోంది. బాబు పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లున్నాయి. ప్ర‌ధానితో భేటీ త‌ర్వాత జ‌న‌సేన‌కు ఒక్క చాన్స్ ఇవ్వాల‌ని కోర‌డం ప‌వ‌న్‌లో వ‌చ్చిన మార్పున‌కు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. అలాగే ట్విట‌ర్ వేదిక‌గా మోదీని ఆకాశమే హ‌ద్దుగా ప‌వ‌న్ ప్ర‌శంస‌లు కురిపించ‌డం బాబుకు ఏ మాత్రం న‌చ్చ‌లేదు.

ఎలాగోలా ప‌వ‌న్‌ను దారిలోకి తెచ్చుకున్నామ‌ని, 10-15 సీట్ల‌తో స‌రిపెట్టి ఆయ‌న సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను కొల్ల‌గొట్టొచ్చ‌ని టీడీపీ ఎత్తుగ‌డ వేసింది. అయితే బాబు ఎత్తుకు బీజేపీ పైఎత్తు వేసింది. ఏపీ బీజేపీ నేత‌లు మాట్లాడ‌కుండానే ప్ర‌ధాని చేతుల మీదుగా ప‌వ‌న్‌ను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌ను ప్ర‌క‌టించి, జ‌న‌వ‌రి నుంచి జ‌నంలోకి వెళ్లేలా బీజేపీ అధిష్టానం రోడ్‌మ్యాప్ ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. 

ఈ నేప‌థ్యంలో మూడు కూట‌ములు ఎన్నిక‌ల బ‌రిలో వుంటే, మ‌రోసారి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే భ‌యాందోళ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఈ ప్ర‌మాదం నుంచి అధిగ‌మించ‌డంపై చంద్ర‌బాబు ముఖ్యుల‌తో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం.