తెలుగు సినిమా పరిశ్రమ సూపర్ స్టార్ ఇక లేరు! తెలుగు నటుల్లో తరాల అంతరాలను దాటుకుని తిరుగులేని ప్రజాదరణ ఉన్న మహానటుడు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి (79) కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.
మామూలుగా సంపూర్ణారోగ్యంతో ఉండే కృష్ణ, కార్డియాక్ అరెస్టుతో సోమవారం హైదరాబాదులోని ప్రెవేటు ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సినీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది.
1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. బాల్యం నుంచి సినిమాలంటే చాలా మక్కువ ఉన్న కృష్ణను తల్లిదండ్రులు మాత్రం ఇంజినీరుగా చూడాలనుకున్నారు. తాను డిగ్రీ చదువుతుండగా.. తమ కాలేజీలో హీరో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం చూసి.. సినిమాలపై మరింత మోజు పెంచుకున్న కృష్ణ ఆ రంగంలో అడుగుపెట్టారు.
1965లో ఆయన ఇందిరను పెళ్లిచేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు ఇటీవల మరణించారు. భార్య ఇందిర కూడా ఇటీవల మరణించారు.
మొదటి పెళ్లి తర్వాత సినీనటి విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకూడా దివంగతులయ్యారు.
తెలుగుజాతి అల్లూరి సీతారామరాజు.. జేమ్స్ బాండ్
తేనెమనసులుతో ప్రస్థానం ప్రారంభించిన నటశేఖర కృష్ణ.. ఒక అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు జాతికి రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలాగో.. అలా.. తెలుగుజాతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే.. కృష్ణనే అనేంత కీర్తి ఆ ఒక్క చిత్రం ద్వారా సంపాదించారు.
తెలుగు తెరకు జేమ్స్ బాండ్ కూడా కృష్ణనే. గూఢచారి చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. కొందరు అనుకరించే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు.
సహృదయుడు, మంచి మనిషి
ఎంతోమంచి మనిషిగా చిత్ర పరిశ్రమలో కృష్ణకు పేరుంది. తన సినిమాలు పరాజయం పాలైనప్పుడు నిర్మాతలు నష్టపోకుండా.. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చే అద్భుతమైన లక్షణం ఆయన ద్వారానే చిత్ర పరిశ్రమకు తెలుసు. ఎందరినో ఆదుకునే వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటారు. సినిమా ఫస్ట్ కాపీ చూశారంటే.. ఎన్ని వారాలు ఆడుతుందో ఖచ్చితంగా చెప్పే కచ్చితత్వం ఉన్న జ్ఞానం ఆయన సొంతం అని ఎరిగిన వారు అంటారు.
స్వచ్ఛమైన మనిషి ఘట్టమనేని కృష్ణ పవిత్రాత్మకు గ్రేట్ ఆంధ్ర నివాళి అర్పిస్తోంది.