‘‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్రా’’ అంటూ హితోపదేశం చేస్తాడు పవన్ కల్యాణ్.. ఒక చిత్రంలో. అలా హితోపదేశం చేసేది సినిమా పవన్ కల్యాణ్ మాత్రమే. రాజకీయ పీకే అలాఏం కాదు.. ఇతరుల డప్పు తాను కొట్టడానికి కూడా సిద్ధమైపోతాడు.
చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికే సిద్ధమవుతున్నవాడు, మరొకరి డప్పు కొట్టడానికి ఎందుకు వెనకాడతాడు. అందుకే ఇప్పుడు పవన్.. ఇన్నాళ్లూ లేనిది, ఇప్పుడు కొత్తగా బిజెపి డప్పు కొట్టడానికి ఉత్సాహపడుతున్నట్టుగా కనిపిస్తోంది. చూడబోతే.. విశాఖ చోళ భేటీలో.. తమ ప్రభుత్వానికి ఉపయోగపడేలా కాసింత డప్పు కొట్టాల్సిందిగా.. ప్రధాని మోడీ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ను కోరినట్లుగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ నామమాత్రంగా బిజెపితో పొత్తుల్లో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఆ పార్టీతో కలిసి చేపట్టిన కార్యచరణ ఇంతవరకూ లేదు. రాష్ట్రంలో ఒకరికొకరు ఉపయోగపడేలా ఉభయులూ ఒక్కమాట మాట్లాడుకున్నది కూడా లేదు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్లు నిర్మించడంలో దోపిడీ జరుగుతోందని చెప్పడానికి జగన్ సిద్ధమైపోయారు. ఆ పథకానికి సంబంధించి సర్కారు ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయి దోపిడీ అయిపోతున్నట్లుగా చెత్తభాష్యాలు చెబుతూ తన అవగాహనను తానే పలుచన చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా.. ఈ జగనన్న ఇళ్ల కోసం కేంద్రప్రభుత్వమే చాలా నిధులు ఇస్తోంది అంటూ ఆయన వకల్తా పుచ్చుకుంటుండడం విశేషం.
జగనన్న ఇళ్లకు కేంద్ర సర్కారు 1.48 లక్షలు ఇస్తోంది.. మిగిలిన సొమ్ము మాత్రమే జతచేసి ప్రభుత్వం తమ పేరు పెట్టుకుంటోంది.. అనే సంగతిని పవన్ కొత్తగా ప్రస్తావిస్తున్నారు. ఆ సంగతి పవన్ కు ఇప్పుడే తెలిసిందా అనేది ప్రజల సందేహం. గతంలో ఇలా కేంద్రానికి డప్పు కొడుతూ పవన్ మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. ఏదో మోడీ నాకు చాలా క్లోజ్ అని చెప్పుకోవడం తప్ప.. నిర్దిష్టంగా ఫలానా పథకాల్లో ఫలానా లబ్ధి వస్తోంది.. అది సూపర్ అని చెప్పినది లేదు.
చూడబోతే.. విశాఖ చోళ భేటీలో పవన్ కల్యాణ్ కు ఈ మేరకు కేంద్రానికి కొంత డప్పు కొట్టాల్సిందిగా మార్గదర్శనం లభించినట్లుంది. మోడీ వంటి దిగ్గజం కాలితో చెబితే తలతో చేసేంతటి విధేయత రాష్ట్రనాయకులందరికీ ఉంది. తాను ఎడ్వాంటేజీ తీసుకోడానికి పవన్ ముందుకొచ్చారు. రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో డబ్బు గరిష్టంగా కేంద్రం పెడుతోందని చెబుతున్నారు. ముందుముందు మోడీ గైడెన్స్ మేరకు మరిన్ని కేంద్ర పథకాలకు కూడా పవన్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇన్ని సుద్దులు చెబుతున్న పవన్ కల్యాణ్.. నరేంద్రమోడీతో భేటీ అయ్యారే.. తాను ఎంతో కాలంగా పదేపదే వాడుకుంటున్న ‘ప్రత్యేకహోదా’ అనే మాటను ఆ సందర్భంలో గుర్తు చేసుకున్నారా లేదా? లేదా, ఆ విశాఖ చోళ భేటీని తన స్వార్థ ప్రయోజనాలకు, చర్చలకు మాత్రం పరిమితం చేసుకుని తిరిగొచ్చారా..? మనకుతెలియదు!