గత కొన్నాళ్లుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై డ్రగ్స్ తరహా ఆరోపణలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో రేవంత్ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు కూడా. ఈ క్రమంలో వీటిపై కేటీఆర్ కూడా స్పందించారు. తనకు డ్రగ్స్ వ్యవహారంతో ఏం సంబంధం అంటూ ఈ మధ్యనే బహిరంగంగా ప్రశ్నించాడు. అయితే ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తగ్గడం లేదు.
డ్రగ్స్ వాడామా లేదా అనే అంశంపై పరీక్షలకు సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో తను పరీక్షలకు రెడీ అని, ఈ విషయంలో తను కేటీఆర్ కూ, మరో నేత విశ్వేశ్వర్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నట్టుగా రేవంత్ ట్వీట్ చేశాడు. ఐస్ బకెట్ చాలెంజ్ తరహాలో రేవంత్ ఇన్ డైరెక్టుగా కేటీఆర్ పై బలమైన పంచ్ విసిరాడు.
దీనీపై కేటీఆర్ స్పందించక తప్పలేదు. మరి ఈ స్పందించడంలో ఆయన రాహుల్ గాంధీ పేరును వాడాడు. తను పరీక్షలకు రెడీ అని, అయితే చంచల్ గూడ బ్యాచ్ తో తనకు పోటీ కాదని, ఢిల్లీలో తను పరీక్షలు చేయించుకుంటానంటూ, తనతో పాటు రాహుల్ గాంధీ కూడా పరీక్షలకు రెడీ కావాలని కేటీఆర్ రివర్స్ పంచ్ విసిరారు. అలాగే ఓటుకు నోటు కేసులో రేవంత్ లై డిటెక్టర్ పరీక్షలను ఎదుర్కొంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆ తర్వాత కూడా రేవంత్ వెనక్కు తగ్గలేదు. తను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనని, అయితే వివిధ అవినీతి ఆరోపణల్లో కేసీఆర్ కూడా అవే పరీక్షలను చేయించుకుంటారా? అంటూ ప్రతి సవాల్ ను విసిరారు రేవంత్ రెడ్డి. ఇక ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. తనపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్న వారిని కోర్టు ద్వారా ఎదుర్కొనబోతున్నట్టుగా ప్రకటించారు.
ఇలా పోటాపోటీ సవాళ్లు విసురుకున్నారు. రాహుల్ ను ఇన్ వాల్వ్ చేస్తూ కేటీఆర్ స్పందిస్తే, రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రస్తావన తీసుకువచ్చాడు. ఇలా పోటాపోటీ పొలిటికల్ పంచ్ లతో జనాలకు వినోదానికి అయితే ఢోకా లేదు కానీ, దీని వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం మాత్రం శూన్యం!