కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రేవంత్ రెడ్డి అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో ఈ పార్టీలో ఎందుకు చేరానా అని బాధ పడ్డాడు. అయినప్పటికీ మొండిగా పార్టీలోనే కొనసాగాడు. పార్టీలో తానేమిటో నిరూపించుకోవాలని అనుకున్నాడు.
అధిష్టానం ఆశీస్సులుంటే తనను ఎవరూ అడ్డుకోలేరని అనుకున్నాడు. అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా, తనను ఎంతమంది సీనియర్లు వ్యతిరేకించినా అవేమీ పట్టించుకోకుండా తాను ఏం చేయాలనుకున్నాడో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టగలడు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలడు. కేసీఆర్ ను ఢీ కొట్టగలడు అనే నమ్మకాన్ని అధిష్టానానికి కల్పించగలిగాడు. ఫలితంగానే పార్టీ హై కమాండ్ ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది.
ఎప్పుడైతే పదవి దొరికిందో అప్పటి నుంచి తన సత్తా చూపించడం మొదలు పెట్టాడు. జోరు పెంచాడు. హుషారు పెంచాడు. నిర్వీర్యంగా ఉన్న పార్టీలో కొత్త జవసత్వాలు పెంచాడు.
సొంత పార్టీలోనే ఆయన్ను మోనార్క్‌గా చిత్రీకరిస్తూ, విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నా.. వాటిని తట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని ఇప్పటికీ కొందరు ఆయన ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్నా.. రేవంత్ రెడ్డి మాత్రం అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తూ తనపై వస్తున్న విమర్శలను కార్యాచరణ ద్వారా పటాపంచలు చేస్తున్నాడు.
తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన కొత్తలో.. పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు రేవంత్ రెడ్డి.
బేషజాలకు పోకుండా సీనియర్ నేతల ఇళ్లకు స్వయంగా తానే వెళ్లి, కలిసి వారి సహకారం కోరి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. తొలుత బెట్టు చేసిన నేతలు కూడా.. ఒక్కోమెట్టు దిగివచ్చారు. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన నాయకత్వాన్ని అంగీకరించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. కానీ, ఏనాడు ప్రతిపక్షాలు కలిసి ప్రభుత్వంపై పోరాటాలు చేసిన సందర్భాలు లేవు. వేటికవి సొంత ఎజెండాతో ఏవో కార్యక్రమాలు నిర్వహించాయి కానీ.. ఇతర పక్షాలతో కలవలేదు. కానీ తొలిసారి రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేశాడు.
రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నింటిని గాంధీ భవన్‌కు ఆహ్వానించి.. కేసీఆర్ సర్కార్‌పై ఉమ్మడిగా యుద్ధం చేద్దామని ప్రతిపాదించాడు. రేవంత్ రెడ్డి పిలుపునకు సానుకూలంగా స్పందించి సీపీఎం, సీపీఐ, టీజేఎస్, సీపీఐ ఎంఎల్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్, తెలంగాణ ఇంటి పార్టీ, పి.వై.ఎల్, పీడిఎస్‌యూ వంటి పార్టీలన్నీ కూడా కదిలి వచ్చి.. సర్కార్‌పై సమరశంఖం పూరించేందుకు ప్రతినబూనాయి.
ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి సాధించిన విజయమని చెప్పొచ్చు. దీని ఫలితం ఎలా ఉంటుందనేది తరువాత సంగతి. ముందైతే రేవంత్ గట్టి పట్టుదలతో ఒక ప్రయత్నం చేయడం మెచ్చుకోదగింది. ఇలాఒక్కటిగా కలిసి పోరాడే విషయంలో సాధారణంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం అనేక అభ్యంతరాలు పెడుతుంటాయి. సందేహాలు వ్యక్తంచేస్తుంటాయి. కానీ వాళ్ళు కూడా కలిసి వచ్చారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. రైతాంగ సమస్యలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారీ స్థాయిలో నిరసనలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా కొన్ని డిమాండ్లతో కూడిన ఛార్టర్‌ను రూపొందించారు.
ఈ నెల 22న నగరంలోని ఇందిరాపార్కు దగ్గర మహా ధర్నా నిర్వహించాలని, 27న రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్‌లో పాల్గొనాలని, 30వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించి వినతిపత్రాలు ఇవ్వాలని, అక్టోబరు 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 కి.మీ. మేర పోడు భూముల సమస్య పరిష్కారానికి భారీ స్థాయి నిరసన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ పోరాటం విజయవంతమైతే ప్రతిపక్షాల ఐక్యత వర్ధిల్లినట్లే. దీనివల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చేనష్టం ఏమీ లేదుగానీ అధికార పార్టీలో భయం మొదలవడం గ్యారంటీ.