రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం విమర్శలు, సవాలు, ప్రతిసవాళ్లు చేసుకోవడం సహజం. హద్దులు దాటనంత వరకూ ఎలాంటి విమర్శ అయినా ఫర్వాలేదు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇటీవల కాలంలో విమర్శలు వ్యక్తిగతంగా చేసుకుంటున్న పరిస్థితి. ఈ ధోరణి తెలుగు సమాజంలో కాస్త ఎక్కువగానే వుంటోంది. ఈ నేపథ్యంలో తనపై అభ్యంంతరకర, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన ప్రత్యర్థులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కోర్టు కెక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సినీ రంగంలో పలువురు సెలబ్రిటీలు మత్తు పదార్థాలు సేవించడంపై ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌పై ఆ కోణంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి అసత్య ఆరోపణలు పునరావృతం కాకుండా చట్టపరంగా అడ్డుకట్ట వేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు.
దీంతో ఆయన తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన వాళ్లకు న్యాయస్థానంలో కఠిన శిక్ష విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ సంగతిని తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం గమనార్హం.
‘నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేశాను. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేరస్తులకు తగిన శిక్ష పడాలి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.