పవన్ కళ్యాణ్, మోదీ భేటీ జరిగింది. స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. బయటకు వచ్చిన మాట్లాడిన పవన్ కూడా రాజకీయ పొత్తుల గురించి ఏమీ మాట్లాడలేదు. ఎప్పటిలాగానే రాష్ట్రం అధ్వాన్నంగా ఉందని, ఆ విషయం మోదీకి చెప్తే ‘ఐ నో’ అన్నారనీ చెప్పాడు.
ప్రధానికి యిక్కడి విషయాలు తెలియకుండా ఉండవు కదా, యింటెలిజెన్స్ వర్గాలున్నాయి, సొంత పార్టీ ఆంధ్ర విభాగం ఉంది, పవన్ కొత్తగా చెప్పేదేమిటి? అది మాత్రమే వినడానికి యీయన్ను రప్పించడం దేనికి? ఈ అధ్వాన్న పరిస్థితి నుంచి మనం ఏ విధంగా లాభం పొందాలి అనే విషయం నాదెండ్ల మనోహర్ బయటకు వచ్చేసిన తర్వాత యిద్దరూ మాట్లాడుకుని ఉంటారు. అది బయటకు చెప్పటం లేదు.
పవన్ జనసేనకు అధ్యక్షుడు. మోదీ బిజెపికి అధ్యక్షుడు కాకపోయినా, ఆయన కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుంది. ఇద్దరి మధ్య జరిగినది శిఖరాగ్ర సమావేశం లాటిది. ఎనిమిదేళ్ల తర్వాత జరిగింది. ముఖ్యమైన విషయాలు మాట్లాడకుండా యింత చప్పగా ఎందుకు సాగి ఉంటుంది? వివరాలు బయటకు చెప్పటం లేదంతే!
వాళ్లు చెప్పటం లేదు కాబట్టి ఇలా జరిగి ఉంటుంది, అలా జరిగి ఉంటుంది అని ఎవరికి వారు ఊహించుకోవలసినదే. యువర్ గెస్ ఈజ్ ఏజ్ గుడ్ యాజ్ మైన్ అన్నట్లు మీ ఊహ మీది, నా ఊహ నాది. నాకు తార్కికంగా తోచినది నేను రాస్తున్నాను. అది నిజం కావాల్సిన పని లేదు.
పవన్ బిజెపిపై అలిగి ఉన్నారన్నది అందరికీ తెలుసు. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి ఆర్నెల్లు దాటింది. నాకు మూడు ఆప్షన్లున్నాయి జాగ్రత్త అని హెచ్చరించీ మూణ్నెళ్ల దాటింది. బిజెపి దేనికీ స్పందించలేదు. పవన్ టిడిపికి దగ్గరౌతున్నట్లు బహిరంగ సంకేతాలు యిచ్చారు. ఇప్పటం గ్రామంలో బిజెపికి బద్ధ శత్రువులైన లెఫ్ట్ వాళ్లతో కలిసి నడిచారు. అయినా బిజెపి జనసేన మాతోనే ఉంది అని ప్రకటనలిస్తూ కాలక్షేపం చేస్తోంది తప్ప, కలిసి అడుగులేయటం లేదు. సంయుక్త కార్యాచరణ పథకాలు రూపొందించటం లేదు. పొత్తు నోటిమాటల్లో మీద ఉంది తప్ప చేతల్లో లేదు.
తెలంగాణ బిజెపి అయితే జనసేన ఊసే ఎత్తటం లేదు. బొత్తిగా దూరం పెట్టేసింది. నిజానికి పవన్ ఉండేది హైదరాబాదులో. మోదీ హైదరాబాదు వచ్చినపుడు హైదరాబాదులోనే కలిస్తే పోయేది. ప్రత్యేక విమానం వేసుకుని వైజాగ్ వెళ్లే శ్రమ తప్పేది. కానీ తెలంగాణ బిజెపికి రుచించలేదో ఏమో, పవన్ వైజాగ్ వెళ్లి కలవాల్సి వచ్చింది.
వైసిపి గురించి ఫిర్యాదులు చెప్పడానికి పవన్‌కు పది నిమిషాల కంటె పట్టి ఉండదు. తర్వాత వైసిపిని ఓడించాలంటే టిడిపిని కలుపుకుని వెళ్లవలసిన అవసరం ఉంది అనే విషయంపై గట్టిగా వాదించి ఉంటారు. ఎందుకంటే మనందరికీ బాహాటంగా చెప్తూ వచ్చిన విషయాన్ని అక్కడ మరో విధంగా చెప్పి ఉండరు కదా! వైసిపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి అంటే నామమాత్రంగా ఉన్న లెఫ్ట్, కాంగ్రెసులను దృష్టిలో పెట్టుకుని చెప్పినది కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి, కొద్ది ఓటు బ్యాంకు, మరి కాస్త గ్లామర్ ఉన్న జనసేన, ఓటు బ్యాంకు పెద్దగా లేకపోయినా కేటలిస్టుగా పనిచేసే బిజెపి – యీ మూడు కలవాలనే పవన్ ఉద్దేశం.
ఈ ముగ్గురిలో కలవడానికి టిడిపి, జనసేన రెడీగా ఉన్నాయి. బిజెపికి జనసేన వరకు ఆమోదమే కానీ టిడిపి అంగీకారయోగ్యం కాదు. ఎందుకంటే బిజెపి 2029 నాటికైనా ఆంధ్రలో అధికారంలోకి రావాలని చూస్తుంది. దానికి అవరోధం టిడిపియే. దాదాపు 40శాతం ఓటు బ్యాంకున్న టిడిపి క్షీణిస్తే తప్ప బిజెపి ఎదగలేదు. దానంతట అది నీరసిస్తున్న టిడిపికి తన చేతుల్తో నీరు పోసి, నిలబెట్టవలసిన పని బిజెపికి ఏముంది? చాలా ఏళ్లగా ఆ పనే చేసి, బిజెపి ఉన్న కాస్త బలాన్ని ఊడగొట్టుకుంది. అప్పట్లో వెంకయ్య నాయుడు వంటి వారు ఆ పుణ్యం కట్టుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నది మోదీ హవా. బిజెపి కలలోనైనా ఊహించని ఈశాన్య రాష్ట్రాలు, త్రిపుర వంటి రాష్ట్రాల్లో సైతం జండా ఎగరేసే ఊపులో ఉన్న బిజెపి కాస్తో కూస్తో బలం ఉన్న ఆంధ్రను చేజార్చుకుంటుందా? ఆంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీలు తగవులాడు కుంటున్నాయి. మరో జాతీయ పార్టీ ఐన కాంగ్రెసు పూర్తిగా బబ్బుంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవడం దేనికి?
సొంతంగా బలం సంపాదించు కోవడానికి చాలాకాలం పడుతుంది కాబట్టి పంజాబ్‌లో అకాలీ దళ్, మహారాష్ట్రలో శివసేన వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు కలిపి త్వరగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు. 2014లో అలాటి లెక్కే వేసి టిడిపితో పొత్తు పెట్టుకుంది. దానివలన పొందిన లాభమేముంది? కేంద్రంలో బిజెపి టిడిపి మంత్రులకు మంచి పోస్టులే యిచ్చింది, గౌరవించింది. ఆంధ్రలో టిడిపి మాత్రం బిజెపి మంత్రులలో ఒకరిని పట్టించుకోకుండా పక్కన పడేసింది. మరొకాయన బిజెపి వ్యక్తిగా కాక టిడిపి వ్యక్తిగా వ్యవహరించేట్లు మేనేజ్ చేసింది. 2019 తర్వాత ఆయన బిజెపిలో ఏ మాత్రం చురుగ్గా లేడు. పార్టీ పునరుద్ధరణకు ఏ ప్రయత్నమూ చేయటం లేదు. వైజాగ్‌కు మోదీ వచ్చినపుడు కలిసినట్లు కూడా లేదు. 2014లో బిజెపితో పొత్తు కుదురుతుందనగానే బాబు తన పార్టీలో చేరదామని వచ్చిన వారిని బిజెపిలో చేర్పించి, ఆ పేరున వారికి టిక్కెట్లిప్పించి, వారిని బిజెపి తరఫున కాకుండా తన తరఫున పని చేసేట్లు చేశారు.
2014లో యిది నడిచింది కానీ 2024లో నడవనివ్వడానికి మోదీ సిద్ధంగా లేరు. ముఖ్యంగా బిజెపితో తెగతెంపులు చేసుకున్నాక 2019 ఎన్నికలకు ముందు బాబు వ్యవహరించిన తీరు చూశాక మోదీకి మండి ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు. గోధ్రా సంఘటన తర్వాత బాబు తనను తిట్టినా, మోదీ 2014లో బాబుతో చేతులు కలిపారు. అలాగే 2024లో కూడా చేతులు కలిపితే కలపవచ్చు. కానీ బిజెపిని టిడిపికి తోకగా చేయడానికి మాత్రం ససేమిరా ఒప్పుకోరు. ప్రస్తుత పరిస్థితిలో వైసిపికి వ్యతిరేకంగా ఏం చేసినా ప్రధాన ప్రతిపక్షమైన టిడిపియే బలపడుతుంది. తక్కినవన్నీ దానికి తోకలుగానే ఉండాలి. అందుకే వైసిపి, టిడిపి ఒకరితో మరొకరు తలపడి రెండూ బలహీనపడాలి అని కోరుకుంటోంది. అప్పుడే తను ఎదగగలదు.
టిడిపి బలపడాలంటే 2024 ఎన్నికలలో అది గెలవకూడదు. 2019 ఓటమి తర్వాత దాని క్యాడర్, నాయకులు తగ్గారు. ఓటు బ్యాంకు బాగానే ఉన్నా, వారిని ఉత్తేజపరిచి, మంచి ప్లానుతో విన్నింగ్ ఎజ్ తెచ్చుకోవాలంటే నాయకులు కదలి రావాలి. టిడిపి అధికారంలో ఉండగా సర్వసౌఖ్యాలు అనుభవించిన వారు యిప్పుడు యింట్లోంచి కదలటం లేదు. మూడు టీవీ డిస్కషన్ల ప్యానెళ్ల మెంబర్లు, యాంకర్లు మాత్రమే బుల్లితెరపై యుద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆ చురుకుతనం లేదు. ఇలాటి పరిస్థితుల్లో 2024లో కూడా టిడిపి ఏ ఏభై సీట్ల దగ్గరో ఆగిపోతే యిక పార్టీ నిస్తేజం అయిపోతుంది. పాదయాత్ర తర్వాత లోకేశ్ జననాయకుడిగా ఆవిర్భవించి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వస్తాడని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అనిపిస్తే తప్ప క్షీణదశ ప్రారంభమైనట్లే.
అలాగే వైసిపి తప్పులు చేస్తూ పోయి, రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి, ప్రజల్లో ఒక వర్గాన్ని మాత్రమే చంకనేసుకుని, తక్కినవారిని కష్టాల పాలు చేస్తే, ఓటర్లకు చికాకు పుట్టి దాని అధికారం అంచుల్లో నిలిపేయవచ్చు. పార్టీ ఓటమి బాట పట్టిందని అనిపించగానే నాయకులు మూడో పార్టీ కేసి దిక్కులు చూస్తారు. అది బిజెపి, జనసేన వంటి పార్టీల ఎదుగుదలకు అనువైన సమయం. అలాటి సమయం కోసం కొంతకాలం వేచి ఉండడానికి బిజెపి సిద్ధం. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి అది కాదు. జగన్‌ను రాజకీయ ప్రత్యర్థిగా కాక వ్యక్తిగత శత్రువుగా చూస్తున్నాడాయన. ఎలాగోలా అర్జంటుగా జగన్‌ను గద్దె దింపాలనే తపనతో టిడిపితో చేతులు కలపాలని తహతహ లాడుతున్నాడు. దీర్ఘకాలికంగా అది తన పార్టీకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, బాబు బిజెపిని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నట్లు జనసేనను కూడా తన మనుష్యులతో నింపేస్తారా అనే ఆలోచనలకు తావివ్వడం లేదు.
బిజెపి, జనసేన దృక్పథాల్లో ఉన్న యీ తేడా వలననే విభేదాలు వస్తున్నాయి. టిడిపితో తక్షణం కలుద్దామని పవన్ ఆరాటపడుతూంటే, తొందరేముంది, 2024 ఎన్నికలు దగ్గర పడేదాకా వేచి చూదాం అని సలహా చెపుతూ బిజెపి తాత్సారం చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి బిజెపి పడుతున్న ఆరాటం ఆంధ్ర ఎన్నికల గురించి కనబరచటం లేదు. తెలంగాణ ఎన్నికలు 2023 డిసెంబర్లో కాగా, ఆంధ్ర ఎన్నికలు 2024 జూన్‌లో. అంటే ఏడు నెలలు మాత్రమే తేడా. కానీ తెలంగాణ బిజెపి ఎన్నికల సమరం మొదలుపెట్టి ఏడాది దాటింది. ఆ లెక్కన చూస్తే ఆంధ్రలో ఐదారు నెలల క్రితమే మొదలుపెట్టాలి. కానీ అక్కడ చలనం లేదు. తాపీగానే ఉన్నారు. మోదీ ఆంధ్ర బిజెపి కార్యకర్తల నుద్దేశించి ‘ఆంధ్రలో అన్యాయాలు జరుగుతున్నాయని యిప్పుడు చెప్తున్నారు. వీటిపై పోరాడవద్దని ఎవరైనా మిమ్మల్ని ఆపారా?’ అని మందలించారు. పై నుంచి ప్రెషర్ లేదు కాబట్టి పెద్దగా ఏమీ చేయలేదని వాళ్లు చెప్పలేరు కదా!
ఏది ఏమైనా 2024 ఎన్నికల నాటికి బిజెపి ఆంధ్రలో వైసిపిపై దండెత్తడానికి సిద్ధంగా లేదని తేటతెల్లంగా తెలుస్తోంది. పైగా జగన్ బహిరంగ సభలో యువర్స్ మోస్ట్ ఫెయిత్‌ఫుల్లీ అనే ధోరణిలో ప్రసంగించారు. రాష్ట్రానికి ఎంతో చేశారు అని పొగిడి, యింకా కావలసినవి అంటూ ఏకరువు పెట్టి, అవీ దయచేయించండి అని విజ్ఞప్తి చేసి వదిలిపెట్టారు. మేం యితర కూటముల జోలికి వెళ్లం, మిమ్మల్నే నమ్ముకున్నాం, మీతో బంధం వ్యక్తిగతమైనది, రాజకీయాలకు అతీతమైనది అని ప్రామిస్ చేశారు. సభకు విపరీతమైన జనసమీకరణ చేసి, చూశారా మా బలం, యింత బలగం ఉన్న మాతో చెడగొట్టుకుని మా శత్రువులతో చెలిమి చేసి బావుకునేదేముంది? అని పరోక్షంగా హెచ్చరించారు. ఇవన్నీ పవన్‌తో మీటింగైన మర్నాడు జరిగాయి. కానీ యీ లోపున సంకేతాలైతే వెళ్లి ఉంటాయి కదా!
తనకు పడని ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా బిజెపి ఎంతలా యిబ్బంది పెడుతోందో చూస్తున్నాం. అలాటి గొడవలు వైసిపి ప్రభుత్వంతో లేవు కదా. దాన్ని బట్టే అర్థమౌతోంది, వైసిపితో కోరి కయ్యం పెట్టుకునే ఉద్దేశంలో బిజెపి లేదని! బిజెపికి యీ ఊహ మారాలంటే ప్రతిపక్షంలో ఉన్న టిడిపి విపరీతంగా బలపడి ఉండాలి. అది తనకు సముచిత గౌరవం యివ్వాలి. ఆ రెండు సంకేతాలూ బిజెపికి అందలేదు. టిడిపి హడావుడి మీడియాలో కనబడుతోంది తప్ప ఎన్నికల క్షేత్రంలో కనబడటం లేదు. ఇక సముచిత గౌరవం మాట కొస్తే బాబు వైఖరి మారినట్లు దాఖలా చూపించాలంటే, ఒకటే మార్గం. టిడిపి-జనసేన పొత్తు కుదిరితే మొదటి రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని ప్రకటించడం! అలా ప్రకటించినప్పుడే పవన్ అభిమానులు, కులస్తులు యీ కూటమికి ఓటేస్తారనే ధైర్యం చిక్కుతుంది. అప్పుడు బిజెపి ఆటోమెటిక్‌గా యీ పొత్తులోకి వచ్చి చేరుతుంది.
బాబు ఆ దిశగా ఏమీ ప్రకటన చేయలేదు. పైగా ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేసి ఉన్నారు. ఏ సంఘటన జరిగినా మేం మళ్లీ అధికారంలోకి వచ్చి మీ పని పడతా అంటూ పోలీసులను బెదిరిస్తున్నారు. పవన్ దిల్లీ వెళ్లి బిజెపి యితర నాయకులను కలిసినపుడు ‘మీరూ, మేమూ కలిసి త్యాగాలు చేసి బాబునెందుకు ముఖ్యమంత్రిని చేయడం? మీరు ముఖ్యమంత్రి కావడానికి మాకు అభ్యంతరం లేదు. టిడిపి చేత కూడా ఆ ముక్క అనిపించండి. అప్పుడు టిడిపిని కలుపుకుని పోయే విషయం మాట్లాడండి.’ అని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ బాబుతో ఆ విషయం మాట్లాడారో లేదో, మాట్లాడినా బాబు నిరాకరించారో మనకు తెలియదు. పొత్తు కోసం టిడిపి ఒక మెట్టు దిగినట్లు ఏ బహిరంగ ప్రకటనా చేయలేదు.
ఇలాటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి బిజెపి టిడిపితో పొత్తు గురించి ఆలోచించ దలచుకోలేదు. అందుకే మోదీ బాబుతో సమావేశం పెట్టుకోలేదు. దిల్లీలో బాబు అనుకోకుండా కలిసినపుడు ‘మీతో మాట్లాడవలసినది చాలా ఉంది’ అన్న పెద్దమనిషి వైజాగ్ వచ్చినపుడు రాజకీయంగా బాబు కంటె ఎంతో తక్కువ స్థాయి ఉన్న పవన్‌ను కలవగా లేనిది ఆయనను కలవలేడా? పోనీ హైదరాబాదులో నైనా కలవవచ్చు. కలవక పోవడం దేన్ని సూచిస్తోంది? దిల్లీలో మాట్లాడినది ఏదో మర్యాదకు మాట్లాడినది తప్ప మనసులోంచి వచ్చిన మాట కాదని! రెండోది, బాబుతో ప్రస్తుతం రాజకీయ అవసరాలేవీ బిజెపికి లేవని! మరి అలాటి అవసరం పెట్టుకోండని పవన్ మోదీని కోరినప్పుడు ఆయనేం చెప్పి ఉంటాడు? ఆయన స్థాయి నాయకుడు పవన్‌తో తమ మనసులో ఉన్నవన్నీ చెప్పి ఉంటాడనుకోలేము. ఎన్నికలు దగ్గర పడేదాకా వేచి చూదాం అని హితవు చెప్పి ఉండవచ్చు.
లేదా ‘మీరు దిల్లీ వచ్చినపుడు మా వాళ్లు ఏదో సూచన చేశారట కదా, దాని సంగతేమైంది?’ అని యాథాలాపంగా అడిగినట్లు అడిగి ఉండవచ్చు. దానికి పవన్ ఏం చెప్పాలి? బాబు గారితో యింకా మాట్లాడలేదనో, నా పదవి గురించి పట్టుబడితే బాగుండదని ఆగాను అనో చెప్పి ఉండాలి. ఏం చెప్పినా దాని అర్థం, ‘కూటమి తరఫున తొలి ముఖ్యమంత్రిగా పవన్’ అనే ప్రతిపాదన బాబుకి సమ్మతం కాదనే! ‘మరి అలాటప్పుడు మనిద్దరమే కలిసి ఉండి గట్టిగా కృషి చేస్తే యివాళ కాకపోయినా రేపైనా నువ్వు ముఖ్యమంత్రివి కదా, ఎందుకు తొందరపడడం? ఓర్పు అవసరం.’ అని అని చెప్పి మోదీ ముగించి ఉండవచ్చు. పెద్దలు హితవు చెపితే పిన్నలకు ఎంత చికాకు వస్తుందో పవన్‌కూ అంతే వచ్చింది. మీటింగు తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో అసహనం, అసంతృప్తి ఆయన మొహంలో కనబడింది అని అందరూ ఫీల్ కావడానికి, వ్యాఖ్యానించడానికి కారణం యిదే! 8 ఏళ్ల తర్వాత పిలిచారంటే చాలా ముఖ్యమైన విషయమే చెప్పడానికి కాబోలు అని ఆశ పెట్టుకుని వెళ్లిన పవన్‌కు యిప్పట్లో ఏమీ లేదు, ఎక్కడి గొంగళి అక్కడే అని చెప్తే నిరాశ కమ్ముకోదూ!
ఈ మాత్రం ముక్క మాత్రమే చెప్పడానికి సాక్షాత్తూ మోదీగారు దిగి రావాలా అనిపిస్తుంది. వైజాగ్ ఘటన తర్వాత టిడిపి-జనసేన బంధం బలపడుతోందని బిజెపికి ఉప్పదిందేమో! బిజెపి తనను పట్టించుకోక పోవడం చేతనే పవన్ అలిగి టిడిపి కౌగిట్లోకి వెళుతున్నారనే వ్యాఖ్యలు వచ్చాయి. ‘అబ్బెబ్బే, నిన్ను నిర్లక్ష్యం చేయడమేమిటి? నాన్సెన్స్, నువ్వెప్పటికీ మా వాడివే, లేకపోతే 8 ఏళ్ల తర్వాత నిన్ను ప్రత్యేకంగా పిలిపిస్తానా?’ అని అనడానికి మోదీ పవన్‌ను ఉబ్బేశారు. ఈ విధంగా అతన్ని టిడిపి పరిష్వంగం నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పవన్‌కు నచ్చటం లేదు. టిడిపితో అయితే అతని ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అభ్యర్థుల సెలక్షన్ దగ్గర్నుంచి, మీడియా మేనేజ్మెంట్ దగ్గర్నుంచి, నిధుల సమీకరణ దగ్గర్నుంచి అన్నీ బాబే చూసుకుంటారు. తను అప్పుడప్పుడు వచ్చి లెక్చర్లు దంచి వెళ్లిపోవడమే!
కానీ సొంతంగా వెళ్లాలన్నా, బిజెపితో కలిసి సాగాలన్నా చచ్చేటంత ప్రయాస. సినిమాల ఒత్తిడి ఓ పక్క, యాక్టివ్ పొలిటీషియన్‌గా ఉండడం మరో పక్క – అదిరిపోతుంది. అందువలననే సమావేశానంతర ప్రెస్ మీట్లో పవన్ అసహనం, అసంతృప్తి! టిడిపితో కలవడానికి బిజెపి ప్రస్తుతానికైతే రెడీ కాదు అనే సందేశాన్ని రామోజీరావు గారి ద్వారా కూడా బాబుకి చెప్పించి ఉంటారు. ఇక్కడ పవన్, మోదీ సమావేశమైన రోజే రామోజీ ఫిల్మ్ సిటీలో బాబు, రామోజీ కలిశారు. వారి మధ్య తీవ్రంగా చర్చించేటంత రాజకీయాంశం యిది కాక మరొకటి ఉంటుందనుకోను. రామోజీ అంత డైరక్టుగా చెప్పకపోయినా, మోదీ పవన్‌కు అర్థమయ్యేలా టిడిపి-బిజెపి పొత్తు సాగేది కాదు అని చెప్పేసి ఉంటారు. ‘తుమ్ లడో, సిఎం బనో, హమ్ తుమ్హారే సాథ్ హైఁ’ ధోరణిలో చెప్పి ఉంటారు.
రెండు రోజులు గడిచేసరికి పవన్‌కు సమాధాన పడి ఉంటారు. బిజెపి వాళ్లు ‘మోదీగారు చెప్పినదానిపై ఏం ఆలోచించారు?’ అని పరాకు చెప్పి ఉంటారు కూడా. దాంతో యివాళ తనే ముఖ్యమంత్రి కాండిడేటు అనే ప్రకటన లాటిది చేశారు. ఎవరెవరికో యిచ్చారు, నాకూ ఓ ఛాన్సివ్వండి అని ప్రజల్నడిగారు. వైసిపిని ఎదిరించే శక్తి దశాబ్దాల వయసున్న టిడిపికి లేదనీ అనేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు బలమైన కాంగ్రెసు, టిడిపిలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా తను వచ్చానని అన్నారు. పవన్ కూడా ఆ పార్టీ నుంచి వచ్చినవారే కదా. ఇప్పుడు టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా తను వస్తున్నానని, బిజెపి తనకు అండగా ఉంటుందని సూచనలిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ఈ ఊహే కరక్టయితే మోదీతో సమావేశం పవన్‌లో పెనుమార్పును తెచ్చిందనే చెప్పాలి. టిడిపి చంకకర్రలను పక్కన పడేసి, తన సొంతకాళ్లపై నిలిచి, సొంత కత్తి దూయడానికి చూస్తున్నారని అనుకోవాలి. పవన్ టిడిపికీ పోటీదారుగా అవతరిస్తే తెలుగు మీడియా వైఖరి ఎలా మారుతుందో గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది.