నాగబాబు అజ్ఞానం పేరు ‘పూర్తి పరిజ్ఞానం’!

జనసేన పార్టీ తరఫున ఇప్పుడిక మూడో కృష్ణుడు కూడా రంగప్రవేశం చేసినట్టే. ఇంచుమించు తొమ్మిదేళ్లుగా నడుస్తున్న ఆ పార్టీలో.. ఇప్పటికైనా సరే.. కీలకమైన సమావేశం జరిగితే వేదికమీద కూర్చోడానికి ముగ్గురు నాయకులు తప్ప వేరే…

జనసేన పార్టీ తరఫున ఇప్పుడిక మూడో కృష్ణుడు కూడా రంగప్రవేశం చేసినట్టే. ఇంచుమించు తొమ్మిదేళ్లుగా నడుస్తున్న ఆ పార్టీలో.. ఇప్పటికైనా సరే.. కీలకమైన సమావేశం జరిగితే వేదికమీద కూర్చోడానికి ముగ్గురు నాయకులు తప్ప వేరే దిక్కులేదు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీకి బ్రెయిన్ నాదెండ్ల మనోహర్, ఇక పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు!.

నాగబాబు కూడా తమ్ముడి టైపే! కాపోతే ఆయన బుల్లితెర షూటింగులు లేని రోజుల్లో మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. తమ్ముడికంటె ఇంకాస్త నీచంగా నోరు పారేసుకుని రాజకీయ విమర్శలు చేయడంలో కూడా ముందుంటారు. అలాంటి కొణిదెల నాగబాబు తాజాగా తన జ్ఞాన ప్రదర్శన చేశారు. అది కూడా పార్టీ తరఫున ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ చేశారు. ఇప్పటిదాకా ఆ పార్టీ తరఫున ప్రెస్ నోట్ లు ఇవ్వాల్సి వస్తే.. పవన్ కల్యాణ్, నాగబాబు మాత్రమే ఇచ్చేవాళ్లు. సాధారణమైనవి పార్టీ లోని వారి పేర వచ్చేవి. ఇప్పుడు కీలక ప్రెస్ నోట్లు ఇచ్చే మూడో కృష్ణుడుగా నాగబాబు రంగప్రవేశం చేశారు. 

ఇంతకూ ఆ పరిణామం ఎలా సంభవించిందో తెలుసా..

గుంకలాంలో పవన్ కల్యాణ్ జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటూ.. తన వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఒక కాకుల లెక్కను సమర్పించేశారు. అయితే తర్వాత.. మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. జగనన్న ఇళ్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాను తలదించుకుంటానని సవాలు విసిరారు. అలాంటి సంస్కారవంతమైన సవాలును స్వీకరించడానికి పవన్ కల్యాణ్.. అన్న నాగబాబు ను ముందుకునెట్టినట్టుగా కనిపిస్తోంది. 

నాగబాబు పేరిట.. విడుదలైన ప్రెస్ నోట్ లో పూర్తి పరిజ్ఞానం లేని మంత్రులకు స్క్రిప్ట్ అందించినట్టే అందరికీ అందిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. బొత్స సవాలుకు కౌంటర్ అన్నట్టుగా అవినీతి చిట్టాను విప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అయితే ఎటూ తమ అధినేత పవన్ కల్యాణ్ 10-15 వేల కోట్ల రూపాయల అవినీతి అని ఆల్రెడీ ప్రకటన చేసేశారు గనుక.. ఆ ఫిగర్ రీచ్ అయ్యేలా లెక్కలు వండి వారికి వడ్డించడం నాగబాబు పని అయింది. 

అందులో అనేక పాయింట్లు కలిపి.. ప్రతి పాయింటులోనూ ‘ఇన్నేసి వేల కోట్లు’ అంటూ పదాలను జోడించి.. వాక్యం చివర్న ‘దోచుకున్నారు’ అనే పదంతో ముక్తాయించారు. దోచుకుని ఉంటే మంచిదే. నిందలు వేయవచ్చు. కానీ.. వారి వాదననే నాగబాబు తేల్చేశారు. 

ఉదాహరణ చూస్తే.. ఇళ్ల స్థలాల లెవెలింగ్ , చదును చేయడానికి సంబంధించి 2631 వేల కోట్లు దోచేసుకున్నారు అనేది ఒక ఆరోపణ. మళ్లీ దాని వివరణలో ఆ పని చేయడానికి ఆ మొత్తం మంజూరు అయినట్లు రాశారు. ఇందులో భారీ అవినీతి అని రాశారు. ప్రారంభంలో మాత్రం.. 2631 వేల కోట్లు దోచేసుకున్నారు అని రాశారు. మరి మంజూరైనదంతా దోచేసుకుంటే.. ఒక్క అంగుళం కూడా చదును చేయడం జరగలేదా? అనేది ప్రజల ప్రశ్న. 

అసలే బుర్ర లేని నాగబాబు.. ఆపైన ఆయన జ్ఞాన ప్రదర్శన.. మొత్తానికి పార్టీ పరువుపోయేలా వ్యవహారం తయారైంది. ఒక పనిలో అవినీతి జరిగిందంటే.. ఆ పనిమొత్తం కంటె ఎక్కువ అవినీతి అనేది జరగదు కద. కానీ ఆ లాజిక్ పట్టించుకోకుండా.. ఎంత మంజూరైతే అంత, ఎంత ఖర్చు పెడితే అంత .. మొత్తం దోచేసుకున్నారు. అంటూ నాగబాబు నోరు పారేసుకున్నారు.అయినా సరే.. ఇలాంటి కాకుల లెక్కలతో.. అర్థం పర్థంలేని విమర్శలతో ఆల్రెడీ పార్టీ పరువు తీసేశారు.