భారీ ఎత్తున రూపొందే ప్రణాళికలతో పట్టాలెక్కిన పలు సినిమాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా కనిపిస్తూ ఉంది. అప్పటికే ఆ సినిమాలను మొదలుపెట్టేసి భారీ ఎత్తున ఖర్చు కూడా పెట్టారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుని, అందులో సగం మొత్తాలను ఖర్చు పెట్టేసి షూటింగ్ లు సగం వరకూ పూర్తి చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. నాలుగో నెల గడిచిపోతోంది, ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పుడు షూటింగులు జరిగే అవకాశం ఉందో తెలియని పరిస్థితి. పరిమితులతో షూటింగులు చేసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయితే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండటంతో.. సీరియల్ షూటింగులు కూడా మళ్లీ ఆగిపోతున్నాయని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్టార్ హీరో నెమ్మదినెమ్మదిగా తన సినిమా షూటింగును పూర్తి చేస్తున్నాడట. అతడు మరెవరో కాదు సల్మాన్ ఖాన్. 'రాధే: ది మోస్ట్ వాంటెడ్ భాయ్' పేరుతో తన స్టైల్ మాస్ మసాలా సినిమా షూటింగును వేగంగా పూర్తి చేస్తున్నాడట సల్మాన్ ఖాన్. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ పాటికే ఎప్పుడో అజర్ బైజాన్ కు వెళ్లి పాటతో పాటు కొన్ని సీన్లను చిత్రీకరించాల్సిందట. అయితే సినిమా షూటింగులకు అంతర్జాతీయ ప్రయాణాల అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ముంబైలోనే ఒక స్టూడియోలో మొత్తం షూటింగును పూర్తి చేస్తున్నారట.
విదేశాల్లో చిత్రీకరించాలనుకున్న పాటలను, సీన్లను మొత్తం.. స్టూడియోలోనే తీసేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ జరుగుతోందని, మరో 12 రోజుల షూటింగ్ వర్క్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందని సమాచారం. టెక్నాలజీని వాడుకుంటూ.. మొత్తం షూటింగును ఒక స్టూడియోలో చుట్టేసి, దానికి గ్రాఫిక్ వర్క్స్ తో హంగులు అద్దుతున్నట్టుగా ఉన్నారు. షూటింగ్ పూర్తి చేస్తారు సరే, మిగిలిన వర్క్ ను వర్క్ ఫ్రమ్ హోమ్ లతో పని చేస్తారూ సరే, మరి విడుదల సంగతేంటి?