ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సరిదిద్దుకోలేని తప్పు చేసింది. అది పరిషత్ ఎన్నికల బహిష్కరణ పిలుపు. దాన్ని టీడీపీ శ్రేణులు పాటించకపోవడంతో ఆ పార్టీ భంగపాటుకు గురైంది. అనేక పరిణామాల మధ్య పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్నటికి వెలువడ్డాయి.
గెలిస్తే మాత్రం …అది తమ గొప్ప అని, ఓడితే అధికార పార్టీ ఆగడాలనే రీతిలో టీడీపీ, ఎల్లో మీడియా సరికొత్త వాదనకు దిగింది. ఈ పరిణామాలన్నీ ఊహించినవే. అయితే ప్రజాస్వామ్యంలో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
అలాంటి ఆత్మహత్యాసదృశ్యానికి టీడీపీ పాల్పడిందని…పరిషత్ ఎన్నికల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో టీడీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది అత్యంత కీలకం. గెలుపోటములు సహజం. ఏదీ శాశ్వతం కాదు. అందుకే ఓటమితో సంబంధం లేకుండా వామపక్షాలు ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి.
ఈ సూక్ష్మ విషయం 40 ఏళ్లకు పైబడి రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడికి తెలియదని అనుకోలేం. అయితే పరిషత్ ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇవ్వడంలో చంద్రబాబు వ్యూహాత్మక తప్పదానికి పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రోజు పరిషత్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కనీసం మాట్లాడలేని దుస్థితి.
ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ పరిస్థితి ..చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందమైంది. చంద్రబా బుతో పాటు ఆయన్ను మోస్తున్న ఎల్లో మీడియాకు కూడా పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎలా సమర్థించుకోవాలో దిక్కుతెలియని పరిస్థితి. ప్రజాస్వామ్యంలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని పెద్దలు చెబుతారు.
ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక భవిష్యత్ ముగిసిందని నిరాశకు లోనయ్యే వాళ్లు రాణించలేరు. అయినా అధికార పక్షంపై అలిగి ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయకపోతే… నష్టమెవరికి? అది ప్రతిపక్షానికే అని చెప్పక తప్పదు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో టీడీపీ పట్టు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.
ఇక్కడ టీడీపీ విషయంలో అదే జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ కార్యకర్తల బలంపై ఆధారపడిన పార్టీ. అలాంటిది ఎన్నికల పోరులో సైనికుడే తప్పుకుంటే…ఇక చెప్పేదేముంది? కావున కేడర్‌కు బలాన్నిచ్చేలా టీడీపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది.