దారుణం..మృత‌దేహాల‌ను తీస్తుండ‌గానే ఇంకో యాక్సిడెంట్

న‌ల్లగొండ జిల్లా ప‌రిధిలోని 65వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఆదివారం రోజున‌ దారుణం చోటు చేసుకుంది. కేవ‌లం అర‌గంట వ్య‌వ‌ధిలో 300 మీట‌ర్ల దూరంలో రెండు ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఒక యాక్సిడెంట్ జ‌ర‌గ‌డం…

న‌ల్లగొండ జిల్లా ప‌రిధిలోని 65వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఆదివారం రోజున‌ దారుణం చోటు చేసుకుంది. కేవ‌లం అర‌గంట వ్య‌వ‌ధిలో 300 మీట‌ర్ల దూరంలో రెండు ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఒక యాక్సిడెంట్ జ‌ర‌గ‌డం వ‌ల్ల ట్రాఫిక్ ఆగిపోవ‌డంతో, మ‌రో యాక్సిడెంట్ చోటు చేసుకున్న దారుణం ఇది. ఒక ప్ర‌మాదానికి సంబంధించిన కారులో ఇరుక్కుపోయిన మృత‌దేహాల‌ను తొల‌గిస్తుండ‌గా, దానికి ప‌ర్లాంగు దూరంలోనే మ‌రో యాక్సిడెంట్ జ‌రిగింది. మొద‌టి ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా, రెండో ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. 

పోలీసులు తెలిపిన ప్ర‌కారం.. ఈ దారుణాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తికి చెందిన క‌దిరి గోపాల్ రెడ్డి, ర‌చ‌నా దంప‌తులు త‌మ కూతురు, త‌మ స్నేహితుడుతో క‌లిసి హైద‌రాబాద్ నుంచి నూజివీడుకు ప్ర‌యాణం చేస్తున్నారు.

ఓవ‌ర్ టేక్ చేసే క్ర‌మంలో కారు వెళ్లి  లారీని ఢీ కొట్టింద‌ట‌. ఆపై అదుపు త‌ప్పి బోల్తా ప‌డ‌టంతో.. కారులో ప్ర‌యాణిస్తున్న గోపాల్ రెడ్డి, ర‌చ‌న‌, ప్ర‌శాంత్ లు మ‌ర‌ణించారు. ఆ దంప‌తులు ముప్పై యేళ్ల వ‌య‌సు వారు కాగా, ప్ర‌శాంత్ వ‌య‌సు 24 సంవ‌త్స‌రాలే. గోపాల్-ర‌చ‌న కూతురు మాత్రం గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. 

ఈ ప్ర‌మాదంతో ర‌హ‌దారిపై ట్రాఫిక్ ఆగిపోయింది. స‌హాయ‌క సిబ్బంది రంగంలోకి దిగి మృత‌దేహాల‌ను, క్ష‌తగాత్రుల‌ను కారు నుంచి బ‌య‌ట‌కు తీస్తున్నారు. యాక్సిడెంట్లు జ‌రిగినప్పుడు కొంద‌రు చూడ‌టానికి, మ‌రి కొంద‌రు ముందుకు వెళ్ల‌లేక ర‌హ‌దారుల‌పై వాహ‌నాలు ఆగిపోవ‌డం మ‌న ద‌గ్గ‌ర జ‌రిగేదే.

ఈ క్ర‌మంలో అలా ఒక ప‌ర్లాంగు దూరం పాటు వెహిక‌ల్స్ ఆగిపోయాయ‌ట‌.  అలా వెనుక‌వైపు ఆగి ఉన్న లారీ ఇంకో ప్ర‌మాదానికి కార‌ణం అయ్యింది. ఆగి ఉన్న లారీని మ‌రో కారు వ‌చ్చి వేగంగా ఢీ కొట్టింది. ఆ కారులో సూర్య‌పేట‌కు వెళ్తున్న శివ‌ప్ర‌సాద్, విన‌య్ కుమార్ లు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించిన‌ట్టుగా తెలుస్తోంది. వీరు కూడా పాతికేళ్ల వ‌య‌సు లోపు వారే.

ఒక ప్ర‌మాద‌మే దురదృష్టం అనుకుంటే… ఆ ప్ర‌మాదం అయిన ప‌ర్లాంగు దూరంలోనే, ఆ ప్ర‌మాదం కార‌ణంగా ఏర్ప‌డిన ట్రాఫిక్ తో ఇంకో ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం, రెండు ప్ర‌మాదాల్లో ఐదు మంది ప్రాణాల‌ను కోల్పోవ‌డం విధి వైచిత్రి అనుకోవాలి.