పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ప్రధానమైంది. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి, విచారించి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు. ఇదే సమయంలో ఒక్కోసారి వైవాహిక జీవితానికి సంబంధించి అంచనాలు తప్పుతుంటాయి. ఇలాంటిదే మధ్యప్రదేశ్‌లోని ఓ యువకుడి జీవితంలో చోటు చేసుకొంది. అందుకే అతను ఇద్దరమ్మాయి ముద్దుల మొగుడిగా గుర్తింపు పొందాడు.
ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోడానికి అ యువకుడికి ఎలాంచి చట్టాలు, చుట్టాలు అడ్డు రాలేదు. సందీప్ అనే వరుడు, ఇద్దరు వధువుల మెడల్లో మూడేసి ముళ్లు వేశాడు. అసలే జరిగిందంటే…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ ఉకే చదువుతుండగా ఓ అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు. దీంతో ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. ఒక వైపు ప్రేమాయణం సాగుతుండగా, మరోవైపు తల్లిదండ్రులు మరో రకంగా ఆలోచించారు. మరో యువతితో పెళ్లి సంబంధం కుదిర్చారు.
దీంతో ప్రేమించిన అమ్మాయి ఒకవైపు, పెద్దలు కుదిర్చిన అమ్మాయి మరోవైపు. సినిమాల్లో శోభన్‌బాబు, జగపతిబాబులకు సమస్యలు ఎదురైన పరిస్థితి. ఈ వ్యవహారం కాస్తా రచ్చబండ్ వద్దకు చేరింది. గ్రామ పెద్దలు అబ్బాయి, ఇద్దరమ్మాయిల కుటుంబాలను పిలిపించుకున్నారు. న్యాయ విచారణ చేశారు. తమకు అతనే కావాలని ఇద్దరమ్మాయిలు తెగేసి చెప్పారు. దీంతో సంకట స్థితి. ఏం చేయాలో పెద్ద మనుషులకు దిక్కుతోచలేదు.
ఏం చేద్దామని సందీప్‌ను గ్రామ పెద్దలు ప్రశ్నించారు. ఇద్దరితో కలిసి ఉండడానికి తనకు అభ్యంతరం లేదని అతను సమాధానమిచ్చాడు. అందుకు అమ్మాయిలు సరేననడంతో పాటు మూడు కుటుంబాలు అంగీకరించడంతో ప్రేమకు శుభం కార్డు పలికేందుకు గ్రామ పెద్దలు సిద్ధమయ్యారు. కెరియా గ్రామంలో అన్ని హంగులతో, బంధుమిత్రుల మధ్య పెళ్లి ఘనంగా జరగింది.