ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. యూపీ సర్కార్‌ను కాపాడేందుకే వికాస్‌ను తీసుకెళ్తున్న కారును బోల్తా కొట్టించారంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కౌంటర్ పేల్చారు. దీంతో వికాస్ వ్యవహారం పాలక ప్రతిపక్ష పార్టీల మధ్య కౌంటర్, ఎన్కౌంటర్లకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలన సాగుతున్న విషయం తెలిసిందే.
అఖిలేష్ ఘాటైన విమర్శలతో వికాస్ ఎన్కౌంటర్ రాజకీయ రంగు పులుముకొంది. వికాస్‌తో పోలీసులకున్న సంబంధాలు బయటపడతాయనే భయంతోనే ఎన్కౌంటర్ చేశారని అఖిలేష్ మండిపడ్డారు. అంతేకాదు, ఉజ్జయిని ఆలయంలో వికాస్ అరెస్ట్ కావడంపై కూడా అఖిలేష్ ప్రశ్నల వర్షం కురిపించాడు.
అసలు వికాస్ లొంగిపోయాడా లేక అరెస్టు అయ్యాడా అని ట్విట్టర్ వేదికగా నిన్న అఖిలేష్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. వికాస్ వ్యవహారంపై అఖిలేష్ తన ఆరోపణల దాడిని కొనసాగిస్తున్నాడు. ఎన్కౌంటర్ తీరుపై అఖిలేష్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికాస్ కారు పల్టీకొట్లేదని, ప్రభుత్వ రహస్యాలను కాపాడేందుకు ఆ కారును బోల్తా కొట్టించారని అఖిలేష్ ఆరోపించడం రాజకీయ వేడిని పుట్టించింది.