కూడు తినే వాళ్లు రాసే రాత‌లేనా రామోజీ!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో అక్క‌సుగా వున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఎందుకంటే జ‌గ‌న్‌ను వీళ్లిద్ద‌రూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా కంటే శ‌త్రువుగా చూస్తున్నారు. త‌న‌ను బాబు, ప‌వ‌న్ ఏ విధంగా చూస్తున్నారో, జ‌గ‌న్…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో అక్క‌సుగా వున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఎందుకంటే జ‌గ‌న్‌ను వీళ్లిద్ద‌రూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా కంటే శ‌త్రువుగా చూస్తున్నారు. త‌న‌ను బాబు, ప‌వ‌న్ ఏ విధంగా చూస్తున్నారో, జ‌గ‌న్ కూడా వీరి విష‌యంలో అదే వైఖ‌రితో ఉన్నారు. రాజ‌కీయాల్లో ఈ ధోర‌ణి స‌రైంది కాద‌నే అభిప్రాయం వున్న‌ప్ప‌టికీ, ఏపీలో చేయి దాటిపోయింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వైరం నెల‌కుంది.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య అవాంఛ‌నీయ సంబంధాల‌ను క‌నీసం అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి మీడియాధిప‌తుల‌కు ఏమైంది? జ‌గ‌న్‌ను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల కంటే ఎక్కువ‌గా ఎల్లో మీడియాధిప‌తులు ద్వేషిస్తున్నారు. ఆ మీడియాధిప‌తులెవ‌రూ జ‌గ‌న్ ప్ర‌తి బ‌హిరంగ స‌భ‌లోనూ చెబుతున్నారు. వాళ్లంద‌రికీ ముద్దుగా దుష్ట చ‌తుష్ట‌యం అని పేరు కూడా పెట్టారు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే… రామోజీరావు ప‌త్రిక‌లో ఇవాళ నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై క‌థ‌నం వ‌చ్చింది. ఈ క‌థ‌నం చ‌దివితే… క‌డుపుకు కూడు తిన్న వాళ్లెవ‌రైనా రాస్తారా? అనే అభిప్రాయం క‌లుగుతుంది. గ‌త ఐదేళ్ల‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ల్లే, అది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరిగిన‌ట్టు రామోజీరావు ప‌త్రిక క‌థ‌నం రాసింది. ఇంత‌కంటే సిగ్గుమాలిన‌, నీతిమాలిన జ‌ర్న‌లిజం ఏదైనా వుంటుందా? అని ఎల్లో మీడియాధిప‌తి త‌న‌కు తానుగా ప్ర‌శ్నించుకుంటే మంచిది.

తెలంగాణ‌లో దాదాపు ప‌దేళ్లుగా కేసీఆర్ పాల‌న సాగుతోంది. మ‌రి ఆ రాష్ట్రంలో క‌నీసం ఐదేళ్ల క్రితం నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లే ఉన్నాయా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ప‌ది రోజుల గ‌డువు మాత్ర‌మే వుంది. రామోజీరావుకు నిజాలు రాసే ద‌మ్ము, ధైర్యం వుంటే కేసీఆర్ అప్ర‌జాస్వామిక పాల‌న‌పై ఎన్నిక‌ల ముంగిట రాసిందేంటో చూపాలి. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరిగాయ‌న్న‌ది వాస్త‌వం.

వైసీపీ పాల‌న‌లో స‌గ‌టున 50 శాతం ధ‌ర‌ల పెరుగుద‌ల అని ప్ర‌త్యేకంగా రాయడంలోనే రామోజీరావు దుష్ట ఆలోచ‌న ప్ర‌తిబింబిస్తోంది. రామోజీరావు త‌న ప‌త్రిక‌లో రాయించిన‌ట్టుగా… 2019-23 మ‌ధ్య నిత్యావ‌స‌ర సరుకుల ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం వుంది. సామాన్యుల‌కు ఈ ధ‌ర‌లు భార‌మే. ఆదాయం పెర‌గ‌క‌పోవ‌డం, మ‌రోవైపు ఖ‌ర్చులు త‌డిసి మోపెడు అవుతుండ‌డంతో సామాన్య ప్ర‌జానీకం అల్లాడిపోతున్నారు.

ఈనాడు క‌థ‌నంతో విభేధించేది ఎక్క‌డంటే.. దేశ‌మంతా ఇదే ర‌కంగా నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరిగినా, ఆ వాస్త‌వాన్ని రాయ‌క‌పోవ‌డంతోనే. నిత్యావ‌స‌ర స‌రుకుల పెరుగుద‌ల పాపం జ‌గ‌న్ ప్ర‌భుత్వానిదే అని ఈనాడు క‌థ‌నంలో డొల్ల‌త‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019-23 మ‌ధ్య ధ‌ర‌ల వ్య‌త్యాసం గురించి ప‌ట్టిక వేసి మ‌రీ రాశారు. బాగుంది. అయితే ఇవే నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో, అలాగే క‌ర్నాట‌క , త‌మిళ‌నాడులో ఎలా వున్నాయో రాసి వుంటే బాగుండేది. అప్పుడు ఈ క‌థ‌నానికి బలం వుండేది.

అలా రాసే ఉద్దేశం రామోజీకి లేదు. ఎందుకంటే నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు దేశ‌మంతా ఇదే ర‌కంగా ఉన్నాయి. రామోజీ శిష్యుడైన చంద్ర‌బాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్‌లో ఏమైనా త‌క్కువ ధ‌ర‌ల‌కే నిత్యావ‌స‌ర స‌రుకులు ఇస్తున్నారా? జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై క‌డుపు మంట‌తో నిత్యం విష‌పు రాత‌లు రాయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న రామోజీ ప‌త్రిక‌కు మ‌తి చెడిన‌ట్టుంది.

ఎన్నిక‌ల ముంగిట ఇలాంటి విష‌పు రాత‌లు మ‌రింత‌గా పెరుగుతాయ‌నడంలో అతిశ‌యోక్తి లేదు. ఇలాంటి రాత‌లు రామోజీ క‌డుపు మంట‌ను ప్ర‌తిబింబిస్తాయో త‌ప్ప‌, మరో ర‌క‌మైన ప్ర‌యోజ‌నం వుండ‌దు. పైగా నిజాలు రాసినా విశ్వ‌సించ‌ని ప‌రిస్థితి తెచ్చుకుంటారు. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు 2019లో ఉన్న‌ట్టే, ఇప్పుడు కూడా అట్లే స్థిరంగా ఉన్న ప్రాంతాలేవో రామోజీ ప‌త్రిక రాస్తే… ఏపీ ప్ర‌జానీకం వెళ్లి తెచ్చుకుంటుంది. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఈ క‌థ‌నం చదివిన వారు వేస్తున్న ప్ర‌శ్న ఒక్క‌టే.. క‌డుపుకు కూడు తిన్న వాళ్లెవ‌రైనా ఇట్లా రాస్తారా? అని.