హీరోయిన్ల సినిమాలు, రెమ్యునరేషన్, డేటింగ్, ఇతరత్రా ఎఫైర్స్ గురించి ప్రచారమవుతున్నంతగా, వారి సేవా కార్యక్రమాల గురించి పెద్దగా చర్చ జరగదు. హీరోయిన్లంటే ఎంత సేపూ అందాల ఆరబోతగానే చూస్తాం. సినిమా అంటే గ్లామర్ బిజినెస్. అందువల్ల అభిమానులు లేదా ప్రజానీకం ఆలోచనలు, దృక్పథం కూడా వారిని వ్యాపార కోణంలోనే చూస్తారు. ఇది సహజం కూడా.
కానీ వారిలో మరో కోణం కూడా ఉంటుందని గ్రహించాలి. ప్రముఖ హీరోయిన్ కాజల్ గురించి ఎక్కువ మందికి తెలియని ఓ విషయం వెలుగు చూసింది. అసలు ఆమె జీవితంలో ఇలాంటి కోణం ఒకటి ఉందని కూడా ఎవరూ ఊహించలేం.
విశాఖపట్నం సమీపంలోని అరకు ప్రాంతంలో గిరిజనుల కోసం కాజల్ ఓ స్కూల్ నడిపిస్తున్నారు. ఈ విషయం చివరికి ఆమె అభిమానులకైనా ఎంత మందికి తెలుసు?
ఛారిటీకి సంబంధించి కాజల్ సీరియస్ కామెంట్ చేయడంతో ఇప్పుడీ చర్చ వచ్చింది. పారితోషికం విషయంలో తాను డిమాండ్ చేస్తానని ఆమె చెప్పారు. అది కూడా మంచిపాత్ర, అందులోనూ కాస్తా కష్టపడాల్సి వస్తుందనుకున్నప్పుడు సహజంగానే శ్రమకు తగ్గ ఫలితాన్ని కోరుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.
సినిమా అంటే ఛారిటీ కాదని తెగేసి చెప్పారామె. నటన అంటే అషామాషీ కాదన్నారు. ఈ సందర్భంగా ఆమె ఛారిటీ గురించి వివరాలు వెలుగు చూశాయి. రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా ఉండే కాజల్…ఆ సొమ్మును ఎక్కువగా ఛారిటీలకే ఖర్చు పెడతారని తెలిసొచ్చింది.
అరకులో గిరిజనుల కోసం స్కూల్ నడుపుతారని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోవడంతో పాటు ఆమెను అభినందిస్తున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా ఆమె అరకు వెళ్లి విద్యార్థులతో గడిపి వస్తారు. అయితే తన సేవా కార్యక్రమాల గురించి కాజల్ ఎప్పుడూ ప్రచారం చేసుకోరు. అదే ఆమె గొప్పతనం.
‘నేను ఫలానా వారి కోసం ఇది చేశా.. అది చేశా అని డబ్బా కొట్టుకోవడం నాకు నచ్చదు’ అని కాజల్ చెబుతారు. కాజల్ అందం ఆమె ముఖంలో కాదు…మనసులో ఉంది. కాజల్ మాదిరిగా పేదల కోసం మరికొందరు సినీ సెలబ్రిటీలు ముందుకొస్తే ఎంత బాగుంటుందో కదా!