ఇండ‌స్ట్రీని క‌డిగి పారేసిన‌ హీరోయిన్‌

స‌మాజంలో ఎంత మార్పు వ‌చ్చినా….మ‌హిళ‌ల విష‌యం వ‌చ్చేస‌రికి ఇంకా చిన్న‌చూపు చూడ‌డం పోవ‌డం లేదు. అయితే అన్ని అవ‌రోధాల‌ను దాటుకుంటూ త‌మ‌ను తాము నిరూపించుకుంటున్న వాళ్లు లేక‌పోలేదు. ఇక చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే…

స‌మాజంలో ఎంత మార్పు వ‌చ్చినా….మ‌హిళ‌ల విష‌యం వ‌చ్చేస‌రికి ఇంకా చిన్న‌చూపు చూడ‌డం పోవ‌డం లేదు. అయితే అన్ని అవ‌రోధాల‌ను దాటుకుంటూ త‌మ‌ను తాము నిరూపించుకుంటున్న వాళ్లు లేక‌పోలేదు. ఇక చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే హీరోయిన్ల విష‌యంలో అదే వివ‌క్ష‌. తాజాగా మ‌హిళ‌ను చూసే ధోర‌ణిపై హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ఇండ‌స్ట్రీని సుతిమెత్త‌గానే క‌డిగి పారేస్తోంది.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పెళ్ల‌య్యాక హీరోయిన్లు ఇక దేనికీ ప‌నికి రార‌నే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డంపై ఆమె భ‌గ్గుమంటున్నారు. మ‌రి పెళ్ల‌య్యిన హీరోల విష‌యంలో ఆ ర‌కంగా ఎందుకు చూడ‌ర‌ని ఆమె నిల‌దీస్తున్నారు. పెళ్ల‌య్యాక కూడా అలాంటి సీన్స్‌లో న‌టిస్తారా అని అడ‌గ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. పెళ్ల‌య్యాక హీరోయిన్ల‌కు అవ‌కాశాలు త‌గ్గ‌డం ఏంట‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ఓ చ‌ర్చ‌కు తెర లేపారు. ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌తో ఓ కీల‌క చ‌ర్చ‌కు బీజం వేశారు. వివ‌క్ష‌పై ప్ర‌శ్నించ‌డంలో ఆమె వ్యంగ్యం జోడించారు.

‘పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్‌ తగ్గుతుందా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది పది మార్కుల ప్రశ్న. దయచేసి చర్చించండి’ అంటూ పోస్ట్‌ చేశారు. ఈ ప్ర‌శ్న వేయ‌డం వెనుక  ఓ భూమిక లేక‌పోలేదు. స్వీయ అనుభ‌వం ఆమెని ఈ ప్ర‌శ్న వేయ‌డానికి ప్రేరేపించింది.  త‌న అనుభ‌వంలోకి వ‌చ్చిన విష‌యాన్నిఆమె ఆవేద‌న‌తో వెల్ల‌డించారు. అదేంటో తెలుసుకుందాం.

‘నా ఫ్రెండ్, నటి త్వరలో వివాహం చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత కూడా తను నటిస్తుందా? అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తి అడిగారు. అది కూడా చాలా నిర్లక్ష్యంగా. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాను. తను అలా అడగడం నాకు కోపం తెప్పించడంతో పాటు నన్ను ఆలోచనలో పడేసింది. వివాహం అయిన నటులు రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తున్నారు కదా? అలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు అడగరో అర్థం కాదు. ఈ విషయం గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని ఆమె అన్నారు.

శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌ ఆవేద‌నలో అర్థం ఉంది. అందుకే ఆమె పోస్ట్‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.  సోష‌ల్ మీడియాలో ఆమె లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కి, ఫాలోవ‌ర్స్‌తో పాటు ప‌లువురు నెటిజ‌న్లు ఇచ్చిన స‌మాధానాల‌ను చూస్తే…చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పురుషాహంకారంపై ఎంత ఆగ్ర‌హం ఉందో తెలుస్తుంది.

‘మీరు చెప్పింది కరెక్ట్‌. హీరోలకి ఒక న్యాయం.. హీరోయిన్లకి ఒక న్యాయమా? ఒక నటిని అలాంటి ప్రశ్నలు అడగడం కరెక్ట్‌ కాదు. పెళ్లయితే యాక్టింగ్‌ మానేయాలనో, ఫలానా సీన్స్‌లో నటించకూడదనో అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం సరికాదు. వారి ఇష్టానికి తగ్గ పాత్రలు చేసుకోవచ్చు’ అని కొంద‌రు త‌మ స్పంద‌న వెల్ల‌డించారు. ఎవ‌రూ ఒక‌రు శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌లా ప్ర‌శ్నించే వాళ్లు లేక‌పోతే న‌టీమ‌ణులు మ‌రింత న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌స్తుతం ఉన్న న‌టీమ‌ణుల‌కు కాక‌పోయినా, క‌నీసం రానున్న రోజుల్లో హీరోయిన్లు ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎదుర్కోరు. అంతేకాదు, పెళ్లి త‌ర్వాత సినిమా అవ‌కాశాలు కోల్పోవ‌డం అనే స‌మ‌స్య ఉత్ప‌న్నం కాదు. ఎందుకంటే ఒక‌ప్ప‌టితో పోల్చితే, ఇప్పుడు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఆడ‌వాళ్ల ప‌రిస్థితి ఎంతో మెరుగుప‌డింది. మార్పు అనేది ఒక రోజులో లేదా ఒక ఏడాదిలో వ‌చ్చేది కాదు. అది ఒక నిరంత‌ర ప్ర‌క్రియ‌. బాధితులు గొంతెత్తి అరిచే కొద్ది కొత్త‌కొత్త స‌మ‌స్య‌లు తెలిసి వ‌స్తుంటాయి. ఆటోమేటిక్‌గా ప‌రిష్కారాలు కూడా ల‌భిస్తాయి.

ఉదాహ‌ర‌ణ‌కు శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు క‌న్న‌డ న‌టి హితా మ‌ద్ద‌తుగా నిలిచారు. పెళ్లైన తర్వాత కూడా నటిస్తారా? అంటూ లెక్కలేనన్ని సార్లు త‌న‌ను కూడా అడిగిన‌ట్టు ఆమె త‌న అనుభ‌వాన్ని చెప్పుకొచ్చారు. గ‌త ఏడాది ఆమెకు పెళ్లైంది. తాను  పెళ్లి చేసుకుంటున్నానని తెలిశాక దర్శకులు అవకాశాలు ఇవ్వడం మానేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఇలాంటి మూస ధోరణిని విచ్ఛిన్నం చేసి, అలాంటి అర్థం లేని ప్రశ్నలకు మనం సమాధానంగా నిలబడాలంటూ స్ఫూర్తిదాయ‌క పోస్ట్‌తో శ్ర‌ద్ధాకు కొండంత అండ‌గా నిలిచారు. మ‌న్ముందు మ‌రిన్ని గ‌ళాలు శ్ర‌ద్ధాకు మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఎందుకంటే ఇది శ్ర‌ద్ధా వ్య‌క్తిగ‌త స‌మ‌స్య కాదు కాబట్టి. 

చంద్రబాబు ఆకాశం మీద ఉమ్మేస్తున్నాడు