శ్రీకాకుళం జిల్లా. పాపం అమాయకంగా ఉన్న జిల్లా, అత్యంత వెనకబాటు జిల్లా. కరోనా మహమ్మారి దేశమంతా ఉనికిని చాటుకున్నా ఆ జిల్లాకు తాకకుండా కాపాడుకున్న జిల్లా. అటువంటిది ఇపుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతోంది. అలా ఇలా కాదు, పొరుగున ఉన్న విశాఖతో పోటీ పడుతోందిపుడు. కరోనా మరణాల్లో కూడా విశాఖ, శ్రీకాకుళం దాదాపుగా సమానంగా ఉన్నాయి.
వలస బతుకుల జిల్లా అని శ్రీకాకుళానికి పేరు. అదే ఇపుడు కొంపముంచింది. ఎక్కడెక్కడో వలసలకు వెళ్ళిన కూలీలంతా సొంత జిల్లాకు చేరుకునేసరికి కేసులు ఎక్కువైపోతున్నాయి. రోజుకు 200 కేసులు నమోదు అవుతున్నాయంటే శ్రీకాకుళంలో కరోనా విలయం ఊహించడం సులువే.
ఇదిలా ఉండగా మళ్ళీ లాక్ డౌన్ దిశగా జిల్లాను ప్రకటిస్తారని అంటున్నా ఎక్కడిక్కడ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అరికట్టాలని అధికార యంత్రాంగం చూస్తోంది. సామాజికవ్యాప్తి దిశగా జిల్లా అడుగులు వేయకముందే లాక్ డౌన్ ప్రకటించాలని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి.
ఇక జిల్లా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ఇక నుంచి నా క్యాంప్ ఆఫీస్ కి ఎవరూ రావద్దంటూ గేట్లు వేసేశారు ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఫోన్, ఇతర మార్గాల ద్వారా రావాలని కోరుతున్నారు. అదే విధంగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా గేట్లు మూసేశారు. తన క్యాంప్ ఆఫీస్ ని ఆయన లాక్ చేసేశారు.
వీరికంటే ముందే సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా క్యాంప్ అఫీస్ క్లోజ్ అనేశారు. ఇక ఎంపీ రామ్మోహననాయుడు సైతం మళ్ళీ ఇంటికే పరిమితం అయ్యారు. ఇలా జిల్లాలోని రాజకీయ నాయకత్వం లాక్ డౌన్ అంటోంది. మొత్తానికి సిక్కోలు కరోనాని తెగ కలవరపెడుతోందని చెప్పకతప్పదు.