బాలికపై గ్యాంగ్ రేప్.. వెలుగులోకి మరిన్ని ట్విస్టులు

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మీర్ పేట్ ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా…

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మీర్ పేట్ ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా గవర్నర్ కూడా స్పందించడంతో, ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది

ఇంతకీ ఏం జరిగింది..

మీర్ పేట్ లో ఉంటున్న బాలిక తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక తల్లి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి పట్టించుకోకపోవడంతో, తమ్ముడితో కలిసి దగ్గర్లోనే మరో ఇంట్లోకి మారింది బాలిక. ఇంట్లో బాలిక మాత్రమే ఉంటోందని గ్రహించిన ఓ గ్యాంగ్, అర్థరాత్రి ఆ ఇంటిపై దాడిచేసింది. తమ్ముడి కళ్ల ముందే బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కత్తులతో బెదిరిస్తూ, ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

జరిగిన ఘటనపై రాచకొండ సీపీ ఆరా తీశారు. వెంటనే విచారణకు ఏర్పాటు చేశారు. బాలికను సంరక్షించిన పోలీసులు, కేసు నమోదు చేశారు. దీనిపై తెలంగాణ గవర్నర్ కూడా స్పందించారు. జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.

8 మంది కాదు, ముగ్గురు మాత్రమే..

గవర్నర్ చొరవతో ఈ కేసుకు ప్రాధాన్యం పెరిగింది. అయితే అంతలోనే మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అత్యాచారం జరిగిన టైమ్ లో 8 మంది ఉన్నట్టు ముందుగా కథనాలు వచ్చాయి. అయితే ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ మాత్రం ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు ప్రకటించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితుల్ని పట్టుకునేందుకు 7 పోలీసు బృందాల్ని ఏర్పాటుచేశామని వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించిన డీసీపీ, బాలిక ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు ప్రకటించారు.

వెలుగులోకి గంజాయి కోణం..

ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు 'గంజాయి' మలుపు తీసుకుంది. గంజాయికి బానిసైన వ్యక్తులతో పాటు, గంజాయి స్మగ్లర్లు ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాచకొండ పోలీస్ స్టేషన్ లో పరిధిలో గంజాయి గ్యాంగ్స్ ఎక్కువగా సంచరిస్తున్నాయని, తాజా ఘటన, వాళ్లు చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది.

మరోవైపు పోలీసులు తమ పని ముమ్మరం చేశారు. అనుమానితుల జాబితాతో పాటు వాళ్ల ఫొటోలు సేకరించారు. వాటిలోంచి కొందర్ని బాలిక గుర్తించింది. దీంతో పోలీసులకు గట్టి క్లూ దొరికినట్టయింది. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు.