ఏపీ బీజేపీ కోసం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ బీజేపీకి చికిత్స చేస్తారా. ఆయన సలహా సూచనలు ఏపీ బీజేపీ పాటిస్తుందా. ఈ విషయాల మీద క్లారిటీ రావాలంటే విశాఖలో ఈ…

ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ బీజేపీకి చికిత్స చేస్తారా. ఆయన సలహా సూచనలు ఏపీ బీజేపీ పాటిస్తుందా. ఈ విషయాల మీద క్లారిటీ రావాలంటే విశాఖలో ఈ నెల 23న జరిగే బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఒక రోజు ముందుగానే విశాఖ చేరుకున్నారు ఆయన బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో ఉంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఏపీ తెలంగాణాలో వాడుకోవాలని కమలం పార్టీ చూస్తోంది. రాయలసీమకు చెందిన కిరణ్ బీజేపీకి ఏమైనా పట్టు సాధించి పెడతారేమో అని కమలనాధుల ఆశ.

గతంలో కాంగ్రెస్ లో రీజాయింగ్ అయిన తరువాత విశాఖ జిల్లాకు కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి వచ్చారు. మళ్ళీ ఇపుడు ఆయన విశాఖకు బీజేపీ మనిషిగా అడుగుపెడుతున్నారు. ఏపీలో బీజేపీని ఈసారి ఏదో విధంగా కొంత ఉనికి సాధించేలా చూడాలని ఆ పార్టీ పెద్దలు తాపత్రయపడుతున్నారు. దాని కోసం సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు అన్నీ కూడా కలుపుకుంటూ ఒక రాజకీయ ప్రయోగమే చేస్తున్నారు.

కాంగ్రెస్ లో సీఎంగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు. అక్కడ ఆయన సొంతంగా పెట్టిన సమైక్యాంధ్రా పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేని నేపధ్యం ఉంది. రాజకీయాల నుంచి ఏడెనిమిదేళ్ల పాటు పక్కకు జరిగిన కిరణ్ కుమార్ రెడ్డి ఇపుడు కమలధారిగా మారి ఏపీలో ఏమైనా అద్భుతాలు చేస్తారా అన్నది బీజేపీ ఆశ. బీజేపీ వంటి జాతీయ పార్టీలో తన రాజకీయ జాతకం మార్చుకోవాలన్నది కిరణ్ కోరిక.  ఇలా ఒకరికి ఒకరు అన్నట్లుగా కలసిన కమలం, కిరణం ఏపీలో కాషాయ పార్టీని ఏ దిశకు చేరుస్తాయో.