మోదీగారు! ఓటీటీ సినిమాలు చూడరా?

ప్రధానమంత్రికి సినిమాలు చూసే తీరిక ఎక్కడుంటుంది! వాళ్లసలు చూడరంతే అనుకుంటాం.  Advertisement కానీ అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు తాను ఖాళీ సమయాల్లో హోం థియేటర్లో రాజేంద్రప్రసాద్ సినిమాలు చూస్తానని పదవిలో ఉండగానే చెప్పారు.…

ప్రధానమంత్రికి సినిమాలు చూసే తీరిక ఎక్కడుంటుంది! వాళ్లసలు చూడరంతే అనుకుంటాం. 

కానీ అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు తాను ఖాళీ సమయాల్లో హోం థియేటర్లో రాజేంద్రప్రసాద్ సినిమాలు చూస్తానని పదవిలో ఉండగానే చెప్పారు. దానికి ఎంతగానో ఆనందిస్తూ రాజేంద్రప్రసాద్ కూడా పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంటే చూడాలన్న సరదా ఉండాలే కానీ ప్రధానమంత్రులకి కూడా ఖాళీ సమయం చిక్కుతుంది. 

మరి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గారి మాటేమిటి? తన ప్రసంగాల్లో బాహుబలి గురించి, కాశ్మీర్ ఫైల్స్ గురించి, కేరళ స్టోరి గురించి ప్రస్తావించారు. అంటే ఆయనకి అస్సలు అవగాహన లేక కాదు. కానీ ఓటీటీల మాటేవిటి? దేశంలో ఎన్ని ఓటీటీ చానల్స్ ఉన్నాయి, వాటిల్లో ఎలాంటి సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయో అసలాయనకి తెలుస్తోందా? పోనీ తెలిసిన వారు ఆయన చెవిన వేస్తున్నారా? ఏమో!!

భారతదేశ సంస్కృతి, సంప్రదాయం దెబ్బతినకుండా ఉండడానికి శక్తివంతమైన బీజేపీ పరిపాలన ఉపకరిస్తోందని చెప్పొచ్చు. అయితే కేవలం శిథిల దేవాలయాల మీదనే కాకుండా కాస్తంత ఓటీటీల మీద కూడా దృష్టి సారిస్తే భారతీయత అశ్లీలం, కామపైశాచికత్వం, అసభ్యపదజాలంతో ఎలా నలిగిపోతోందో తెలుస్తుంది. 

కొన్ని సిరీసుల్లో స్త్రీపాత్రల చేత కూడా పచ్చిబూతులు మాట్లాడిస్తున్నారు. పరభాషానటీమణులకి వాళ్లకిచ్చిన సంభాషణల్లోని కొన్ని పదాలు ఎంత జుగుప్సాకరమైన అశ్లీల అర్ధంతో కూడుకుని ఉన్నాయో తెలీదు. వాళ్లు అలాగే చెప్పేస్తున్నారు. 

సంభాషణలు సరే! జంతువుల్లాగ వెనక నుంచి సంభోగం చేయడమనే దృశ్యాలు లేని వెబ్ చిత్రాలు వెతుక్కుని చూడాల్సొస్తోంది. దీనికి తోడు మితిమీరిన హోమోసెక్స్, అక్రమ సంబంధాలు, మద్యం, పొగ, మాదకద్రవ్యాల సేవనం…అన్నీ కథకు అవసరం లేకపోయినా అధికంగా ఉంటున్నాయి. 

ఏమిటీ చెత్త అని అడిగితే, అవన్నీ లేకపోతే జనం పట్టించుకోవడం లేదంటున్నారు. పట్టించుకుని ఏం చేస్తారు? చూస్తారు…చూసి స్ఫూర్తి పొందుతున్నారు…లేదా తెలియనివి తెలుసుకుని మరీ ట్రై చేస్తున్నారు. దీనివల్లన కదా క్రైం పెరిగేది? 

ఇలా అంటే వాదించడానికి చాలామంది వస్తారు, సినిమాల్లేనప్పుడు క్రైం లేదా అని! 

ఇక్కడ వాదన క్రైం ఒక్కటే కాదు..సభ్యత, సంస్కృతి…! మన సినిమాల ద్వారా మనం ప్రపంచానికి ఏం చూపిస్తున్నామో కూడా తెలుసుకోవాలి. థియేటర్లో వచ్చే సినిమాలు కొందరే చూడొచ్చు. కానీ ఓటీటీల్లో వచ్చినవి ప్రపంచమంతా చూసే అవకాశముంది. 

అసలే నిర్భయ, దిశ సంఘటనల వల్ల భారతదేశాన్ని రేప్ క్యాపిటల్ అంటూ ప్రపంచ మీడియా కోడై కూసింది. మన సినిమాలు కూడా ఆ సంఘటనల్ని ప్రతిబింబించేలా ఉంటే ఇండియా అంటే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది. 

దీనిపై భాజపా నాయకులు కన్నెర్ర చెయ్యాల్సిన అవసరం ఉంది. ఈ దరిద్రాన్ని నిలుపుచెయ్యాలి. కొన్ని రకాల దృశ్యాలు కానీ, సంభాషణలు కానీ, సబ్ టైటిల్స్ కానీ ఉంటే అవి భారతదేశంలో ప్రసారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతని ఆయా ఓటీటీ చానల్స్ కి పెట్టాలి. ఒకవేళ విస్మరిస్తే సదరు చానల్ ని దేశంలో బ్యాన్ చేసేలా చట్టపరమైన చర్యలుండాలి. 

పోర్న్ వీడియోలే విస్తృతంగా లభిస్తున్నప్పుడు ఓటీటీ సినిమాలు అడ్డొచ్చాయా అని కూడా అనొచ్చు. పోర్న్ ఛానల్స్ కి ఓటీటీలకి చాలా తేడా ఉంది. నెల నెల డబ్బు కట్టి ఓటీటీ చానల్స్ కి నట్టింట్లో ప్లే చేస్తున్నాం. కుటుంబ సమేతంగా ఆ ఛానల్స్ లో కొన్ని మంచి సినిమాలు చూస్తున్నాం. 

పోర్న్ అలా కాదు. అది నట్టింట్లో ప్రవహించే మురుగుకాలవ కాదు. దానిని పట్టుకుని వ్యక్తిగతంగా ఎవడికి వాడు ఏడ్చేది. నిజానికి తలచుకుంటే దానిపై కూడా చట్టాలు తేవొచ్చు. పోర్న్ చానల్స్ ఇండియన్ ఐపీల్లో రాకుండా నిలుపుచేయొచ్చు. 

ఇలాంటి చర్యల వల్ల భాజపా తమ వోటు బ్యాంకుని కోల్పోతుందని భయపడాల్సిన అవసరమే లేదు. నిజానికి మరింత పెరుగుతుంది కూడా. విచ్చలవిడి తనాన్ని ఏ సమాజమూ ప్రోత్సహించదు. పైగా ఓటు వేసే వయసులో ఉన్న అధిక జనాభా విచ్చలవిడితనాన్ని నిలుపు చేసే పాలననే కోరుకుంటుంది. 

శ్రీనివాసమూర్తి