ఇప్పటికే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కు క్లీన్ చిట్ వచ్చిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు మళ్లీ రీ ఓపెన్ చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కమల్ నాథ్ పై 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల పై ఏడు కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కమల్ నాథ్ ఆధ్వర్యంలో ఇద్దరు సిక్కులు చంపబడ్డారనే అభియోగాలున్నాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడుల్లో కొన్ని వేలమంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడులకు కాంగ్రెస్ పార్టీ నేతలే సారధ్యం వహించారనే అభియోగాలున్నాయి.
అలాంటి వాటిని ఎదుర్కొంటున్న వారిలో కమల్ నాథ్ కూడా ఒకరు. దశాబ్దాలుగా ఆ వ్యవహారంలో విచారణ కొనసాగింది. కొన్నాళ్ల కిందట కమల్ నాథ్ కు క్లీన్ చిట్ దక్కింది. ఢిల్లీలో అల్లరి మూకలు సిక్కులపై దాడులు చేసి చంపినప్పుడు అందులో కమల్ నాథ్ ప్రమేయానికి సరైన ఆధారాలు దొరకలేదు. అల్లరిమూకలు దాడులు చేస్తుంటే.. వారిని శాంతిపజేసేందుకు తను ప్రయత్నించినట్టుగా కమల్ నాథ్ విచారణ కమిటీకి చెప్పుకున్నారు.
ఆయన ప్రమేయంపై ఆధారాలు దొరకలేదని అప్పుడు క్లీన్ చిట్ లభించింది. అయితే ఇప్పుడు తిరిగి అవే కేసులను మళ్లీ ఓపెన్ చేసింది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం కమల్ నాథ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆయన అరెస్టు కూడా జరుగుతుందని అంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్లు. విచారణ పునఃప్రారంభం కావడం చాలా మంచిదని వారు అంటున్నారు.
కేంద్ర హోంశాఖ ఈ కేసులను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవలే చిదంబరం, ఆ తర్వాత డీకే శివకుమారలు జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో కమల్ నాథ్ ను కూడా జైలుకు పంపుతారా? అనే చర్చకు తెరతీశారు కమలనాథులు.