కేసీఆర్ కూడా ఊహించలేదా.. ఇంతలో ఇంత మార్పా!

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెలలు గడుస్తున్నా కేబినెట్ ను ఏర్పరచకపోయినా నోరెత్తిన నాథుడులేడు. ఆ సమయంలో ప్రతిపక్షం నుంచి కూడా విమర్శలు రాలేదు! తను సీఎం సీట్లో కూర్చుని.. తన సన్నిహితుడు…

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెలలు గడుస్తున్నా కేబినెట్ ను ఏర్పరచకపోయినా నోరెత్తిన నాథుడులేడు. ఆ సమయంలో ప్రతిపక్షం నుంచి కూడా విమర్శలు రాలేదు! తను సీఎం సీట్లో కూర్చుని.. తన సన్నిహితుడు ఒకరిని మంత్రిని చేసి.. ఇక మరే మంత్రీ అవసరమే లేదన్నట్టుగా అప్పుడు కేసీఆర్ రాజ్యం చలాయిస్తే.. అప్పుడు టీఆర్ఎస్ నుంచి మారు మాట్లాడేవారు లేకపోయారు. కనీసం సూచనాప్రాయంగా కూడా కేబినెట్ ఏర్పాటు చేస్తే బావుంటుదన్నట్టుగా ఎవరూ కేసీఆర్ కు బహిరంగ సలహా ఇవ్వలేకపోయారు!

కట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తి వాదులు బాహాటంగా తమ నిరసన తెలుపుతూ ఉండటం విశేషం. ఈ జాబితాలో ఒక్కొక్కరుగా జాయిన్ అవుతూ ఉన్నారు. వారిలో ముందుగా ఈటల రాజేందర్ చేరారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఓనర్ షిప్ గురించి ఆయన మాట్లాడారు. తను కూడా ఓనరే అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. అక్కడ నుంచి మంత్రివర్గ విస్తరణ పెద్ద కుదుపుగా మారింది.

కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడు అనుకున్న నాయిని నర్సింహారెడ్డే అసంతృప్తవాదిగా మారడం పెద్ద విశేషంగా మారింది. నాయినిని రాజ్యసభకు నామినేట్ చేస్తారనే ఊహాగానాలు కొన్నినెలల కిందటే వచ్చాయి. అయితే ఇప్పుడు నాయిని తనకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఆయన మాత్రమేకాదు.. మంత్రివర్గ విస్తరణతో మరికొందరు అసంతృప్తవాదులు తయారయ్యారు. కేసీఆర్ కేబినెట్లో ఒక్క మాదిగ సామాజికవర్గం నేతకు కూడా అవకాశం దక్కలేదని ఆ వర్గం వారి నుంచి వ్యక్తం అవుతూ ఉంది.

తాము కనీసం పదవులు అడిగే స్థితిలో కూడా లేకపోయినట్టుగా మాదిగ సామాజికవర్గం నేత రాజయ్య మీడియాతో వాపోయారట. ఇన్నాళ్లూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా నడిచిన కేసీఆర్ అనూహ్యంగా ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటుండటం గమనార్హం. తిరుగులేదు అనుకున్న దశలో.. ఉన్నట్టుండి ఈ స్థాయిలో అసంతృప్తులు వ్యక్తం అవుతూ ఉన్నాయి.

ఒకవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కేసీఆర్ కు సవాళ్లు విసురుతూ ఉండటంతోనే.. తెలంగాణ రాష్ట్ర సమితిలోని అసంతృప్త వాదులు కూడా ఇలా మాట్లాడగలుగుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం