ఎప్పటి చందమామ.. ఈ కాజల్! దాదాపు దశాబ్దంన్నర అవుతూ ఉంది తెరకు పరిచయం అయ్యి. ఈ క్రమంలో ఇన్నేళ్లు తెరమీద అగుపిస్తూ ఉండటమే గొప్ప సంగతి. దీంతో సహజంగానే కాజల్ అగర్వాల్ తన పారితోషకాన్ని చాలావరకూ తగ్గించుకోవాల్సి వస్తోందట. సౌత్ లో ఏజైన హీరోల సరసన ఈమెకు అవకాశాలున్నాయి. అవి భారీ బడ్జెట్ సినిమాలు కూడా కావడంతో.. కోరినంత పారితోషకం ఇట్టే లభిస్తోంది.
ఆ హీరోలకు ఛాయిస్ లేదు. దీంతో కాజల్ కు భారీ పారితోషకం ఇచ్చిమరీ తీసుకుంటున్నారు. అయితే కాజల్ కు బాలీవుడ్ లో వెలగాలని ఉంది. అక్కడ అనేక సినిమాల్లో నటించింది. అయితే.. అవేవీ ఈమెకు పేరు తీసుకురాలేదు. కొన్నేళ్ల కిందటే 'స్పెషల్ చబ్బీస్' వంటి సినిమాను చేసినా.. ఆ సినిమా హిట్ అయినా.. కాజల్ కు మాత్రం అది పేరు తీసుకురాలేదు. దీంతో బాలీవుడ్ లో ఈమె తన దండయాత్రలను కొనసాగిస్తూ ఉంది.
ఈ క్రమంలో చాలా తక్కువ పారితోషకం ఆఫర్ చేసినా ఈమె హిందీ సినిమాల్లో నటించడానికి ఉబలాటపడుతూ ఉందని టాక్. తాజాగా ఒక హిందీ సినిమాకు అయితే కేవలం ముప్పై లక్షల రూపాయల మొత్తానికే ఈమె సైన్ చేసిందట. బహుశా కాజల్ అందుకుంటున్న అతి తక్కువ పారితోషకం ఇదే కాబోలు అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. సౌత్ లో ఈమె ఇన్నాళ్లూ అరవై డెబ్బై లక్షల రూపాయలకు తక్కువ కాకుండా తీసుకొంటూ వచ్చిందని, అలాంటిది ముప్పై లక్షల రూపాయల పారితోషకానికే ఓకే చెప్పడం విశేషమని అంటున్నారు. హిట్ దక్కితేచాలనే లెక్కలతో కాజల్ పారితోషకాన్ని భారీగా తగ్గించుకున్నట్టుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.