పవన్ కల్యాణ్ ఆలోచనలు, ఆచరణలు ఎలా ఉన్నా.. ఆయన్ని ఎవరూ పల్లెత్తుమాట అనకూడదు. కనీసం సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆయన ముందు నోరెత్తకూడదు. అలా నోరెత్తి మాట్లాడాలని చూస్తే వారికి అక్కడికక్కడే క్లాస్ పీకడం పీకే స్టయిల్. అలాంటి పవన్ కల్యాణ్ ని వైసీపీ నేతలు ఆటాడేసుకుంటున్నారు. సినిమా ఇగో బాగా ఉన్న పవన్ కల్యాణ్ ని ఎవరైనా నువ్వో అభిమాన సునామీ అంటే ఒప్పుకుండాడు కానీ, నువ్వు చంద్రబాబు బినామీ అంటే ఒళ్లు మండదా.
రాజధాని విషయంలో జరిగిన రచ్చకు బొత్సను కారణం చేస్తూ గతంలో మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు కదా అని పవన్ వ్యంగ్యంగా మాట్లాడారు. దీని ఫలితమే ఇప్పుడు పవన్ పై వైసీపీ నేతలు చేస్తున్న బినామీ కామెంట్స్. తాజాగా బొత్స మీడియాతో మాట్లాడుతున్న ప్రతిచోటా పవన్ ను బాబు బినామీగానే పేర్కొంటున్నారు. దీంతో పవన్ కి ఒళ్లు మండింది. అందుకే ఏకంగా బినామీ కామెంట్స్ పై ఓ ప్రెస్ నోట్ (ఇది పవన్ కు అత్యంత సాధారణమైన విషయం) విడుదల చేసి మరీ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా తాను విమర్శించానని, అప్పుడు జగన్ పాదయాత్రల్లో ఉన్నారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ సమస్యలను పట్టించుకోవట్లేదని అన్నారు పవన్. తాను చంద్రబాబు బినామీ అయితే జగన్ ఎవరి బినామీయో చెప్పాలని ప్రశ్నించారు. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా, లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోకుండా ఉన్న ఒకే ఒక్క పార్టీ వైసీపీ.
అలాంటి వైసీపీ అధినేత జగన్ ను బినామీ అనడం పవన్ కే సాధ్యమైంది. ఇక పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం చూసుకుంటే అన్నిచోట్లా ఆయన బినామీయే. ప్రజారాజ్యం దగ్గర్నుంచి జనసేన వరకు ఏ పార్టీ చూసినా, ఏ పోటీ చూసినా పొత్తులు, విలీనాలు, లాలూచీలు, మోకరిల్లడాలు. సో.. నిజం చెబితే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు పవన్ కు కూడా కోపం వచ్చింది.