అజ్ఞాన‌మే ఆయ‌న‌కు శ‌త్రువైన వేళ‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు శ‌త్రువులు అవ‌స‌రం లేదు. ఎందుకంటే అజ్ఞాన‌మే ఆయ‌న‌కు నిజ‌మైన శ‌త్రువు. రాజ‌కీయాలంటే త‌మ‌కిష్టం వ‌చ్చిన‌ట్టు న‌డ‌వ‌డానికి వీలు కాదు. ప్ర‌త్య‌ర్థుల వ్యూహాలను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ, ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తుగ‌డ‌లు వేస్తూ పోవాలి.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు శ‌త్రువులు అవ‌స‌రం లేదు. ఎందుకంటే అజ్ఞాన‌మే ఆయ‌న‌కు నిజ‌మైన శ‌త్రువు. రాజ‌కీయాలంటే త‌మ‌కిష్టం వ‌చ్చిన‌ట్టు న‌డ‌వ‌డానికి వీలు కాదు. ప్ర‌త్య‌ర్థుల వ్యూహాలను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ, ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తుగ‌డ‌లు వేస్తూ పోవాలి. కానీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ధోర‌ణి ఇందుకు విరుద్ధం. ఎప్పుడెవ‌రిని టార్గెట్ చేస్తారే ఆయ‌న‌కే తెలియ‌దు.

బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే, జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపుతాన‌ని ఆయ‌న కొన్ని నెల‌లుగా అంటున్నారు. ప్ర‌ధాని మోదీతో ఎట్ట‌కేల‌కు ఆయ‌న భేటీ అయ్యారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల త‌ర్వాత రోడ్ మ్యాప్ ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గుజ‌రాత్ ఎన్నిక‌లు, వాటి ఫ‌లితాల ప్ర‌క్రియ అంతా వ‌చ్చే నెల‌లో ముగియ‌నుంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ, జన‌సేన నేత‌ల్ని ఢిల్లీకి పిలిపించి ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డంపై దిశానిర్దేశం చేస్తార‌ని ఆ రెండు పార్టీల నేత‌లు అంటున్నారు.

మ‌రి ఇంత కాలం కేవ‌లం జ‌గ‌న్‌ను ఒక్క‌డినే టార్గెట్ చేస్తూ….ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ప్ర‌చారం మాటేంటి? టీడీపీని క‌నీసం ఒక్క విమ‌ర్శ చేసిన దాఖ‌లాలు లేవు. ఈ నేప‌థ్యంలో బీజేపీ-జ‌న‌సేన కూట‌మిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిస్తే… ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక వైపు బీజేపీ మాత్రం కుటుంబ‌, అవినీతి పార్టీలంటూ వైసీపీ, టీడీపీల‌ను ఒకే ర‌కంగా జ‌మ క‌ట్టి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తుంది.

జ‌న‌సేనాని జ‌గ‌న్‌ను మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం వ‌ల్ల కూట‌మికి న‌ష్ట‌మే త‌ప్ప లాభం వుండ‌దు. త‌న‌కు తానుగా జ‌గ‌న్ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చ‌నంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓవ‌రాక్ష‌న్ చేసి, అన‌వ‌స‌రంగా కొత్త స‌మ‌స్య‌ను సృష్టించుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌కీయాల్లో ఎలా వుండ‌కూడ‌దో ప‌వ‌న్‌కు ఆయ‌న అనుభ‌వాలే గుణ‌పాఠాలు నేర్పుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

టీడీపీ, వైసీపీల‌కు స‌మాన దూరంలో బీజేపీ మాదిరిగా ప‌వ‌న్ కూడా వుండి వుంటే… ఈ రోజు ఆయ‌న ప‌ర‌ప‌తి పెరిగేది. బీజేపీ అగ్ర‌నేత‌ల వ‌ద్ద కూడా ప‌వ‌న్‌కు ప‌లుకుబ‌డి వుండేది. కానీ ప‌వ‌న్ బీజేపీతో పొత్తులో వుంటూ, ఏక‌ప‌క్ష రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్లే స‌మ‌స్య వ‌చ్చింద‌ని అంటున్నారు. బీజేపీ రోడ్ మ్యాప్‌న‌కు అనుగుణంగా ప‌వ‌న్ ఎంత వ‌ర‌కూ ప‌ని చేస్తారో చూడాలి.