వీర్రాజు ప‌రువు తీసిన బీజేపీ!

సోము వీర్రాజును సొంత పార్టీ నేత‌లే టార్గెట్ చేశారు. బీజేపీకి టీడీపీ చేరువ కాకుండా అడ్డుకుంటున్నార‌నే ఆగ్ర‌హంతో ఆయ‌న ప‌రువు తీయడానికి కూడా వెనుకాడ‌డం లేదు. తాజాగా సోము వీర్రాజును ప్ర‌ధాని మోదీ గుర్తించ‌లేద‌ని,…

సోము వీర్రాజును సొంత పార్టీ నేత‌లే టార్గెట్ చేశారు. బీజేపీకి టీడీపీ చేరువ కాకుండా అడ్డుకుంటున్నార‌నే ఆగ్ర‌హంతో ఆయ‌న ప‌రువు తీయడానికి కూడా వెనుకాడ‌డం లేదు. తాజాగా సోము వీర్రాజును ప్ర‌ధాని మోదీ గుర్తించ‌లేద‌ని, మీ పేరేంట‌ని ప్ర‌శ్నించార‌ని వ్యంగ్య క‌థ‌నం ఎల్లో ప‌త్రిక‌లో రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ క‌థ‌నం వెనుక బీజేపీలోని చంద్ర‌బాబు మ‌నుషుల హ‌స్తం వుంద‌నే అనుమానం, ఆగ్ర‌హం సోము వీర్రాజు వ‌ర్గీయుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

విశాఖ‌లో శుక్ర‌వారం రాత్రి ప్ర‌ధాని మోదీతో బీజేపీ కోర్ క‌మిటీ భేటీ అయ్యింది. ప‌లువురు నేత‌ల్ని మోదీ ప‌ల‌క‌రించార‌ని, కానీ వీర్రాజు ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి ‘ఆప్‌కా నామ్‌ క్యాహై’ అని ప్ర‌శ్నించారంటూ రాసుకొచ్చారు. దీంతో ప్ర‌ధానికి రాష్ట్ర అధ్య‌క్షుడి పేరు తెలియ‌దా? అని కోర్ క‌మిటీ స‌భ్యులు అవాక్క‌య్యార‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ఇదే నిజ‌మైతే బీజేపీ అధిష్టానం సిగ్గుతో త‌ల‌దించుకోవాలి.

వీర్రాజు రాజ‌కీయ ప్ర‌స్థానం ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత ఆయ‌న‌ బీజేపీలోకి వెళ్లారు. సుదీర్ఘ‌కాలంగా బీజేపీకి సేవ‌లందిస్తున్నారు. అధికారంతో సంబంధం లేకుండా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీ వాయిస్‌ని వినిపిస్తున్నారు. అయితే వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ స్వార్థంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి సోము వీర్రాజు వ్య‌వ‌హార‌శైలి కంట‌గింపుగా త‌యారైంది. బీజేపీకి చంద్ర‌బాబును చేరువ చేయాల‌నే ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి.

కుటుంబ‌, అవినీతి పార్టీల‌కు దూర‌మంటూ వీర్రాజు ప‌దేప‌దే చెబుతున్నారు. జ‌న‌సేన‌తో త‌ప్ప మ‌రెవ‌రితోనూ పొత్తు ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌డం బీజేపీలోని టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. రెండు రోజుల క్రితం రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ మీడియాతో మాట్లాడుతూ పొత్తుల‌పై కేంద్ర పార్టీ నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. అంతే త‌ప్ప‌, రాష్ట్ర స్థాయిలో నాయ‌కులు మాట్లాడే మాట‌ల్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ప‌రోక్షంగా వీర్రాజును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయ‌కులే వీర్రాజుకు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు న‌డుపుతున్నార‌ని మొద‌టి నుంచి ఆ పార్టీలో వుంటున్న నేత‌లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఇటీవ‌ల క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నారు. వీర్రాజుపై మొద‌టి నుంచి ఆ ఎల్లో ప‌త్రిక దుష్ప్ర‌చార వార్త‌లు రాస్తోంద‌ని సోము వ‌ర్గీయులు చెబుతున్నారు. త్వ‌ర‌లో వీర్రాజును అధ్య‌క్షుడిగా తొల‌గిస్తార‌ని రాసిన క‌థ‌నాన్ని ఉద‌హ‌రిస్తున్నారు.

ఇప్పుడు కూడా అలాంటి క‌థ‌న‌మే రాశార‌నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కోర్ క‌మిటీ భేటీలో పాల్గొన్న బీజేపీ ముసుగులోని టీడీపీ నేత‌లే వీర్రాజు టార్గెట్‌గా క‌థ‌నం రాయించార‌ని చెబుతున్నారు. ఎందుకంటే మీడియాను అనుమ‌తించ లేద‌ని, అలాంట‌ప్పుడు అక్క‌డేం జ‌రిగిందో ఇత‌రుల‌కు తెలిసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీలో టీడీపీ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల విభేదాలు పార్టీ అధ్య‌క్షుడి ప‌రువు తీస్తున్నాయ‌నే ఆవేద‌న శ్రేణుల్లో వుంది. ఈ విభేదాలు ఇట్లే కొన‌సాగితే మాత్రం రానున్న రోజుల్లో బీజేపీ మ‌రింత ప‌త‌నం కాక త‌ప్ప‌దు.