జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తను కుల రాజకీయాలు చేయనంటూ పదే పదే చెబుతూ ఉంటారు. తనకు కులం లేదని ఒక సారి, తను కాపునని మరోసారి, తను రెళ్లినని ఇంకోసారి పవన్ కల్యాణ్ రకరకాలుగా చెప్పుకున్నారు! అంతే కాదు.. కాపుల అవసరం తనకు లేదని గతంలో బాహాటంగా ప్రకటించారు. తన రాజకీయం గురించి మాట్లాడటానికి కాపులు ఎవరంటూ కూడా ప్రశ్నించారు! అయితే పైకి అలా చెప్పినా.. తన పోటీ వరకూ వచ్చే సరికి, తన రాజకీయం వరకూ వచ్చే సరికి పవన్ కల్యాణ్ కు కాపుల ఓట్ల లెక్కలే కీలకం అయ్యాయి.
గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ కాపుల ఓట్లు అత్యధికం. అలాంటి నియోజకవర్గాలను ఏరికోరి మరీ పోటీ చేసుకున్నారు పవన్ కల్యాణ్. అయితే అన్ని లెక్కలేసుకున్నా ప్రయోజనం అయితే దక్కలేదు. పోటీ చేసిన రెండు చోట్లలోనూ ఓడి పరువు పోగొట్టుకున్నారు పవన్ కల్యాణ్. ఇక ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్ కులం గురించి మరింత ఓపెనప్ అయిపోయారు. కాపుల ఓట్లను గంపగుత్తగా పొందాలనే ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ కుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. మరి ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ ఇంకా ఏమేం మాట్లాడతారో, కులం గురించి ఇంకా ఎంత స్థాయిలో స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఇక పవన్ కల్యాణ్ పర్యటనలు కూడా సాధారణంగా కుల జనసంఖ్యల ఆధారంగానే జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి రాయలసీమ వరకూ వస్తే పవన్ కల్యాణ్ కచ్చితంగా అక్కడ బలిజల జనాభా బాగా ఉండే చోటునే చూసుకుంటారు. ఒక మండల కేంద్రానికి వచ్చినా, ఒక నియోజకవర్గ కేంద్రానికి వచ్చినా అక్కడ కచ్చితంగా బలిజల జనాభా గణనీయంగా ఉంటుంది. ఇలా పవన్ వేసే ప్రతి అడుగులోనూ కులముద్ర గట్టిగా ఉంటుంది! బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇంతలా అడుగు తీసి అడుగు వేసే ప్రతి సారీ కులం గురించి ఆలోచించి స్పందించే నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమే కాబోలు!
ఏపీలో రాజకీయ పార్టీలన్నింటికీ కుల ముద్రలైతే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో కమ్మల ఆధిపత్యం, కాంగ్రెస్ లో రెడ్ల ఆధిపత్యం ఉండేది. రెడ్లు క్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే వాటి అధినేతలు మాత్రం డైరెక్టుగా తమ కులం గురించి స్ట్రెస్ చేసి మాట్లాడరు. తమ కులంలో వారికి ఎంత పట్టున్నా.. దాన్ని పట్టనట్టుగా, పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం మాంసం తినేవాడు బొమికలు వేసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు అదే తేడా. తన రాజకీయం సగటు ఓటరును ఆకట్టుకోవడం ఎలా ఉన్నా.. కాపులను ఆకట్టుకుంటే చాలు, కాపుల ఓట్లు పడితే చాలు.. అనే లెక్కలే పవన్ వేస్తుంటారు కాబోలు! మరి ఒక కులం ఓట్లను టార్గెట్ గా పెట్టుకుని రాజకీయం చేస్తే మాత్రం ఎప్పటికీ పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవచ్చు.
వాస్తవానికి కాపుల ఓట్లను మొదటి సారి గట్టిగా టార్గెట్ చేసింది చిరంజీవే. ప్రజారాజ్యం పార్టీతో కాపుల ఓట్లను గంపగుత్తగా పొందే ప్రయత్నం చేశారు చిరంజీవి. అయితే అలాగని ఎక్కడా పవన్ కల్యాణ్ లా మాట్లాడలేదు చిరంజీవి. రాయలసీమ వరకూ వచ్చేసరికి తన పార్టీలో రెడ్లను బాగా చేర్చుకున్నారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బోలెడన్ని నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం తరఫున రెడ్లే పోటీ చేశారు! ఇవే జిల్లాల్లో.. బలిజలకు ప్రాధాన్యతను ఇచ్చిన చిరంజీవి, అదే సమయంలో వేరే కులాలకూ ప్రాధాన్యతను ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో కూడా ప్రజారాజ్యం తరఫున రెడ్లు చాలా మంది బరిలోకి దిగారు!
ఇలా గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రజారాజ్యం తరఫున గెలిచిన వారెవరైనా ఉన్నా, మంచి స్థాయిలో పోటీ ఇచ్చి మెరుగైన ఓట్ల శాతం పొందిన వారెవరైనా ఉన్నా వారు రెడ్లే ఎక్కువ! ప్రజారాజ్యం తరఫు నుంచి గ్రేటర్ రాయలసీమలో కనీసం డిపాజిట్ తెచ్చుకున్న వారిలో మెజారిటీ మంది రెడ్లే ఉంటారు! అలాగే ప్రజారాజ్యం తరఫున బీసీలకు కూడా సీమలో బాగానే టికెట్లు కేటాయించారు. చిరంజీవి చెప్పిన సామాజిక న్యాయం అనే పదానికి అర్థం దొరకనప్పటికీ.. టికెట్ల కేటాయింపు వరకూ అయితే కొంత వరకూ బ్యాలెన్స్ జరిగింది.
పవన్ కల్యాణ్ రాజకీయ స్థాయిని కనీసం చిరంజీవితో పోల్చడం కూడా తగిన పని కాకపోవచ్చు! చిరంజీవి స్థాయి పరిణతి కూడా ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ సాధించలేదు. దీంతో ఈయన పార్టీలోకి చేరికలు కూడా లేవు!
ఇక పవన్ కల్యాణ్ టార్గెట్ కూడా స్పష్టం అవుతోంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కల్యాణ్ పూర్తిగా వైఎస్ జగన్ నే టార్గెట్ గా చేసుకున్నారు. మరి జగన్ తో పవన్ కు పాత గొడవలేమున్నాయి. ఎందుకున్నాయి.. అనేది ఎవరికీ అర్థం అయ్యే సంగతేమీ కాదు! అంతకు మించిన ఆశ్చర్యం.. చంద్రబాబు పట్ల పవన్ కల్యాణ్ కు ఉన్న అచంచలమైన విశ్వాసం! ఆది నుంచి చంద్రబాబును భుజనా మోయడానికి పవన్ కల్యాణ్ అతిగా ఆరాటపడుతూ ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో తనెంత అభాసుపాలవుతున్నా, ఎన్ని విమర్శలకు ఆస్కారం ఇస్తున్నా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ పవన్ కల్యాణ్ లెక్క చేయడం లేదు. దీనికి కారణం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ప్యాకేజీ ఇస్తుంటారని, అందుకు ప్రతిఫలంగా పవన్ కల్యాణ్ ఇలా చేస్తూ ఉంటారనే రూమర్లు, అభిప్రాయాలు ఉన్నాయి. వీటి లోగొట్టు పెరుమాళ్లకెరుక!
ఇటీవల పవన్ కల్యాణ్ వీకెండ్ రాజకీయం మొదలుపెట్టే తరుణంలో కూడా ఆయన అమెరికా పర్యటన పెట్టుకున్నారని, జనసేన అమెరికా వింగ్ కు కూడా తెలియకుండా పవన్ కల్యాణ్ తెలుగుదేశం సామాజికవర్గ ఎన్ఆర్ఐలతో సమావేశం అయ్యారనే ప్రచారం కూడా ఉంది! ఈ సంగతంతా ఏమో కానీ… పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న కుల సమీకరణాలు, ఆయన చంద్రబాబును అతిగా భుజానికి ఎత్తుకుంటున్న తీరు.. సీమలో ఒకప్పుడు సినిమాల పరంగా, రాజకీయంగా చిరంజీవి సమర్థించిన వారు ఆశ్చర్యపోయే పరిస్థితి మాత్రం ఉంది. ఇది ఇప్పటి సంగతి కాదు. తొలి సారి పవన్ కల్యాణ్ జనసేన అంటూ మీటింగ్ పెట్టి.. చంద్రబాబుకు జై కొట్టినప్పుడే వీరు ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
రాయలసీమలో కుల స్పృహ మరీ అధికమైన స్థాయిలో ఎప్పుడూ ఉండదు. అలాగనికి ఎవరికీ కులం అంతే తెలియదని అనడం లేదు. కుల విభజన స్పష్టంగానే ఉంటుంది. అయితే కుల పిచ్చి మాత్రం తీవ్ర స్థాయిలో ఉండదు. కులాలు వేరైనా.. వరసలు పెట్టుకుని పిలుచుకునే సంప్రదాయం సీమలో ఆది నుంచి ఉంది. వేరే కులస్తులు కాబట్టి.. వారితో వరస పెట్టి పిలుచుకోవడానికి ఏమీ ఉండదని వేరే ప్రాంతాల వారు అనుకుంటారు. అయితే సీమలో మాత్రం.. కులాలకు అతీతంగా వరసలుంటాయి గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా! ఇలాంటి సఖ్యత ఉంది. తమ కులా తక్కువ కులం అనుకునే వారిని కూడా ఒక వరస పెట్టి పిలుస్తూ.. గౌరవించే సంప్రదాయం ఉందిక్కడ. అన్న, చిన్నాన్న, పెద్దయ్య, మామ, అక్క, వదిన, పెద్దమ్మ, పిన్నమ్మ.. ఇలాంటి వరసలు చాలా సహజమిక్కడ. వీటికి కులాలతో నిమిత్తం లేదు.
అయితే.. సినిమాలు, రాజకీయం వంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు కులం కూడా చర్చకు వస్తుంది! చిరంజీవిది ఏ కులం, చంద్రబాబుది ఏ కులం, జగన్ .. రెడ్డి, పవన్ కల్యాణ్ బలిజ.. ఇలాంటి చర్చలు ఆది నుంచి ఉన్నవే. ఈ చర్చతో ముడిపడిన అభిమానాలు, ఆక్రోశాలు కూడా ఉంటాయి.
కమ్మ, రెడ్డి పిల్లలు.. స్నేహితులుగా ఉండగలరు. స్కూల్లోనూ, కాలేజీలోనూ ప్రాణప్రదంగా పెరగగలరు. అయితే రాజకీయంగా ఇద్దరి అభిప్రాయాలూ ఒకలా ఉండవు. ఇక్కడి వరకూ వచ్చేసరికి ఎవరి వాదన వారిది. అయితే ఈ వాదనలు ఎడతెగవు!
అయితే రాయలసీమకే సంబంధించి ఇలాంటి రాజకీయ, సినీ అభిమానాల విషయానికి వస్తే… సీమలో ఈ విభజన స్పష్టమైనదే. సీమలో ఆది నుంచి రెడ్లు రాజకీయం ఆధిపత్య స్థాయిలో ఉన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావం దగ్గర నుంచినే రాజకీయంగా రెడ్లు యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. స్వతంత్రం తర్వాత ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల మద్దతుతో రాజకీయంగా యాక్టివ్ గా ఉండటమే కాకుండా, ఎంపీ-ఎమ్మెల్యే పదవులను కూడా గరిష్టంగా పొందారు. ఆ ఆధిపత్యం 75 యేళ్లు గడిచినా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ రాయలసీమలో ఉన్న 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు రెడ్లే ఉన్నారు! రాజకీయంగా కొందరు కంచుకోటలను తయారు చేసుకున్నారు. రెడ్ల రాజకీయ అభిమానం మొదట్లో సాలిడ్ గా కాంగ్రెస్ కు ఉండేది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కూడా వీరు ఏ మాత్రం మారలేదు. కాంగ్రెస్ పతనంలో కూడా రాయలసీమ రెడ్లే కీలక పాత్ర పోషించారు. 1990 తర్వాత కాంగ్రెస్ నిలిచినా, 2014తో పతనం అయిపోయినా.. రాయలసీమ రెడ్లే కీలక పాత్ర పోషించారు.
ఇక సినీ అభిమానం విషయానికి వస్తే.. రెడ్లు కళాపోషకులు. టాలీవుడ్ తరఫున ఆదిలో సినిమాలు తీసిందంతా రాయలసీమ, నెల్లూరు జిల్లాల రెడ్లే ప్రధానంగా. ఇప్పటి స్టార్ల కుటుంబాలకు నెల జీతాలు ఇచ్చింది సీమ రెడ్లే. దర్శకులుగా కూడా సత్తా చూపించారు. కళాఖండాలను సృజించారు. కాల క్రమంలో రెడ్డు సినీ పరిశ్రమకు దూరం అయ్యారు. అయితే అభిమానం విషయంలో మాత్రం వారు తగ్గలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో వర్గాలు లేకపోవచ్చు కానీ, తెలుగుదేశం ఆవిర్భావంతో మాత్రం రెడ్ల సినీ అభిమానం కూడా చాలా వరకూ మారింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకం. దీంతో కాంగ్రెస్ అనుకూల హీరోల పట్ల రెడ్ల సినీ అభిమానం కొంత ముడిపడింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణను బాగా అభిమానించే వర్గాలు 1990 ల నాటికి బలపడ్డాయి. అయితే చిరంజీవికి మాత్రం మొదటి నుంచి ఫ్యాన్ బలగం తక్కువ!
రాయలసీమలో బాలకృష్ణకే ఫ్యాన్ బలగం ఎక్కువ! ప్రధానంగా బీసీ వర్గాలు సినీపరంగా బాలకృష్ణను అభిమానించడం మొదలైంది 80లలోనే! ఎన్టీఆర్ పై బీసీ వర్గాల్లో మొదలైన రాజకీయ ప్రేమ అదే సమయంలో బాలకృష్ణ సినిమాలపై మళ్లింది. ఇలా బాలకృష్ణకు సీమలో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక కమ్మ వాళ్ల ఆరాధ్యదైవం ఎలాగూ ఎన్టీఆరే. ఆపై బాలకృష్ణే. విశేషం ఏమిటంటే.. రాయలసీమలో బలిజలు కూడా సినిమాల పరంగా బాగా అభిమానించింది బాలకృష్ణనే! మరి ఇంతకీ సీమ ఏరియాస్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్ ల అభిమానులు ఎవరయ్యా.. అంటే ప్రధానంగా రెడ్లే! సినీ అభిమానాలను రాజకీయం ప్రభావితం చేయడమో మరేమో కానీ.. 2009 వరకూ ఈ రచ్చబండ మీదో సినిమాల గురించి పిచ్చాపాటి చర్చ వచ్చినా, యువకుల్లో సినిమా హీరోల స్టామినాల గురించి మాట్లాడుకున్నా.. చిరంజీవి తరఫునో, పవన్ కల్యాణ్ తరఫునో గట్టిగా మాట్లాడే వారు రెడ్డి సినీ అభిమానులే! సినీ అభిమానాలకూ, కులాలకూ సంబంధం ఏమిటి? అనొద్దు! ఇలాంటి ఏపీలో లేదనుకోవడం భ్రమే.
ఇలా సీమలో సినీ అభిమానాలను కులాల వారీగా చూసుకుంటే బీసీలు, బలిజలు, కమ్మ వాళ్లు బాలకృష్ణకు కలలో కూడా జై కొట్టే పరిస్థితి. అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్ ను అభిమానించి, టికెట్ల క్యూలో కూడా ముందు వరసలో నిలిచింది రెడ్డి సినీ వీరాభిమానులు! అయితే 2009 వచ్చే సరికి పరిస్థితి మారింది.
అంత వరకూ చిరంజీవిని తమ వాడిగా పూర్తిగా గుర్తించడానికి ఇష్టపడని బలిజల్లో మార్పు వచ్చిన తరుణం అది. 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత బలిజల్లో చెప్పుకోదగిన మార్పు వచ్చింది. అయితే రాజకీయంగా వారు అప్పటికే తెలుగుదేశం పార్టీకి అంకితం అయిపోయారు. 2009 ఎన్నికల్లో కూడా చిరంజీవికి గట్టి మద్దతుగా నిలిచిన బలిజ శాతం సగం కూడా లేదు. ప్రజారాజ్యం వచ్చినా వారు తెలుగుదేశం పై అభిమానాన్ని చంపుకోలేదు. అయితే జనసేన వరకూ వచ్చే సరికి మార్పు మరింత పెరిగింది. బాలకృష్ణ తరఫున ఒక రేంజ్ లో చొక్కాలు చించుకున్న బలిజలు 2014 తర్వాత పవన్ కల్యాణ్ ను పూర్తిగా ఓన్ చేసుకోవడం మొదలైంది. అయితే ఇది కూడా పూర్తిగా రాజకీయంగా కాదు. సినీ అభిమానం వరకూ ఇప్పుడు వారి పూర్తి రైట్స్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి.. ఇలానే ఉన్నాయి. ఆఖరికి చిరంజీవి మేనల్లుళ్లు, దూరపు బంధువులను కూడా వీరు సినిమాల పరంగా బాగా అభిమానిస్తున్నారు. అయితే.. రాజకీయంగా మాత్రం ఇప్పటికీ బలిజల ఓట్లు సాలిడ్ గా జనసేనకు పడే అవకాశాలు లేవు.
ఇక సీమ కమ్మవాళ్లు మొదటి నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు వ్యతిరేకం! వీరిని బాగా ట్రోల్ చేసేది వీళ్లే ఇప్పటికీ! సినిమాల విషయంలో ఎన్టీఆర్, బాలకృష్ణ స్థాయికి చిరంజీవి, పవన్ కల్యాణ్ తగరనేది వీరి నిశ్చితాభిప్రాయం! రాజకీయంగా పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు గా నిలుస్తున్నారు. చంద్రబాబునో, ఆయన కొడుకునో సీఎంగా చేయడానికి తెగ తపిస్తున్నారు. అయితే రాయలసీమ కమ్మవాళ్లు మాత్రం ఇప్పటికీ పవన్ కల్యాణ్ ను ఏ మాత్రం ఇష్టపడరు. ఇప్పటికీ ట్రోల్ చేయడంలో వీరు ముందు వరసలోఉంటారు!
సీమలో మూడు నాలుగు శాతం జనాభా ఉన్న కమ్మ వాళ్లు రాజకీయంగా మొదట్లో కాంగ్రెస్, ఎన్టీఆర్ పార్టీ పెట్టాకా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అంకితం అయిపోయారు. రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే కమ్మ వాళ్ల జనాభా చెప్పుకోదగిన స్థాయిలో అయినా ఉంటుంది. వారి జనాభా స్థాయికి మించి రాజకీయంగా చాలా పట్టు సంపాదించారు. అయితే సీమలో కమ్మ వాళ్లు మెజారిటీ మంది మాత్రం ఇప్పటికీ జై తెలుగుదేశం, జై బాలయ్య అనే అంటారు! సినిమాల విషయంలో అయినా, రాజకీయంగా అయినా చిరంజీవి, పవన్ లు తమ హీరోలకు పోటీ కాదని వీరు గట్టిగా వాదిస్తారు.
మరి దశాబ్దాలుగా ఇలాంటి రాజకీయ, సినీ అభిమానాలు ఉన్న సీమలో.. పవన్ కల్యాణ్ తీరు విస్తుగొలుపుతూ ఉంటుంది సగటు జనాలకు! తనను అమితంగా ద్వేషించే వాళ్లకు పవన్ కల్యాణ్ ఎందుకు మద్దతు పలుకుతూ ఉంటారు, వారి పల్లకిని మోసే బోయ ఎందుకు అవుతుంటాడో అంతుబట్టని విషయం. పవన్ కల్యాణ్ రాజకీయం గురించి 2014 నుంచి ఉన్న చర్చ ఇదే. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ ప్రస్తావన చర్చ వరకే. ఎన్నికల బ్యాలెట్ వరకూ మాత్రం ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఆలోచన సీమలో చేర లేదు!