ఆకుపచ్చ తలపాగా చుట్టుకుని కొలికపూడి అనే ప్రొఫెసర్ కేవలం తెదేపా అనుకూల మీడియాగా ముద్రపడిన చానల్స్ లో చర్చల్లో కనిపిస్తుంటాడు. పలు చర్చల్లోని ఆయన మాటలను బట్టి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలన్నదే ఆయన కోరికని తెలుస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆయనకు తోచింది ఆయన చెబుతూ ఉంటాడు. ఎవరి అభిప్రాయం వారిది, తప్పులేదు.
అయితే ఈ రోజు ఆ పచ్చ చానల్లోనే కూర్చుని ఒక జ్ఞానగుళిక వదిలాడు. కనీసం ఆ గుళికని మింగినా పచ్చమీడియాకి, తెదేపా అధిష్టానానికి కళ్లు తెరుచుకుంటాయి.
కొలికిపూడి మాటల్లో- “చంద్రబాబు వెళ్లి పవన్ ని కలిసారు. పవన్ వెళ్లి మోదీని కలిసారు. మళ్లీ ఆ మోది వచ్చి జగన్ ని కలిసారు. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేదా నాకు అర్ధమయ్యేది ఏమిటంటే జగన్ మోహన్ రెడ్డి పాలనకి బీజేపీ మద్దతుంది. ఆ బీజేపీని పవన్ కళ్యాణ్ వదలలేకపోతున్నాడు. అలాంటి పవన్ ని పట్టుకుని బాబుగారి తెదేపా ఏదో మార్పు సాధిస్తామనే భ్రమలో ఉంది……జగన్ మోహన్ రెడ్డి ఏ మీడియానైతే తెదేపా అనుకూల మీడియా అని ముద్ర వేసాడో అదే మీడియా తెదేపాకి, చంద్రబాబుకి నష్టం కలిగే విధంగా పవన్ కళ్యాణ్ కి విపరీతంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. మనమందరం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆటలో పావులమైనందుకు బాధగా ఉంది”.
ఇదంతా విన్న యాంకర్, “మీరు ఎవర్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నారో ప్రొఫెసర్. మాకు ఆపాదించద్దు” అని భుజాలు తడుముకున్నాడు.
ఇంత పబ్లిక్ గా ఆ యాంకర్ తాము చంద్రబాబు అనుకూలమీడియా అని ఒప్పుకున్నట్టయ్యింది.
ఇదంతా పెద్ద ప్రహసనంలా ఉంది కానీ నిజానికి కొలికిపూడి చెప్పిందాంట్లో విషయముంది. చంద్రబాబుకి పవన్ అవసరం లేదు. పవన్ కే చంద్రబాబు అవసరం ఎలా చూసుకున్నా కూడా.
ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి… పవన్ కి చంద్రబాబు మద్దతు లేకపోతే ఎమౌతుందో. పచ్చమీడియా పవన్ కి కవరేజ్ ఇవ్వదు. అతను ఇప్పటం వెళ్లినా, కారు టాపెక్కి స్వైరవిహారం చేసినా, వైజాగ్ బీచులో సీను చేసినా, నోవోటెల్ హోటల్లోంచి సజెషన్లో చెయ్యూపినా ఏదీ జనానికి తెలిసేది కాదు.
పవన్ కి సొంత మీడియా లేదు. ఇతనొకడు ఉన్నాడని జనానికి తెలియాలంటే ఏదో ఒక మీడియా తనని పట్టించుకోవాలి. సాక్షి ఎలాగో పట్టించుకోదు. ఉన్నదల్లా పచ్చ మీడియా. అదీ చెయ్యొదిలేస్తే పవన్ కి రాజకీయ “లబ్ధి” ఉండదు. అందుకే లేని పవర్ ని చూపించుకుంటూ, తనను తాను నిత్యం అర్పించుకుంటూ చంద్రబాబుకి విధేయుడిగా కట్టుబానిసగా ఉంటున్నాడు పవన్.
కొలికిపూడి పచ్చ మీడియాకి చెప్పినదాంట్లో సారాంశమేమిటంటే ఊరికే పవన్ ని లేపడం కాదు చంద్రబాబుని మాత్రమే క్రేన్లేసి లేపండి అని. రాజకీయాల్లో ఎవరు ఏకు మేకవుతారో తెలీదు. తెదేపా వర్గానికి చేతికి మట్టంటకుండా చాలా పనులు పవన్ చేత చేయించుకుంటున్నామని ఒక భ్రమ. చేతికి మట్టి అంటకపోయినా నిలబడ్డ చోటే ఊబిలోకి కూరుకుపోయే స్థితి తెచ్చుకుంటున్నారు పవన్ కి బాకాలూదించే తెదేపా.
స్వామిభక్తి చూపుదాం కానీ దత్తపుత్రసేవ మనకెందుకని కొలికిపూడి మనసులో మాట అయ్యుండొచ్చు. పచ్చమీడియాకి కళ్లెప్పుడు తెరుచుకుంటాయో.
– హరగోపాల్ సూరపనేని