కేసీఆర్ పై టీఆర్ఎస్ నుంచి ధిక్కార స్వరం!

ఇప్పటికే ఈటల రాజేందర్ కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాన్ని కలిగించారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓనర్ షిప్ మీద ఈటల రాజేందర్ మాట్లాడారు.…

ఇప్పటికే ఈటల రాజేందర్ కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాన్ని కలిగించారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓనర్ షిప్ మీద ఈటల రాజేందర్ మాట్లాడారు. తను కూడా పార్టీ ఓనర్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఈటల రాజేందర్ మంత్రిపదవి పోలేదు. ఆయన కేబినెట్ బెర్త్ అలాగే ఉండిపోయింది. అలా కాంప్రమైజ్ అనుకుంటే.. ఇంతలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మరో ధిక్కార స్వరం వినిపించింది. కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా మెలిగిన నాయిని నర్సింహారెడ్డి అసంతృప్తిని వెల్లగక్కారు.

తనకు మంత్రిపదవిని ఇస్తానంటూ కేసీఆర్ ఇప్పుడు హ్యాండిచ్చారనే అసంతృప్తిని వ్యక్తం చేశారాయన. తను అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీచేయాలని అనుకున్నట్టుగా అయితే అప్పుడు కేసీఆర్ వద్దన్నారని నరసింహారెడ్డి అంటున్నారు. తను ఎన్నికల్లో పోటీ చేస్తానంటే వద్దని చెప్పారని, ఎమ్మెల్సీగా ఉంటూనే మంత్రిపదవి అంటూ హామీ ఇచ్చారని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పుడు తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని వాపోయారు. అలాగే తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, అది కూడా జరగలేదన్నారు. తను కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఓనర్ లాంటి వ్యక్తినంటూ, కిరాయికి పార్టీలో ఉంటున్న వాళ్లు ఎన్నిరోజులు ఉంటారో.. అని నాయిని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే హోంమంత్రి వంటి పదవిలో పనిచేసిన తనకు మరే చైర్మన్ పదవి అవసరం లేదని తేల్చారాయన. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో పాతకాపులు ఇలా అసహనం వ్యక్తంచేస్తూ ఉండటం గమనార్హం.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు